India win Series: న్యూజిలాండ్‌ను చిత్తుచిత్తుగా ఓడించిన టీమిండియా.. సిరీస్ సొంతం-india win series against new zealand after beating them in third t20 by record 168 runs margin ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  India Win Series Against New Zealand After Beating Them In Third T20 By Record 168 Runs Margin

India win Series: న్యూజిలాండ్‌ను చిత్తుచిత్తుగా ఓడించిన టీమిండియా.. సిరీస్ సొంతం

Hari Prasad S HT Telugu
Feb 01, 2023 10:16 PM IST

India win Series: న్యూజిలాండ్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది టీమిండియా. చివరి టీ20లో ఆల్‌రౌండ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టి భారీ విజయం సాధించిన ఇండియన్ టీమ్.. మూడు టీ20ల సిరీస్ ను 2-1తో సొంతం చేసుకుంది.

న్యూజిలాండ్‌ను చిత్తు చేసి సిరీస్ గెలిచిన టీమిండియా
న్యూజిలాండ్‌ను చిత్తు చేసి సిరీస్ గెలిచిన టీమిండియా (AFP)

India win Series: మొదట శుభ్‌మన్ గిల్ మెరుపు సెంచరీ, తర్వాత హార్దిక్ పాండ్యా బౌలింగ్ మెరుపులతో మూడో టీ20లో న్యూజిలాండ్ పై రికార్డు విజయం సాధించింది టీమిండియా. ఆ టీమ్ ను ఏకంగా 168 పరుగుల తేడాతో చిత్తు చేసింది. టీ20ల్లో ఇండియాకు పరుగుల పరంగా ఇదే అతి పెద్ద విజయం కావడం విశేషం. 

ట్రెండింగ్ వార్తలు

అంతేకాదు ఐసీసీలో పూర్తిస్థాయి సభ్యులుగా ఉన్న దేశాల మధ్య జరిగిన టీ20ల్లోనూ ఇదే అతిపెద్ద విజయం. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్ ను ఇండియా 2-1 తేడాతో సొంతం చేసుకుంది. తొలి టీ20లో న్యూజిలాండ్ గెలవగా.. తర్వాత రెండు టీ20లు ఇండియా సొంతమయ్యాయి.

235 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ కేవలం 66 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 4 వికెట్లు తీసుకోగా.. ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, శివమ్ మావిలు తలా రెండు వికెట్లు తీసుకున్నారు. న్యూజిలాండ్ టీమ్ లో డారిల్ మిచెల్ మాత్రమే 35 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 

మిచెల్ సాంట్నర్ 13 రన్స్ చేశాడు. మరే ఇతర న్యూజిలాండ్ బ్యాటర్ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోవడం విశేషం. తొలి ఓవర్ నుంచే ఆ టీమ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఏ దశలోనూ లక్ష్యం దిశగా వెళ్లలేదు. చివరికి 12.1 ఓవర్లలోనే 66 పరుగులకు కుప్పకూలింది.

గిల్ సునామీ

అంతకుముందు వన్డేలలో తన ఫామ్ ను టీ20ల్లోకీ తీసుకొచ్చాడు శుభ్‌మన్ గిల్. న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 54 బంతుల్లోనే టీ20ల్లో తొలి సెంచరీ చేశాడు. ఫోర్లు, సిక్సర్ల మోత మోగించిన గిల్.. ఒంటి చేత్తో టీమిండియాకు భారీ స్కోరు సాధించి పెట్టాడు.

అతని దూకుడుతో ఇండియన్ టీమ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 234 రన్స్ చేసింది. శుభ్‌మన్ గిల్ కేవలం 63 బంతుల్లోనే 126 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో మొత్తం 12 ఫోర్లు, 7 సిక్స్ లు ఉండటం విశేషం. రాహుల్ త్రిపాఠీ (44), హార్దిక్ పాండ్యా (30) కూడా రాణించారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియాకు రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. ఇషాన్ కిషన్ (1) మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే తర్వాత క్రీజులో వచ్చిన రాహుల్ త్రిపాఠీతో కలిసి శుభ్‌మన్ గిల్ చెలరేగడంతో ఇండియా స్కోరు పరుగులు తీసింది. ఈ ఇద్దరూ రెండో వికెట్ కు 42 బంతుల్లోనే 80 రన్స్ జోడించారు. త్రిపాఠీ కేవలం 22 బాల్స్ లోనే 44 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 3 సిక్స్ లు ఉన్నాయి.

తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా కాసేపు మెరుపులు మెరిపించి ఔటయ్యాడు. సూర్య 13 బంతుల్లో 24 పరుగులు చేశాడు. అతడు రెండు సిక్స్ లు, ఒక ఫోర్ బాదాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా 17 బంతుల్లో 30 రన్స్ చేసి చివరి ఓవర్లో పెవిలియన్ చేరాడు.

WhatsApp channel