Telugu News  /  Sports  /  Gavaskar On Virat Kohli Says He Should Have Reveal The Names Who Did Not Message Him
విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి (ANI)

Gavaskar on Virat Kohli: తనకు మెసేజ్‌ చేయని ప్లేయర్స్‌ పేర్లు విరాట్‌ చెప్పాలి: గవాస్కర్‌

05 September 2022, 20:39 ISTHari Prasad S
05 September 2022, 20:39 IST

Gavaskar on Virat Kohli: తనకు మెసేజ్‌ చేయని ప్లేయర్స్‌ పేర్లను విరాట్‌ కోహ్లి చెప్పాలని అన్నాడు మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌. ఈ విషయాన్ని అతడు ఎందుకు బయటపెట్టాలని అనుకున్నాడో తనకు తెలియదని అన్నాడు.

Gavaskar on Virat Kohli: తాను టెస్ట్‌ కెప్టెన్సీ వదులుకున్నప్పుడు ధోనీ తప్ప మరే ప్లేయర్‌ కూడా మెసేజ్‌ చేయలేదని మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చెప్పడం ఆసక్తి రేపింది. అయితే ఇప్పుడతని కామెంట్స్‌పై సునీల్‌ గవాస్కర్‌ స్పందించాడు. ఇండియా టుడేతో మాట్లాడుతూ.. తనకు మెసేజ్‌ చేయని ప్రస్తుత, మాజీ క్రికెటర్లందరి పేర్లు విరాట్‌ చెప్పాల్సిందని అన్నాడు.

ట్రెండింగ్ వార్తలు

మీడియాతో మాట్లాడుతూ.. విరాట్‌ ఇలాంటి విషయం ఎందుకు బయటపెట్టాడో తనకు తెలియడం లేదని సన్నీ చెప్పాడు. "డ్రెస్సింగ్‌ రూమ్‌ లోపల ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ తనకు మద్దతుగా నిలిచిన వ్యక్తి పేరు చెప్పినప్పుడు అలా నిలవని వాళ్ల పేర్లు కూడా చెప్పాల్సింది. అలా అయితే కాస్తయినా బాగుండేది. మిగతా వాళ్లు ఎవరూ చెప్పలేదు అన్న భావన రాకుండా ఉండేది" అని గవాస్కర్‌ అన్నాడు.

గతేడాది టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత టీ20 కెప్టెన్సీ వదులుకున్న విరాట్‌ కోహ్లి.. ఆ తర్వాత సౌతాఫ్రికా సిరీస్‌లో ఓటమితో టెస్ట్‌ కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్న విషయం తెలిసిందే. తాను ఆ నిర్ణయం తీసుకున్న సమయంలో ఒక్క ధోనీ మాత్రమే తనకు మెసేజ్‌ చేశాడని ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌ తర్వాత మీడియాతో మాట్లాడుతూ కోహ్లి చెప్పాడు. ఏవైనా సలహాలు ఉంటే.. తనకు నేరుగా చెప్పాలని, ఇలా పబ్లిగ్గా విమర్శించడం సరి కాదని విరాట్‌ అన్నాడు.

ఇక ప్రస్తుత కెప్టెన్‌ రోహిత్‌, కోచ్ ద్రవిడ్‌ల నేతృత్వంలో డ్రెస్సింగ్‌ రూమ్‌ వాతావరణం చాలా బాగుందని, తాను తిరిగి తన మోజోను పొందినట్లు చెప్పాడు. అయితే డ్రెస్సింగ్‌ రూమ్‌పై ప్లేయర్స్‌ను ప్రశ్నలు అడగడం దండగ అని, దాని వల్ల వచ్చే లాభమేమీ ఉండదని గవాస్కర్‌ అనడం గమనార్హం. ఇప్పుడు టీమ్‌లో ఉన్న ప్లేయర్‌ అప్పటి కెప్టెన్‌, కోచ్‌ గురించి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడరని, అలా మాట్లాడి తమ కెరీర్లకు ముప్పు తెచ్చుకోరని కూడా సన్నీ అన్నాడు.