Ponting on Karthik vs Pant: కార్తీక్, పంత్‌లలో ఎవరిని తీసుకోవాలి.. పాంటింగ్ సలహా ఇదీ
Ponting on Karthik vs Pant: కార్తీక్, పంత్‌లలో ఎవరిని తీసుకోవాలి అన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. అయితే దీనిపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మరో విధంగా స్పందించాడు.
Ponting on Karthik vs Pant: టీమిండియా తుది జట్టు ఎంపిక ఈ మధ్యకాలంలో పెద్ద చర్చనీయాంశం అవుతోంది. అందుబాటులో ఉన్న ప్లేయర్స్‌లో ఎవరిని ఉంచాలి, ఎవరిని తీసేయాలన్నది టీమ్ మేనేజ్‌మెంట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. రకరకాల ప్రయోగాలు కూడా చేస్తోంది. అయితే ఇప్పుడు చర్చ వికెట్ కీపర్ల పైకి మళ్లింది.
టీ20 వరల్డ్‌కప్‌కు కూడా ఎంపికైన రిషబ్ పంత్, దినేష్ కార్తీక్‌లలో ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలి అన్నదే ఆ చర్చ. ఈ విషయంలో క్రికెట్ ప్రపంచం రెండుగా చీలిపోయింది. కొందరు ఫినిషర్ అయిన కార్తీక్ వైపు మొగ్గితే, మరికొందరు టాలెంట్ బ్యాటర్ రిషబ్ పంతే బెటరని అంటున్నారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ దీనిపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
అసలు ఇద్దరికీ తుది జట్టులో చోటు కల్పించాల్సిందే అని పాంటింగ్ తేల్చి చెప్పడం విశేషం. ఐసీసీ రివ్యూ కాలమ్‌లో అతడు ఈ చర్చపై స్పందించాడు. "తుది జట్టులో వికెట్‌కీపర్ బ్యాటర్ స్థానాన్ని ఎవరికి ఇవ్వాలన్న చర్చ ఇండియన్ క్రికెట్ సర్కిళ్లలో జరుగుతోంది. కార్తీక్ మంచి ఫినిషర్ అయితే, రిషబ్ పంత్ మంచి టాలెంట్ ఉన్న ఆటగాడు. నా అభిప్రాయం మేరకు ఇద్దరికీ తుది జట్టులో చోటు దక్కాలి. ఆ ఇద్దరూ కీపర్లన్న విషయాన్ని పక్కన పెట్టండి. వాళ్ల బ్యాటింగ్ టాలెంట్ మాత్రమే చూడండి" అని పాంటింగ్ అన్నాడు.
ఆ ఇద్దరూ టీమ్‌లో ఉంటే ప్రత్యర్థులకు దడే అని కూడా రికీ చెప్పాడు. "రిషబ్ పంత్ మిడిలార్డర్‌లో, దినేష్ కార్తీక్ ఫినిషర్‌గా వస్తే ఆ టీమ్ చాలా ప్రమాదకరంగా కనిపిస్తుంది" అని పాంటింగ్ అన్నాడు. ఈ ఇద్దరిలో ఒక్కరికే ఓటెయ్యాలంటే మాత్రం తాను కూడా రిషబ్‌పంత్ వైపే మొగ్గు చూపుతానని అన్నాడు. కార్తీక్ కంటే పంత్‌కే ఎక్కువ అవకాశాలు వస్తాయని పాంటింగ్ స్పష్టం చేశాడు.
ఇంతకుముందు టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. టీమిండియా తుది జట్టులో పంత్, కార్తీక్ ఇద్దరూ ఉండాలని డిమాండ్ చేశాడు. ఆసియా కప్‌లో కార్తీక్‌ను కాదని పంత్‌కు చోటివ్వడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. మొన్న ఆస్ట్రేలియాతో తొలి టీ20లో పంత్‌ను పక్కన పెట్టి కార్తీక్‌ను తీసుకున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో అతడు పెద్దగా రాణించలేకపోయాడు. దీంతో ఈ ఇద్దరిలో ఎవరు అన్న చర్చ కొనసాగుతూనే ఉంది.