Ravi Shastri on Umran Malik: ఉమ్రాన్ మాలిక్‌కు వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కుతుంది.. ఎలాగో చెప్పిన రవిశాస్త్రి
Ravi Shastri on Umran Malik: ఉమ్రాన్ మాలిక్‌కు వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కుతుందని చెప్పాడు మాజీ కోచ్ రవిశాస్త్రి. ఇప్పుడున్న పోటీలో అదెలా సాధ్యమో కూడా అతడు వివరించాడు.
Ravi Shastri on Umran Malik: టీమిండియా పేస్ సెన్సేషన్ ఉమ్రాన్ మాలిక్ ప్రస్తుతం టీమ్ లో ఉన్నాడు. బుమ్రా, షమి, భువనేశ్వర్ లాంటి సీనియర్ బౌలర్లు లేకపోవడంతో అతనికి తుది జట్టులో అప్పుడప్పుడూ చోటు దక్కుతోంది. ముఖ్యంగా వన్డే వరల్డ్ కప్ ఏడాదిలో ఈ ఫార్మాట్ లో ఉమ్రాన్ లాంటి యువ బౌలర్ రెగ్యులర్ గా టీమ్ లో ఉండటం సందేహమే.
బుమ్రా ఒకవేళ తిరిగి వస్తే అతడు ఫస్ట్ ఛాయిస్ బౌలర్ అవుతాడు. అతనికితోడు షమి, సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ లాంటి బౌలర్లు సిద్ధంగా ఉంటారు. హార్దిక్ పాండ్యా కూడా ఈ మధ్య బాల్ తో తన మునుపటి మ్యాజిక్ చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్రాన్ వరల్డ్ కప్ టీమ్ లో ఉంటాడా అంటే కచ్చితంగా ఉండొచ్చని అంటున్నాడు టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి. అంతేకాదు టీ20ల కంటే కూడా వన్డేల్లోనే అతనికి ఎక్కువ అవకాశం ఉందని అన్నాడు.
"అతనికి టీ20ల కంటే వన్డేల్లోనే ఎక్కువ అవకాశం ఉంది. ఈ రోజుల్లోని బిజీ షెడ్యూల్ కారణంగా అతడు ఎప్పుడూ టీమ్ తో పాటే ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఎవరికి గాయాలు అవుతాయో తెలియదు. వరల్డ్ కప్ టీమ్ ను అనౌన్స్ చేయడానికి డెడ్ లైన్ ఉంటుంది. ప్లేయర్స్ ఫిట్‌నెస్ కీలకం. అందుకే బౌలర్లు భారాన్ని ఎలా మోస్తారో చూడటానికి రానున్న ఐపీఎల్ కీలకం కానుంది" అని రవిశాస్త్రి చెప్పాడు.
న్యూజిలాండ్ తో చివరి టీ20 ఆడిన ఉమ్రాన్ 9 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక ఇప్పుడతడు ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ కు మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత సన్ రైజర్స్ తరఫున ఐపీఎల్లో ఆడతాడు. మరోవైపు బుమ్రా జట్టులోకి తిరిగి వస్తే స్వదేశంలో ఇండియాను ఓడించడం ఏ టీమ్ కైనా దాదాపు అసాధ్యమని అన్నాడు రవిశాస్త్రి.
"బుమ్రా కచ్చితంగా జట్టులోకి రావాలని కోరుకుంటారు. ఎందుకంటే అతడు మ్యాజిక్ చేస్తాడు. అతడో స్టార్. పూర్తి ఫిట్ గా ఉన్న బుమ్రా తిరిగి జట్టులోకి వస్తే టీమ్ మరింత బలంగా మారుతుంది. బుమ్రా బౌలింగ్ చేయడం జట్టును పూర్తి భిన్నంగా మారుస్తుంది. స్వదేశంలో ఇండియాకు గొప్ప రికార్డు ఉంది. ఇప్పటికే ప్లేయర్స్ అంతా ఫిట్ గా ఉన్నారు. వీళ్లకు బుమ్రా తోడైతే టీమ్ మరింత పటిష్ఠంగా మారుతుంది" అని రవిశాస్త్రి చెప్పాడు.
సంబంధిత కథనం