Sachin Prediction on WTC: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్‌కే ఛాన్స్.. సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Sachin Prediction on WTC: వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా-భారత్ తలపడనున్న సంగతి తెలిసిందే.ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు భారత్‌కే ఎక్కువ ఛాన్స్ ఉందని సచిన్ తెందూల్కర్ స్పష్టం చేశారు.
Sachin Prediction on WTC: ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా న్యూజిలాండ్‌పై ఓడిపోవడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. లండన్ ఓవల్ వేదికగా జరగనున్న ఈ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతోనే తలపడనుంది భారత్. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ విషయంపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ మాట్లాడారు. దిల్లీలో జరిగిన ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో మాట్లాడిన ఆయన.. డబ్ల్యూటీసీ ఫైనల్ నెగ్గడానికి భారత్‌కే ఎక్కువ అవకాశాలున్నాయని స్పష్టం చేశారు.
"జట్టుగా మనం అద్భుతంగా ఆడుతున్నాం. టీమ్ బ్యాలెన్స్‌గా ఉంది. విదేశీ కండీషన్లు ప్రకారం టెస్టు క్రికెట్‌లో ఐదు రోజుల పరిస్థితులను ముందుగానే అర్థం చేసుకోవాలి. అందుకు అనుగుణంగా జట్టును ఎంచుకోవాలి. జట్టును బ్యాలెన్స్‌గా ఉంచడానికి అదనపు స్పిన్నర్లను కలిగి ఉండటం కెప్టెన్‌కు కొంచెం ఛాలెంజింగ్‌గా ఉంటుంది. నేను టీమిండియా దృష్టి నుంచే ఆలోచిస్తున్నా. ఆస్ట్రేలియా ఏం చేయాలనుకుంటుందో అదే చేయనివ్వండి. అయితే మాకు(భారత్) చాలా మంచి అవకాశముంది." అని సచిన్ తెందూల్కర్ అన్నారు.
బంతిని స్వింగ్ చేసేందుకు లాలాజలాన్ని నిషేధించే నిర్ణయాన్ని పునఃపరిశీలించాల్సిందిగా ఐసీసీని తెందూల్కర్ కోరారు.
“నేను మెడికల్ నిపుణుడిని కాదు.. కానీ బంతిపై లాలాజలం ఉండాలి. ఇది 100 సంవత్సాల నుంచి జరుగుతుంది. అయితే తీవ్రంగా ఏం లేదు. 2020లో సరైన నిర్ణయమే తీసుకున్నారు. ఇప్పుడు ఇది పరిగణించాల్సిన విషయం.” అని తెందూల్కర్ స్పష్టం చేశారు.
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడో టెస్టులో భారత్‌ను 9 వికెట్ల తేడాతో గెలిచిన తర్వాత ఆసీస్ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. ఈ ఫైనల్‌క అర్హత సాధించిన తొలి జట్టు ఆస్ట్రేలియా కావడం విశేషం. 2021లో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కివీస్ విజేతగా నిలిచింది.