Ramiz Raja on India: పాకిస్థాన్ బౌలింగ్‌ను ఇండియా కాపీ కొట్టింది: రమీజ్ రాజా
Ramiz Raja on India: పాకిస్థాన్ బౌలింగ్‌ను ఇండియా కాపీ కొట్టిందని అన్నాడు పీసీబీ మాజీ ఛైర్మన్ రమీజ్ రాజా. న్యూజిలాండ్ పై ఇండియా టీ20 సిరీస్ గెలిచిన తర్వాత రమీజ్ ఈ కామెంట్స్ చేశాడు.
Ramiz Raja on India: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ గా ఉన్న సమయంలో ఇండియాపై ఎప్పుడు చూసినా ఏదో ఒక విమర్శ చేసేవాడు పీసీబీ మాజీ ఛీఫ్ రమీజ్ రాజా. ఇప్పుడా పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా అతడు అలాంటి కామెంట్సే చేస్తున్నాడు. తాజాగా న్యూజిలాండ్ పై ఇండియా సిరీస్ గెలిచిన తర్వాత రమీజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అసలు ఇండియన్ టీమ్ బౌలింగ్ అటాక్ పాకిస్థాన్ నుంచి కాపీ కొట్టిందని, తమ బౌలింగ్ ను చూసే ఇండియా తమ అటాక్ ను రూపొందించుకుందని అనడం గమనార్హం. తన యూట్యూబ్ ఛానెల్లో అతడు మాట్లాడాడు. ప్రస్తుతం ఇండియన్ టీమ్ పేస్ బౌలింగ్ కూడా చాలా మెరుగైన విషయం తెలిసిందే. ఇండియా నుంచి బుమ్రా, షమి, భువనేశ్వర్, సిరాజ్, అర్ష్‌దీప్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లు వచ్చారు.
న్యూజిలాండ్ తో జరిగిన రెండు, మూడు టీ20ల్లో ఇండియన్ బౌలర్లు ఏ స్థాయిలో రాణించారో మనం చూశాం. దీనిని ఉద్దేశించే రమీజ్ ఇలాంటి కామెంట్స్ చేశాడు. "పాకిస్థాన్ ను చూసే ఇండియా తమ బౌలింగ్ కూర్పును రూపొందించిందని నాకు తరచూ అనిపిస్తుంది.
హరీస్ రవూఫ్ లాంటి పేస్ ఉమ్రాన్ మాలిక్ సొంతం. ఇక షాహీన్ అఫ్రిది లాగా అర్ష్‌దీప్ లెఫ్టామ్ వెరైటీని అందిస్తున్నాడు. మిడిల్ ఓవర్లలో వసీం జూనియర్ లాగా హార్దిక్ పాండ్యా ఉన్నాడు. ఇద్దరి పేస్ ఒకేలా ఉంటుంది. ఇక శివమ్ మావి సపోర్టింగ్ బౌలర్ పాత్ర పోషిస్తున్నాడు" అని రమీజ్ అన్నాడు.
అయితే ఇండియా స్పిన్ బౌలింగ్ మాత్రం పాకిస్థాన్ కంటే మెరుగ్గా ఉందని అతడు అభిప్రాయపడ్డాడు. "ఇండియా స్పిన్ బౌలింగ్ పాకిస్థాన్ కంటే కాస్త మెరుగ్గా ఉంది. ఈ రెండు జట్లు ఎప్పుడు ఆడినా పాకిస్థాన్ ఈ విషయంలోనే మెరగవ్వాలని భావిస్తాను" అని రమీజ్ అన్నాడు.
సంబంధిత కథనం