Finch on Virat Kohli: కోహ్లి పనైపోవడమేంటి.. అతడు ఆల్‌టైమ్ గ్రేటెస్ట్‌లో ఒకడు: ఆరోన్ ఫించ్
Finch on Virat Kohli: కోహ్లి పనైపోవడమేంటి.. అతడు ఆల్‌టైమ్ గ్రేటెస్ట్‌లో ఒకడని అంటున్నాడు ఆస్ట్రేలియా టీ20 టీమ్ కెప్టెన్ ఆరోన్ ఫించ్. మంగళవారం (సెప్టెంబర్ 20) ప్రారంభం కాబోయే మూడు టీ20ల సిరీస్‌కు ముందు అతడు మీడియాతో మాట్లాడాడు.
Finch on Virat Kohli: విరాట్ కోహ్లి ఫామ్‌లో ఉన్నా లేకపోయినా ఎప్పుడూ వార్తల్లో ఉంటాడు. చాన్నాళ్లుగా ఫామ్‌లో లేక విమర్శలు ఎదుర్కొన్న విరాట్.. తాజాగా ఆసియా కప్‌లో సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలతో మళ్లీ గాడిలో పడ్డాడు. దీంతో ఇప్పుడు ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముందు కూడా మరోసారి కోహ్లిపైనే అందరి కళ్లూ ఉన్నాయి.
ఈ నేపథ్యంలో కోహ్లి ఫామ్ గురించి ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్, టెస్ట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌లను మీడియా ప్రశ్నించింది. మంగళవారం (సెప్టెంబర్ 20) నుంచి మొహాలీలో మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుండటంతో ఫించ్ మీడియాతో మాట్లాడాడు. విరాట్ కోహ్లి ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్స్‌లో ఒకడని ఈ సందర్భంగా ఫించ్ అనడం విశేషం.
"ఏ దశలో అయినా విరాట్ కోహ్లి పనైపోయిందని అనడానికి మీకు చాలా ధైర్యం ఉండాలి. గత 15 ఏళ్లుగా తాను ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్స్‌లో ఒకడినని అతడు నిరూపిస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో తన ఆటను ఎంతో మెరుగుపరచుకున్నాడు. విరాట్‌కు ప్రత్యర్థిగా ఆడుతున్నప్పుడు మన అత్యుత్తమ ఆటతీరు కనబరచడానికే ప్రయత్నిస్తాము" అని ఫించ్ అన్నాడు.
"అతడో అద్భుతమైన ప్లేయర్. 71 ఇంటర్నేషనల్ సెంచరీలు అంటే మామూలు విషయం కాదు" అని కూడా ఫించ్ చెప్పాడు. ఈ మధ్యే ఆసియాకప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌లో టీ20ల్లో విరాట్ తొలి సెంచరీ సాధించడంపై ఫించ్ ఇలా స్పందించాడు. ఆ మ్యాచ్‌లో విరాట్ కేవలం 61 బాల్స్‌లోనే 122 రన్స్ చేశాడు. టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో ఓ ఇండియన్ బ్యాటర్ చేసిన అత్యధిక స్కోరు కూడా ఇదే కావడం విశేషం.
ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు కూడా మొహాలీలో టీమ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కోహ్లియే ఎక్కువ సేపు నెట్స్‌లో గడిపాడు. అటు పేస్, ఇటు స్పిన్ బౌలర్లను అటాక్ చేస్తూ కనిపించాడు. సెంచరీ కాన్ఫిడెన్స్ అతనిలో స్పష్టంగా కనిపించింది. డ్రైవ్ షాట్లు కూడా సాధికారికంగా ఆడాడు. ఇక రానున్న రోజుల్లో విరాట్ కోహ్లి మూడో ఓపెనర్‌గా ఉంటాడని కూడా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పిన విషయం తెలిసిందే.