Ravi Shastri on Team India: సచిన్ ఆరు వరల్డ్‌కప్‌లు ఆడితే ఒక్కటి గెలిచాడు: రవిశాస్త్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
24 March 2023, 11:44 IST
Ravi Shastri on Team India: సచిన్ ఆరు వరల్డ్‌కప్‌లు ఆడితే ఒక్కటి గెలిచాడు అంటూ రవిశాస్త్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, వరల్డ్ కప్ లలో టీమిండియా అవకాశాలపై స్పందిస్తూ శాస్త్రి ఈ కామెంట్స్ చేయడం విశేషం.
ఐసీసీ టోర్నీల్లో టీమిండియా విజయావకాశాలపై రవిశాస్త్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Ravi Shastri on Team India: ఇండియా ఈ ఏడాది రెండు ఐసీసీ టైటిల్స్ కోసం తలపడబోతోంది. అందులో ఒకటి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కాగా.. మరొకటి వన్డే వరల్డ్ కప్. ఈ రెండింట్లో ఇండియా గెలిచే అవకాశాలు ఉన్నాయా? దీనికి మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికరమైన విశ్లేషణ చేశాడు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, ఫుట్‌బాల్ గ్రేట్ లియోనెల్ మెస్సీలనే ఉదాహరణగా తీసుకొని అతడు విశ్లేషించడం విశేషం.
ఇండియా పదేళ్లుగా ఓ ఐసీసీ ట్రోఫీ కోసం ఎదురు చూస్తోంది. చివరిసారి 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియా.. మళ్లీ ఐసీసీ ట్రోఫీ గెలవలేకపోయింది. ఈ టోర్నీల్లో సెమీఫైనల్స్, ఫైనల్స్ వరకూ వస్తున్నా.. చివరి మెట్టుపై బోల్తా పడుతోంది. 2015, 2019 వన్డే వరల్డ్ కప్ లలో సెమీస్ వరకూ వచ్చింది. 2014 టీ20 వరల్డ్ కప్ ల ఫైనల్ చేరగా.. 2016, 2022లో సెమీఫైనల్స్ లో ఓడిపోయింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2021 డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఆడినా గెలవలేకపోయింది.
ఈ ఓటముల గురించి స్పందిస్తూ రవిశాస్త్రి ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సచిన్ ఆరు వరల్డ్ కప్ లు ఆడితే ఒక్కటి మాత్రమే గెలవగలిగాడని, మెస్సీ కూడా వరల్డ్ కోసం చాన్నాళ్లపాటు వేచి చూశాడని శాస్త్రి అన్నాడు. ఏదైనా గొప్ప విజయం కోసం వేచి చూడాల్సిన అవసరం ఉంటుందని రవిశాస్త్రి చెప్పాడు.
"ఇండియా ఐసీసీ టోర్నీ గెలవాల్సి ఉంది. వాళ్లు చాలా నిలకడగా ఆడుతున్నారు. ఫైనల్స్, సెమీఫైనల్స్ కు రెగ్యులర్ గా వెళ్తున్నారు. సచిన్ టెండూల్కర్ ను చూడండి. ఒక్క ఐసీసీ ట్రోఫీ కోసం అతడు ఆరు వరల్డ్ కప్ లు ఆడాడు. అంటే 24 ఏళ్లు. తన చివరి వరల్డ్ కప్ లో అతని కల నెరవేరింది.
యోనెల్ మెస్సీని కూడా చూడండి. అతడు కూడా గొప్ప ఉదాహరణ. అతడు ఎన్ని రోజులుగా ఆడుతున్నాడు. కానీ అతడు గెలవడం ప్రారంభించిన తర్వాత కోపా అమెరికాతోపాటు వరల్డ్ కప్ కూడా గెలిచాడు. ఫైనల్లో గోల్ కూడా చేశాడు. అందుకే వేచి చూడటం అనేది ముఖ్యం. ఆ తర్వాతే విజయాలు వస్తాయి" అని రవిశాస్త్రి చెప్పాడు.