Ponting on Virat Kohli: సచిన్ 100 సెంచరీల రికార్డును విరాట్ బ్రేక్ చేస్తాడు: పాంటింగ్
Ponting on Virat Kohli: సచిన్ 100 సెంచరీల రికార్డును విరాట్ కోహ్లి బ్రేక్ చేస్తాడని అన్నాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్. ఆస్ట్రేలియాతో టీమిండియా టీ20 సిరీస్‌కు ముందు అతడీ కామెంట్స్ చేయడం విశేషం.
Ponting on Virat Kohli: ఇండియన్ క్రికెట్‌లో పదేళ్ల కిందటి వరకూ చర్చ మొత్తం సచిన్ టెండూల్కర్ చుట్టే జరిగేది. ఈ సెంచరీల వీరుడు ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఎవరికీ సాధ్యం కాని రీతిలో 100 సెంచరీలు బాదాడు. ఈ రికార్డును బ్రేక్ చేయడం కాదు.. కనీసం ఊహించుకోవడం కూడా ఎవరి వల్లా కాదు అని అప్పట్లో చాలా మంది అనుకున్నారు.
నిజానికి ఆ సమయంలో అలాంటి క్రికెటర్ ఎవరూ కనిపించలేదు. కానీ విరాట్ కోహ్లి రూపంలో అంతటి క్రికెట్ గాడ్ సచిన్ రికార్డులను కూడా బ్రేక్ చేయగలిగే సత్తా ఉన్న క్రికెటర్ తెరపైకి వచ్చాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అతను సెంచరీలు చేసే స్పీడు చూసి.. మాస్టర్ రికార్డులు బ్రేక్ కావడానికి పెద్దగా సమయం పట్టదని అనుకున్నారు. ఇండియన్ టీమ్‌లోకి అడుగుపెట్టిన పదేళ్లలోనే విరాట్ ఏకంగా 70 సెంచరీలు బాదాడు మరి.
అయితే మూడేళ్లుగా అతని జోరు తగ్గడం ఆ సెంచరీల జోరు అక్కడికే ఆగిపోయింది. దీంతో సచిన్ రికార్డు సేఫ్ అన్న భావన పెరిగింది. దానిపై పెద్దగా చర్చ కూడా జరగలేదు. కానీ తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మాత్రం మరోసారి ఈ చర్చను తెరపైకి తెచ్చాడు. ఇప్పటికీ సచిన్ 100 సెంచరీల రికార్డును విరాట్ కోహ్లి బ్రేక్ చేయగలడని పాంటింగ్ అనడం విశేషం.
ఈ మధ్యే ఆసియా కప్‌లో అతడు అంతర్జాతీయ టీ20ల్లోనూ తొలి సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఇది అతనికి ఓవరాల్‌గా 71వ సెంచరీ. అలా చూసినా మరో 30 సెంచరీలు చేస్తేనే సచిన్ రికార్డును బ్రేక్ చేయగలడు. నిజానికి ఇది చాలా కష్టమే అయినా.. సక్సెస్ కావాలన్న విరాట్ పట్టుదల చూస్తుంటే అది సాధ్యమే అనిపిస్తోందని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు.
ప్రస్తుతం 71 సెంచరీలతో ఇదే పాంటింగ్ రికార్డును విరాట్ సమం చేశాడు. "మూడేళ్ల కిందట ఇదే ప్రశ్న నన్ను అడిగి ఉంటే కచ్చితంగా అని చెప్పేవాడిని. కానీ మూడేళ్లుగా అతడు కాస్త నెమ్మదించాడు. కానీ ఇప్పటికీ అది అతనికి సాధ్యమే అని నేను భావిస్తున్నాను. అందులో సందేహమే లేదు" అని ఐసీసీ రివ్యూలో పాంటింగ్ అనడం గమనార్హం.
"ఇప్పటికీ అతని కెరీర్‌లో చాలా ఏళ్లు మిగిలి ఉన్నాయి. అయితే అతనింకా 30 సెంచరీల దూరంలో ఉన్నాడు. అది చాలా ఎక్కువ. అంటే ఏడాదికి అతడు కనీసం ఐదారు సెంచరీలైనా చేయాలి. విరాట్ కోహ్లి విషయంలో ఎప్పటికీ సాధ్యం కాదు అని నేను చెప్పను. అతడు కాస్త నిలదొక్కుకుంటే చాలు సక్సెస్ కోసం ఎంతటి ఆకలితో ఉంటాడో మనకు తెలుసు. అందుకే విరాట్‌కు ఎప్పటికీ సాధ్యం కాదని నేను చెప్పలేను" అని పాంటింగ్ అన్నాడు.