Rohit Sharma on Karthik vs Pant: పంత్, కార్తీక్‌లలో ఎవరుండాలి.. రోహిత్ మాట ఇదీ
26 September 2022, 14:22 IST
- Rohit Sharma on Karthik vs Pant: పంత్, కార్తీక్‌లలో తుది జట్టులో ఎవరుండాలి? ఇప్పుడు చర్చంతా దీని చుట్టే తిరుగుతోంది. దీనిపై ఎంతో మంది ఎన్నో అభిప్రాయాలు చెప్పారు. తాజాగా రోహిత్ శర్మ కూడా దీనిపై స్పందించాడు.
పంత్, కార్తీక్ లలో ఎవరు ఆడాలన్న చర్చపై స్పందించిన రోహిత్ శర్మ
Rohit Sharma on Karthik vs Pant: టీ20 వరల్డ్‌కప్‌కు ముందు టీమిండియాలో కొత్త చర్చ జరుగుతోంది. తుది జట్టు కోసం ఇద్దరు వికెట్ కీపర్లు రిషబ్ పంత్, దినేష్ కార్తీక్ అందుబాటులో ఉన్నారు. వీళ్లలో ఎవరిని తీసుకోవాలి? ఎవరిని పక్కన పెట్టాలన్నది సమస్యగా మారింది. ఈ ఇద్దరూ మంచి టాలెంటెడ్ ప్లేయర్సే. తమదైన రోజు మ్యాచ్‌ను ఒంటిచేత్తో మలుపు తిప్పగలరు.
అందుకే ఈ ఇద్దరూ తుది జట్టులో ఉండాలని టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌లు కూడా చెబుతున్నారు. అయితే దీనిపై తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా స్పందించాడు. ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ 2-1తో గెలిచిన తర్వాత మీడియాతో మాట్లాడిన రోహిత్.. ఈ చర్చపై టీమ్ మేనేజ్‌మెంట్ ఏమనుకుంటుందో చెప్పేశాడు.
వరల్డ్‌కప్‌లోపు ఈ ఇద్దరికీ తగినన్ని అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నట్లు రోహిత్ స్పష్టం చేశాడు. "వరల్డ్‌కప్‌కు ముందు ఈ ఇద్దరు ప్లేయర్స్‌కు తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ ఉండాలి. మేము ఆసియా కప్‌కు వెళ్లినప్పుడు ఈ ఇద్దరినీ తుది జట్టులో ఆడించాలన్న ఆలోచన ఉంది. అయితే దినేష్‌కు కాస్త ఎక్కువ గేమ్ టైమ్ ఉండాలని భావించాను. ఈ సిరీస్‌లో అతనికి ఎక్కువగా బ్యాటింగ్ అవకాశం రాలేదు. మూడు బాల్స్ ఆడినట్లున్నాడు. అది సరిపోదు. పంత్‌కు కూడా గేమ్ టైమ్ అవసరమే. అయితే ఈ సిరీస్‌లో ఉన్న పరిస్థితులను బట్టి బ్యాటింగ్ లైనప్‌కు కట్టుబడి ఉండాలని అనుకున్నాను" అని రోహిత్ చెప్పాడు.
ఆస్ట్రేలియాతో మూడు టీ20ల్లోనూ దినేష్ కార్తీక్‌కు ఆడే అవకాశం లభించింది. రెండో టీ20లో చివర్లో వచ్చి సిక్స్, ఫోర్‌తో మ్యాచ్‌ను గెలిపించాడు. పంత్‌కు మాత్రం ఒకే మ్యాచ్‌లో అవకాశం వచ్చింది. అయితే రానున్న సౌతాఫ్రికా సిరీస్‌లో మాత్రం పంత్‌కు అవకాశం కల్పించనున్నట్లు రోహిత్ హింట్ ఇచ్చాడు. సౌతాఫ్రికాతో మూడు టీ20 సిరీస్ జరగనుండగా.. తొలి మ్యాచ్ ఈ నెల 28న జరగనుంది.
"సౌతాఫ్రికాతో ఏం చేస్తామో మాకు తెలియదు. వాళ్ల బౌలింగ్ ఎలా ఉంటుందో చూడాలి. వాళ్ల బౌలింగ్ లైనప్ బట్టి దానిని సమర్థంగా ఎదుర్కొనే బ్యాటర్లను తీసుకోవాల్సి ఉంటుంది. దానిపై ఆధారపడి ఉంది. బ్యాటింగ్‌లో ఫ్లెక్సిబుల్‌గా ఉండాలని అనుకుంటున్నాం. లెఫ్ట్ హ్యాండర్ అవసరం అనిపిస్తే లెఫ్ట్ హ్యాండర్‌ను తీసుకొస్తాం. రైట్ హ్యాండర్ కావాలంటే అలాగే చేస్తాం. అయితే ఆ ఇద్దరినీ చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తాం. ఆ ఇద్దరికి వరల్డ్‌కప్‌కు ముందు తగినంత మ్యాచ్ సమయం అవసరమే కానీ.. తుది జట్టులో దురదృష్టవశాత్తూ 11 మందికే అవకాశం ఉంటుంది" అని రోహిత్ అన్నాడు.