Asghar Afghan on Indian Team: ముందు రోహిత్, విరాట్‌ను ఔట్ చేస్తే.. సగం పని పూర్తయినట్లే.. ఆఫ్గాన్ మాజీ కెప్టెన్ వ్యాఖ్య-asghar afghan says if kohli and rohit out half of india is finished ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Asghar Afghan Says If Kohli And Rohit Out Half Of India Is Finished

Asghar Afghan on Indian Team: ముందు రోహిత్, విరాట్‌ను ఔట్ చేస్తే.. సగం పని పూర్తయినట్లే.. ఆఫ్గాన్ మాజీ కెప్టెన్ వ్యాఖ్య

Maragani Govardhan HT Telugu
Sep 16, 2022 06:47 PM IST

Asghar Afghan on Indian Cricket Team: ఆఫ్గానిస్థాన్ మాజీ కెప్టెన్ అస్గర్ ఆఫ్గాన్ భారత క్రికెట్ జట్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను వీలైనంత త్వరగా ఔట్ చేస్తే.. సగం పని పూర్తయినట్లేనని తెలిపాడు.

విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ (BCCI Twitter)

Asghar Afghan About Virat Kohli and Rohit Sharma: టీమిండియా టాపార్డర్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రధాన బలం. వీరిద్దరూ క్రీజులో ఉన్నారంటే ప్రత్యర్థులకు చుక్కలు కనిపించాల్సిందే. అయితే గత కొంతకాలంగా వీరద్దరూ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇటీవల జరిగిన ఆసియా కప్‌లో విరాట్, రోహిత్ ఫామ్ పుంజుకోవడంతో భారత అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఆఫ్గానిస్థాన్ మాజీ కెప్టెన్ అస్గర్ ఆఫ్గాన్.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ కోసం భారత్‌కు వచ్చిన అతడు.. హిందుస్థాన్ టైమ్స్ నిర్వహించిన ఇంటర్వ్యూలో భాగంగా.. విరాట్, రోహిత్ శర్మ కోసం ఎలాంటి వ్యూహాలు అవలంభించేవారనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చాడు.

"క్రికెటర్ సరిగ్గా ఆడనప్పుడు అందరి చర్చ అతడిపైనే ఉంటుంది. ఇది ప్రతి ఆటగాడి జీవితంలో భాగం. మేము టీమిండియాతో ఆడినప్పుడల్లా మా గేమ్ ప్లాన్ అంతా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చుట్టూనే ఉండేది. వీళ్లను ఔట్ చేస్తే.. భారత జట్టులో సగం మందిని ఔట్ చేసినట్లేనని మేము అనుకునేవాళ్లు. ఇతర జట్లు కూడా టీమిండియా విషయంలో ఇలాగే ఆలోచిస్తుంది. ఎందుకంటే వారు సింగిల్ హ్యాండ్‌తో మ్యాచ్‌ను గెలిపించే సత్తా ఉన్నవాళ్లు. వీలైనంత త్వరగా ప్రారంభంలోనే వారిని ఔట్ చేసేందుకు ప్రయత్నించాలని మా బౌలర్లతో చెబుతాను. ఒకవేళ తీయలేకపోతే.. ఇక ఔట్ చేయడం చాలా కష్టం. ముఖ్యంగా విరాట్ కోహ్లీ.. చాలా బిజీ ప్లేయర్. ఒక్కసారి క్రీజులో సెట్ అయితే.. అతడిని ఔట్ చేయడం చాలా కష్టం. వన్డేల్లో విరాట్, రోహిత్‌ను త్వరగా ఔట్ చేసినట్లయితే భారత్ దాదాపు 100 నుంచి 120 పరుగులు తక్కువ నమోదు చేస్తుంది. ఇదే టీ20ల్లో అయితే 60 నుంచి 70 పరుగులు సేవ్ చేయవచ్చు" అని అస్గర్ అఫ్గానీ స్పష్టం చేశాడు.

ఆసియా కప్‌లో రోహిత్, విరాట్ మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ.. టీమిండియా విజయం సాధించకపోవడానికి కారణం ఏంటని అస్గర్‌ను అడుగ్గా.. జట్టు బ్యాలెన్స్ సరిగ్గా లేదని స్పష్టం చేశాడు. "పేపర్‌లో భారత జట్టు చాలా బలంగా ఉంది. ఆసియా కప్ గెలవడానికి ఇంతకంటే మంచి జట్టు ఉండదు. అయితే బ్యాలెన్స్ కూడా సరిగ్గా ఉండాలి. ఈ కారణం వల్లే బహుశా భారత్ పరాజయాలు అందుకుని ఉంటుంది. సూపర్ -4 స్టేజ్‌లో రవీంద్ర జడేజా దూరం కావడం.. జట్టు బ్యాలెన్స్‌పై తీవ్రగా ప్రభావం చూపింది" అని అస్గర్ అఫ్గానీ తెలిపాడు.

యూఏఈ వేదికగా ఇటీవల జరిగిన ఆసియా కప్‌లో భారత్ సూపర్-4 దశలోనే నిష్క్రమించింది. వరుసగా పాకిస్థాన్, శ్రీలంక జట్లపై ఓటమి పాలై.. ఇంటి ముఖం పట్టింది. ఈ రెండు ఫైనల్లో పోటీ పడగా..శ్రీలంక విజయాన్ని సాధించింది. ఫలితంగా ఆరోసారి ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

WhatsApp channel

సంబంధిత కథనం