Ferguson Praises Hardik: హార్దిక్‌పై న్యూజిలాండ్ పేసర్ ప్రశంసలు.. అసాధారణ లీడర్ అవుతాడని స్పష్టం
Ferguson Praises Hardik: టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యాపై న్యూజిలాండ్ పేసర్ లోకీ ఫెర్గ్యూసన్ ప్రశంసల వర్షం కురిపించాడు. హార్దిక్ నాయకత్వ నైపుణ్యాలకు తాను ఫిదా అయ్యానని, భారత్‌కు అసాధారణ కెప్టెన్ అవుతాడని స్పష్టం చేశాడు.
Ferguson Praises Hardik: భారత పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను శాశ్వతం చేయాలని గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. రెగ్యూలర్‌గా పరిమిత ఓవర్ల కెప్టెన్సీ పగ్గాలను హార్దిక్‌కు అప్పగించాలని, టెస్టులకు మాత్రమే రోహిత్‌ను పరిమితం చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై బీసీసీఐ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ గతేడాది టీ20 వరల్డ్ కప్ ముగిసినప్పటి నుంచి పొట్టి ఫార్మాట్‌కు హార్దిక్ పాండ్యానే వ్యవహరిస్తున్నాడు. ఇదే సమయంలో రోహిత్ శర్మను విశ్రాంతి పేరుతో దూరం చేస్తున్నారు. ఫలితంగా హార్దిక్‌కు కెప్టెన్సీ శాశ్వతం చేయాలనే వాదనలు మరింత పెరుగుతున్నాయి. అంతేకాకుండా అతడి కెప్టెన్సీ నైపుణ్యాలకు పలువురు మాజీలు, విదేశీ క్రికెటర్లు కూడా ఫిదా అవుతున్నారు. తాజాగా న్యూజిలాండ్ పేసర్ లోకీ ఫెర్గ్యూసన్ హార్దిక్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.
"భారత్ తరఫున కెప్టెన్‌గా అతడు(హార్దిక్) బాగా చేస్తున్నాడు. టీమ్‌తో కలిసి చర్చిస్తున్నప్పుడు అతడి బాడీ లాంగ్వేజ్‌ను గమనిస్తే అద్భుతం. అతడు అసాధారణమైన లీడర్‌గా ఎదుగుతాడనిపిస్తుంది. కచ్చితంగా అతడి కింద ఆడటాన్ని ఆస్వాదించాను." ఫెర్గ్యూసన్ అన్నాడు.
"కివీస్.. టీమిండియాపై వన్డే సిరీస్ ఓడటంపై పెర్గ్యూసన్ స్పందించాడు. చూడండి వన్డే సిరీస్ ఛాలెంజింగ్‌గా ఉంది. మొదటి వన్డేలో మాకు గెలిచే అవకాశాలు మాకు కూడా వచ్చాయి. రెండో వన్డేలో మా ప్రదర్శన మరీ పేలవంగా సాగింది. మూడో వన్డేలో కూడా మేము బాగా ట్రై చేశాం. పేపర్‌పై గణాంకాలు 3-0గా ఉండవచ్చు. కానీ ఆ సిరీస్ చాలా పోటీగా సాగిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు టీ20 సిరీస్ చూస్తే ఎంతో పోటీగా సాగుతుందో మీకే అర్థమవుతుంది. మూడో వన్డే అహ్మదాబాద్ లాంటి సుందరమైన స్డేడియంలో రావడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది" అని ఫెర్గ్యూసన్ స్పష్టం చేశాడు.
న్యూజిలాండ్‌పై భారత్ వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేయగా.. టీ20 సిరీస్‌లో మాత్రం కివీస్ అంత సులభంగా పట్టు విడవడం లేదు. తొలి టీ20లో సునాయసంగా విజయం సాధించిన బ్లాక్ క్యాప్స్.. రెండో టీ20లోనూ 99 పరుగుల పరిమిత లక్ష్యాన్ని చివరి బంతి వరకు కాపాడుకుని తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. దీంతో టీ20 సిరీస్ 1-1తో సమమైంది. ఇంక చివరిదైన మూడో టీ20 అహ్మదబాద్ నరేంద్రమోదీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరగనుంది.
సంబంధిత కథనం