Nasser Hussain on India: ఇంగ్లండ్‌కు అసలు సవాలు ఇండియాలోనే..: నాసిర్ హుస్సేన్
20 February 2023, 16:10 IST
- Nasser Hussain on India: ఇంగ్లండ్‌కు అసలు సవాలు ఇండియాలోనే అని అన్నాడు ఆ టీమ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్. న్యూజిలాండ్‌పై తొలి టెస్టులో ఘన విజయం సాధించిన తర్వాత అతడీ కామెంట్స్ చేయడం విశేషం.
ఇంగ్లండ్ క్రికెట్ టీమ్
Nasser Hussain on India: ఇండియాలో ఆడటం ప్రపంచంలోని ఏ క్రికెట్ టీమ్ కు అయినా సవాలే. టెస్టుల్లో నంబర్ వన్ గా ఎదిగి ఇండియాకు వచ్చిన ఆస్ట్రేలియా పరిస్థితి ఇప్పుడెలా మారిందో మనం చూస్తూనే ఉన్నాం. తొలి రెండు టెస్టులను మూడు రోజుల్లోపే ముగించేసింది టీమిండియా. ఈ నేపథ్యంలో ఇండియా టూర్ అంటేనే ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుడుతోంది.
చివరిసారి 2012లో ఇంగ్లండ్ చేతుల్లో స్వదేశంలో సిరీస్ కోల్పోయిన ఇండియా.. తర్వాత ఒక్క సిరీస్ కూడా ఓడలేదు. మరోవైపు అదే ఇంగ్లండ్ ఇప్పుడు బజ్‌బాల్ స్టైల్ టెస్ట్ క్రికెట్ అంటూ ప్రత్యర్థులను చిత్తు చేస్తోంది. తాజాగా న్యూజిలాండ్ ను వాళ్ల సొంతగడ్డపై తొలి టెస్టులో ఏకంగా 267 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ప్రస్తుతం ఇండియాలో ఆస్ట్రేలియా టీమ్ ఆటతీరు చూసిన తర్వాత అతడు స్పందించాడు. "ఇండియాలో ఆస్ట్రేలియా 2004 తర్వాత మళ్లీ గెలవలేదు. ఇంగ్లండ్ కు కూడా అసలైన సవాలు ఇండియానే. యాషెస్ సిరీస్ కూడా నోరూరిస్తోంది. ఈ సిరీస్ హోరాహోరీగా సాగుతుంది" అని హుస్సేన్ అన్నాడు. యాషెస్ లో గెలుపోటములు ఆస్ట్రేలియా బ్యాటింగ్ పైనే ఆధారపడి ఉంటాయని చెప్పాడు.
"ఆస్ట్రేలియా దగ్గర ఉన్న క్వాలిటీ బౌలింగ్ అటాక్ పై బజ్‌బాల్ స్టైల్ పని చేస్తుందా అని చాలా మంది అడుగుతున్నారు. కానీ నా వరకూ యాషెస్ గెలుపోటములు ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ పైనే ఆధారపడి ఉంటాయి. స్వదేశం బయట వాళ్లు బ్యాటింగ్ చాలా దారుణంగా ఉంటోంది. ఇంగ్లండ్ లో వాళ్లు రన్స్ చేస్తే గనక రసవత్తరంగా ఉంటుంది" అని హుస్సేన్ అన్నాడు.
ఇక ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్ పై కూడా అతడు ప్రశంసలు కురిపించాడు. "సరైన సమయంలో సరైన వ్యక్తి మెక్‌కలమ్. అతడు రాక ముందు ఇంగ్లండ్ టీమ్ పరిస్థితి బాగా లేదు. కొవిడ్ వల్ల కావచ్చు లేదంటే వాళ్ల రొటేషన్ విధానం వల్ల కావచ్చు. వాళ్లకు స్వేచ్ఛ అందించడానికి మెక్‌కలమ్ లాంటి వాళ్లు అసవరం అయ్యారు. స్టోక్స్ రూపంలో మంచి కెప్టెన్ కూడా దొరికాడు" అని హుస్సేన్ అభిప్రాయపడ్డాడు.