Virat Kohli: కోహ్లి టీమ్‌లో ఉంటే ప్రత్యర్థులు భయపడతారు: రికీ పాంటింగ్
Virat Kohli: విరాట్ కోహ్లి ఉన్న టీమ్‌తో ఆడటానికి ప్రత్యర్థి టీమ్స్ భయపడతాయని, అతన్ని టీ20 వరల్డ్‌కప్‌కు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలని అన్నాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్.
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి అండగా నిలిచాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్. టీ20 వరల్డ్‌కప్‌కు అతన్ని తీసుకోవాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌ను కోరాడు. కోహ్లి ఉన్న టీమ్‌తో ఆడటానికి ప్రత్యర్థి కెప్టెన్ అయినా, ప్లేయర్ అయినా భయపడతారని చెప్పడం గమనార్హం. ఐసీసీ రివ్యూలో మాట్లాడిన పాంటింగ్.. కోహ్లి ఇప్పటికీ టీమ్‌పై ప్రభావం చూపగలడని అన్నాడు.
"నేను ఓ ప్రత్యర్థి టీమ్ కెప్టెన్‌గా లేదా ప్లేయర్‌గా ఉన్నా కోహ్లి ఉన్న ఇండియన్ టీమ్‌తో ఆడటానికి భయపడతాను. అతడు లేకపోతేనే బాగుంటుందని అనుకుంటాను. ప్రస్తుతం అతడు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నాడని నాకు తెలుసు" అని పాంటింగ్ అన్నాడు. అయితే క్రికెట్ ఆడిన ప్రతి గొప్ప ప్లేయర్ ఇలాంటి దశను అనుభవించిన వారే అని చెప్పాడు.
"ఓ బ్యాట్స్‌మన్ అయినా, బౌలర్ అయినా ఈ గేమ్‌లో ప్రతి గొప్ప ప్లేయర్ ఈ దశను చూసిన వాళ్లే. అయితే బెస్ట్ ప్లేయర్స్ ఈ దశను అధిగమించడానికి ఓ దారి వెతుక్కుంటారు. కోహ్లి కూడా మరికొన్ని రోజుల్లో ఆ దారి కనుగొంటాడు. ఒకవేళ విరాట్ కోహ్లిని టీమ్‌లో నుంచి తీసేస్తే అతని స్థానంలో వచ్చిన ప్లేయర్ బాగా రాణిస్తే కోహ్లికి మళ్లీ టీమ్‌లోకి రావడం కష్టమవుతుంది" అని పాంటింగ్ అన్నాడు.
తాను ఒకవేళ ఇండియన్ టీమ్ అయితే కనుక కోహ్లితోనే ఉంటానని కూడా స్పష్టం చేశాడు. "అతనికి అండగా ఉండి, బాగా ఆడేలా ప్రోత్సహిస్తే దాని వల్ల కలిగే ఫలితం చాలా బాగుంటుంది. నేను ఇండియన్ టీమ్ కెప్టెన్ లేదా కోచ్‌గా ఉండి ఉంటే అదే చేసే వాడిని. అతనిపై ఒత్తిడి లేకుండా చూసి మళ్లీ రన్స్ సాధించేలా ప్రోత్సహించేవాడిని" అని పాంటింగ్ చెప్పాడు.
ఇక టీ20 వరల్డ్‌కప్‌లో విరాట్ కోహ్లి టాపార్డర్‌లో ఉండేలా ఇండియన్ సెలక్టర్లు చూడాలని కూడా కోరాడు. టోర్నీ మొదట్లో అతడు కొన్ని రన్స్ చేయగలిగితే.. అది ముగిసేలోపు విరాట్ పూర్తిగా గాడిలో పడతాడని పాంటింగ్ అన్నాడు.
సంబంధిత కథనం