Gautam Gambhir on Rohit Sharma: రోహిత్ కూడా కోహ్లినే ఫాలో అవుతున్నాడు.. ఇద్దరి కెప్టెన్సీలో తేడా లేదు: గంభీర్
20 February 2023, 17:02 IST
- Gautam Gambhir on Rohit Sharma: రోహిత్ కూడా కోహ్లినే ఫాలో అవుతున్నాడని, ఇద్దరి కెప్టెన్సీలో పెద్దగా తేడా లేదని అన్నాడు టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్. ఆస్ట్రేలియాపై రెండో టెస్ట్ గెలిచిన తర్వాత గౌతీ ఈ కామెంట్స్ చేశాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి
Gautam Gambhir on Rohit Sharma: ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన రెండో టెస్టులో ఇండియా గెలిచిన తర్వాత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా విరాట్ కోహ్లినే ఫాలో అవుతున్నాడని, ఇద్దరి కెప్టెన్సీలో పెద్దగా తేడా ఏమీ లేదని అనడం విశేషం.
"నిజాయతీగా చెప్పాలంటే రోహిత్ శర్మ అద్భుతమైన కెప్టెన్ అని నేను నమ్మాను. కానీ రోహిత్, విరాట్ కెప్టెన్సీలలో పెద్దగా తేడా లేదు. ముఖ్యంగా టెస్టు ఫార్మాట్ లో. విరాట్ కోహ్లి ఈ స్టైల్ కెప్టెన్సీ మొదలుపెట్టాడు" అని మ్యాచ్ తర్వాత స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ గంభీర్ అన్నాడు. స్పిన్నర్లు అశ్విన్, జడేజాలను ఉపయోగిస్తున్న తీరుపై గంభీర్ స్పందించాడు.
"ఈ టెస్ట్ టీమ్ కు కెప్టెన్సీ అవకాశం వచ్చిన ప్రతిసారీ విరాట్ కోహ్లి అద్భుతంగా చేశాడు. బహుశా రోహిత్ కూడా అదే ఫాలో అవుతున్నాడు. నిజంగా చెప్పాలంటే రోహిత్ తన సొంత స్టైల్ క్రియేట్ చేయలేదనే చెప్పాలి. అశ్విన్, జడేజాలను విరాట్ కోహ్లి మేనేజ్ తీరు చూస్తే.. ఇద్దరి కెప్టెన్సీ అచ్చు గుద్దినట్లు ఒకేలా ఉంది" అని గంభీర్ స్పష్టం చేశాడు.
కెప్టెన్లు మారినా.. స్వదేశంలో అశ్విన్, జడేజా జోడీ ఇండియన్ టీమ్ కు తురుపు ముక్కలు. వీళ్ల జోడీని భారత కండిషన్స్ లో ఎదుర్కోవడం ఎలాంటి ప్రత్యర్థికైనా సవాలే. తొలి రెండు టెస్టుల్లోనూ ఈ ఇద్దరి దెబ్బకు ఆస్ట్రేలియా కుదేలైంది. రెండో టెస్టులో జడేజా ఏకంగా 10 వికెట్లు తీసుకున్నాడు. అంతేకాదు తొలి టెస్టులోనూ అతడు అటు బ్యాట్ తో 70 రన్స్ చేయడంతోపాటు 7 వికెట్లు తీశాడు.
ఇక విరాట్, రోహిత్ లలో ఎవరు బెస్ట్ అన్నదానికి మాత్రం గంభీర్ సమాధానమివ్వలేదు. అయితే షమి, సిరాజ్, బుమ్రా, అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ లాంటి ప్లేయర్స్ ను సమర్థంగా ఉపయోగించుకోవడంలో మాత్రం కోహ్లి సక్సెస్ అయ్యాడని గంభీర్ అన్నాడు. ఇక ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ టీమ్స్ ను వాళ్ల సొంతగడ్డపై ఓడించడమే రోహిత్ ముందు ఉన్న అతి పెద్ద సవాలని కూడా ఈ సందర్భంగా గంభీర్ స్పష్టం చేశాడు.