క్రికెట్ కెప్టెన్సీ ఫాస్ట్‌ బౌలర్లకు ఎందుకు ఇవ్వరు? బ్యాట్స్‌మెన్‌కే ఎందుకు?-why bowlers often do not get a chance to captain a cricket team ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  క్రికెట్ కెప్టెన్సీ ఫాస్ట్‌ బౌలర్లకు ఎందుకు ఇవ్వరు? బ్యాట్స్‌మెన్‌కే ఎందుకు?

క్రికెట్ కెప్టెన్సీ ఫాస్ట్‌ బౌలర్లకు ఎందుకు ఇవ్వరు? బ్యాట్స్‌మెన్‌కే ఎందుకు?

Hari Prasad S HT Telugu
Jan 27, 2022 09:34 PM IST

ఆస్ట్రేలియా అనే కాదు.. ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌తోపాటు ఇప్పుడు ఏ జాతీయ జట్టునైనా తీసుకోండి.. మీకు ఎక్కువగా బ్యాట్స్‌మెన్‌ లేదంటే వికెట్‌ కీపరే కెప్టెన్లుగా కనిపిస్తారు. అటు ఐపీఎల్‌ టీమ్స్‌, బిగ్‌బాష్‌ లీగ్‌, కరీబియన్‌ ప్రిమియర్‌ లీగ్‌.. ఇలా లీగ్స్‌లోని టీమ్స్‌లోనూ ఇదే పరిస్థితి. మరి ఇలా ఎందుకు?

ఆస్ట్రేలియా పూర్తి స్థాయి కెప్టెన్ అయిన తొలి ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్
ఆస్ట్రేలియా పూర్తి స్థాయి కెప్టెన్ అయిన తొలి ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ (Reuters )

ఓ క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్సీని సాధారణంగా ఫాస్ట్‌ బౌలర్లకు ఎందుకు ఇవ్వరు? బ్యాట్స్‌మెన్‌కే ఎందుకు ఇస్తారు? ఈ డౌటు మీకూ ఎప్పుడైనా వచ్చిందా? ఈ మధ్యే ఆస్ట్రేలియా టెస్ట్‌ కెప్టెన్‌గా ఉన్న టిమ్‌ పైన్‌ తనపై సెక్స్‌ ఆరోపణలు రావడంతో కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. దీంతో ఆ పగ్గాలు పేస్‌ బౌలర్‌ ప్యాట్ కమిన్స్‌ చేతికి చిక్కాయి. 144 ఏళ్ల ఆస్ట్రేలియా టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఓ ఫాస్ట్‌ బౌలర్‌ టెస్ట్‌ కెప్టెన్సీ చేపట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. మరి ఇలా ఎందుకు? ఆస్ట్రేలియా అనే కాదు.. ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌తోపాటు ఇప్పుడు ఏ జాతీయ జట్టునైనా తీసుకోండి.. మీకు ఎక్కువగా బ్యాట్స్‌మెన్‌ లేదంటే వికెట్‌ కీపరే కెప్టెన్లుగా కనిపిస్తారు. 

అటు ఐపీఎల్‌ టీమ్స్‌, బిగ్‌బాష్‌ లీగ్‌, కరీబియన్‌ ప్రీమియర్ లీగ్‌.. ఇలా లీగ్స్‌లోని టీమ్స్‌లోనూ ఇదే పరిస్థితి. ఈ మధ్యే ఇండియన్‌ టీమ్‌ టీ20 కెప్టెన్సీ కూడా కోహ్లి చేతుల్లో నుంచి ఓపెనర్‌ అయిన రోహిత్‌ శర్మ చేతుల్లోకి వెళ్లింది. మరి ఇలా ఎందుకు? క్రికెట్‌లో కెప్టెన్సీ ఫాస్ట్‌ బౌలర్లు, అసలు ఆ మాటకొస్తే ఏ బౌలర్‌కైనా ఎందుకు ఎక్కువగా దక్కదు? దీనికేమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా? బ్యాట్స్‌మెన్‌ స్థాయిలో సక్సెసయ్యే స్టార్‌ బౌలర్లు అయినా కూడా వాళ్లను కెప్టెన్సీ ఎందుకు వరించదు?

ఫాస్ట్‌ బౌలర్లు సక్సెస్‌ కాలేదా?

క్రికెట్‌లో ఫాస్ట్‌ బౌలర్లు కెప్టెన్లుగా సక్సెస్ కాలేదా? కచ్చితంగా అయ్యారు. ఇండియన్‌ టీమ్‌ను, పాకిస్థాన్‌ను తొలిసారి విశ్వవిజేతలుగా నిలిపిన కపిల్‌దేవ్‌, ఇమ్రాన్‌ఖాన్‌లు పేస్‌ బౌలర్లే. ఒకప్పుడు ఇదే పాకిస్థాన్‌కు వసీమ్‌ అక్రమ్‌, వకార్‌ యూనిస్‌, సౌతాఫ్రికాకు షాన్‌ పొలాక్‌, వెస్టిండీస్‌కు కౌర్ట్‌నీ వాల్ష్‌, డారెన్‌ సమీ, జేసన్‌ హోల్డర్‌, ఇంగ్లండ్‌కు బాబ్‌ విల్లిస్‌, ఇండియన్‌ టీమ్‌కు అనిల్‌ కుంబ్లే కెప్టెన్లుగా వ్యవహరించారు. 

కెప్టెన్లుగా వీళ్ల ప్రదర్శన మరీ చెత్తగా ఏమీ లేదు. వీళ్ల తమ కెప్టెన్సీ కెరీర్‌లలో చెప్పుకోదగిన విజయాలే సాధించారు. అయినా కపిల్‌ దేవ్‌, ఇమ్రాన్‌ఖాన్‌లలాగా సుదీర్ఘకాలం కెప్టెన్లుగా కొనసాగలేకపోయారు. ఇండియన్‌ టీమ్‌కు కూడా అప్పుడెప్పుడో 14 ఏళ్ల కిందట చివరిసారి.. స్పిన్నర్‌ అయిన అనిల్‌ కుంబ్లే కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ తర్వాత మరో బౌలర్‌కు కెప్టెన్సీ దక్కలేదు. క్రికెట్‌ సాధారణంగా ఓ బ్యాట్స్‌మెన్‌ గేమ్‌గా ముద్రపడిపోయింది. 

సెలక్టర్లు కూడా బ్యాట్స్‌మెన్‌ లేదంటే వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ మరీ కాదంటే బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్లకే కెప్టెన్సీ అవకాశం ఇస్తున్నారు. మరి ఇలా ఎందుకు అన్న సందేహం సహజంగానే అభిమానులకు కలుగుతుంది. దీని వెనుక బలమైన కారణాలు లేకపోలేవు.

కెరీర్‌ అడ్వాంటేజ్‌

బౌలర్లు లేదంటే ఆల్‌రౌండర్లతో పోలిస్తే బ్యాట్స్‌మెన్‌ కెరీర్‌ కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటి వరకూ క్రికెట్‌ చరిత్ర కూడా చెప్పింది అదే. కపిల్‌దేవ్‌, ఇమ్రాన్‌ఖాన్‌, వసీం అక్రమ్‌, జేమ్స్‌ ఆండర్సన్‌ వంటి పేస్‌ బౌలర్ల కెరీర్‌ కూడా సుదీర్ఘంగానే సాగినా.. అందరి విషయంలో ఇది కుదరదు. ఎక్కువ కాలం టీమ్‌లో కొనసాగే బ్యాట్స్‌మెన్‌నే కెప్టెన్‌ను చేసేలా సెలక్టర్లను పురికొల్పడానికి ఇది కూడా ఒక కారణం.

బౌలర్లు.. గాయాలు

బ్యాట్స్‌మెన్‌తో పోలిస్తే బౌలర్లు, అందులోనూ ఫాస్ట్‌ బౌలర్లు గాయపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇండియన్‌ టీమ్‌లోనే తీసుకుంటే ప్రస్తుతం జస్‌ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌కుమార్‌లాంటి స్టార్‌ పేస్ బౌలర్లు ఉన్నా.. కోహ్లి, రోహిత్‌లతో పోలిస్తే వీళ్ల గాయాలు ఎక్కువే. టీమ్‌లో సాధారణ ప్లేయర్‌ గాయపడితే పెద్దగా నష్టం ఉండదు. కానీ కెప్టెనే తరచూ గాయాలబారిన పడటం, మరొకరికి పగ్గాలు అప్పగించడం వల్ల టీమ్‌ కుదురుకోవడం కష్టమవుతుంది. ఒకవేళ ఫాస్ట్‌ బౌలర్లు గాయపడకపోయినా.. బ్యాట్స్‌మెన్‌తో పోలిస్తే ఏడాదిలో జరిగే కొన్ని టూర్లకు పక్కన పెట్టి ప్రత్యేకంగా విశ్రాంతి ఇవ్వాల్సి వస్తుంది.

బౌలింగ్, ఫీల్డింగ్‌.. కష్టమే

ఇక అన్నింటి కన్నా ముఖ్యంగా ఓ బ్యాట్స్‌మన్‌ కెప్టెన్‌గా ఉంటే.. అతడు ఫీల్డింగ్‌ చేస్తూ ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చే అవకాశం ఉంటుంది. అతడి పని అదొక్కటే. కానీ బౌలర్‌ సంగతి అలా కాదు. తాను బౌలింగ్ చేస్తూనే.. ఫీల్డింగ్‌ సెట్‌ చేయడం, ఇతర బౌలర్లను పరిస్థితులకు తగినట్లుగా మార్చడం కష్టం. అందులోనూ టీ20 లాంటి చాలా వేగంగా సాగిపోయే ఫార్మాట్‌లో చాలా త్వరగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో బౌలర్‌ కెప్టెన్‌గా ఉంటే తీవ్ర ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ కారణం కూడా ఓ బౌలర్‌ను కెప్టెన్సీకి దూరం చేస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం