Gavaskar on T20 World Cup Team: టీ20 వరల్డ్‌కప్‌లో ఆడబోయే 15 మంది సభ్యుల ఇండియన్ టీమ్‌ను సోమవారం (సెప్టెంబర్ 12) బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. పెద్దగా ఆశ్చర్యపరిచే నిర్ణయాలేవీ లేకుండానే సెలక్టర్లు టీమ్‌ను ఎంపిక చేశారు. సంజు శాంసన్, మహ్మద్ షమిలకు ఇందులో చోటు దక్కకపోవడంపై ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు.
అయితే మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ మాత్రం టీమ్ ఎంపిక చాలా బాగుందని అనడం గమనార్హం. ఇండియా టుడేతో మాట్లాడిన గవాస్కర్.. దీపక్ చహర్‌ను మాత్రం తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఇక యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను ఎంపిక చేయకపోవడంపై స్పందిస్తూ.. అతని వయసు తక్కువని, ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో అవకాశం దక్కుతుందని అన్నాడు.
"రవి బిష్ణోయ్ వయసు చిన్నది. రెండేళ్లలో మరో టీ20 వరల్డ్‌కప్ ఉంది. భవిష్యత్తులో చాలా టీ20 వరల్డ్‌కప్స్ ఉన్నాయి కాబట్టి అతడు ఎప్పుడైనా ఆడొచ్చు. ఇక తనను టీమ్‌లో నుంచి తీసేసే పరిస్థితి లేకుండా రాణించడమే టార్గెట్‌గా పెట్టుకోవాలి. ఇది అతనికి మంచి అనుభవం. ప్రతి టీమ్‌లోకి తాను సులువుగా ఎంపిక కాలేనన్న విషయం అతనికి తెలిసి వచ్చింది" అని గవాస్కర్ అన్నాడు.
బుమ్రా, హర్షల్ పటేల్‌ల రాకతో టీమ్ పటిష్టంగా మారిందని సన్నీ అభిప్రాయపడ్డాడు. "ఈ టీమ్ చాలా బాగుంది. బుమ్రా, హర్షల్ పటేల్‌లు రావడంతో ఇండియా తన టార్గెట్‌ను డిఫెండ్ చేసుకునే అవకాశాలు పెరిగాయి. ఇప్పటి వరకూ టీమ్‌కు తన స్కోరు డిఫెండ్ చేసుకోవడం సమస్యగా మారింది. ఈ ఇద్దరు బౌలర్లు ఆ పనిని సమర్థవంతంగా చేయగలరు" అని గవాస్కర్ అన్నాడు.
"దీపక్ చహర్ ఉండాల్సింది. కానీ వాళ్లు అర్ష్‌దీప్‌ను కొనసాగించారు. ఇది టీమ్‌కు లెఫ్టామ్ పేసర్ ఆప్షన్‌ను అందిస్తుంది. ఇది మంచి సెలక్షన్. అదెందుకు లేదు.. ఇదెందుకు లేదు అన్న ప్రశ్నలు ఎప్పుడూ ఉంటాయి. కానీ సెలక్షన్ జరిగిపోయింది. ఇదే ఇండియన్ టీమ్. 100 శాతం మనం ఈ టీమ్‌ను సపోర్ట్ చేయాలి" అని గవాస్కర్ స్పష్టం చేశాడు.
2021 వరల్డ్‌కప్ టీమ్‌తో పోలిస్తే ఈ టీమ్‌లో ఐదు కీలకమైన మార్పులు జరిగాయి. ఈసారి దీపక్ హుడా, అర్ష్‌దీప్ సింగ్, యుజువేంద్ర చహల్, దినేష్ కార్తీక్, హర్షల్ పటేల్‌లు టీమ్‌లోకి వచ్చారు. గతేడాది ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, రాహుల్ చహర్, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమిలు 15 మంది టీమ్‌లో ఉండగా.. ఈసారి వాళ్లు మిస్సయ్యారు.