India vs New Zealand 3rd T20: సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్.. టీమిండియా భారీ స్కోరు-india vs new zealand 3rd t20 in ahmedabad as shubman gill hits his maiden t20 century ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  India Vs New Zealand 3rd T20: సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్.. టీమిండియా భారీ స్కోరు

India vs New Zealand 3rd T20: సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్.. టీమిండియా భారీ స్కోరు

Hari Prasad S HT Telugu
Feb 01, 2023 08:42 PM IST

India vs New Zealand 3rd T20: సెంచరీ బాదాడు శుభ్‌మన్ గిల్. దీంతో న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా భారీ స్కోరు చేసింది. టీ20ల్లో గిల్ కు ఇదే తొలి సెంచరీ.

టీ20ల్లో తొలి సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్
టీ20ల్లో తొలి సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్ (AP)

India vs New Zealand 3rd T20: వన్డేలలో తన ఫామ్ ను టీ20ల్లోకీ తీసుకొచ్చాడు శుభ్‌మన్ గిల్. న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 54 బంతుల్లోనే టీ20ల్లో తొలి సెంచరీ చేశాడు. ఫోర్లు, సిక్సర్ల మోత మోగించిన గిల్.. ఒంటి చేత్తో టీమిండియాకు భారీ స్కోరు సాధించి పెట్టాడు.

అతని దూకుడుతో ఇండియన్ టీమ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 234 రన్స్ చేసింది. శుభ్‌మన్ గిల్ కేవలం 63 బంతుల్లోనే 126 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో మొత్తం 12 ఫోర్లు, 7 సిక్స్ లు ఉండటం విశేషం. రాహుల్ త్రిపాఠీ (44), హార్దిక్ పాండ్యా (30) కూడా రాణించారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియాకు రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. ఇషాన్ కిషన్ (1) మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే తర్వాత క్రీజులో వచ్చిన రాహుల్ త్రిపాఠీతో కలిసి శుభ్‌మన్ గిల్ చెలరేగడంతో ఇండియా స్కోరు పరుగులు తీసింది. ఈ ఇద్దరూ రెండో వికెట్ కు 42 బంతుల్లోనే 80 రన్స్ జోడించారు. త్రిపాఠీ కేవలం 22 బాల్స్ లోనే 44 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 3 సిక్స్ లు ఉన్నాయి.

తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా కాసేపు మెరుపులు మెరిపించి ఔటయ్యాడు. సూర్య 13 బంతుల్లో 24 పరుగులు చేశాడు. అతడు రెండు సిక్స్ లు, ఒక ఫోర్ బాదాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా 17 బంతుల్లో 30 రన్స్ చేసి చివరి ఓవర్లో పెవిలియన్ చేరాడు.

WhatsApp channel