Shreyas Back Injury: టీమిండియాకు షాక్.. గాయంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు స్టార్ బ్యాటర్ దూరం..!
Shreyas Back Injury: టీమిండియా మిడిలార్డర్‌లో స్టార్ బ్యాటరైన శ్రేయాస్ అయ్యర్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఐపీఎల్ సీజన్‌కు కూడా అందుబాటులో ఉండట్లేదని తెలుస్తోంది.
Shreyas Back Injury: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా ఆ ఫైనల్ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టెస్టు ఛాంపియన్‌షిప్‌నే కాకుండా మొత్తం ఐపీఎల్ సీజన్‌కు అతడు అందుబాటులో ఉండడని బీసీసీఐ వర్గాల సమాచారం. వెన్నునొప్పి కారణంగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో చివరి టెస్టు కూడా ఆడని శ్రేయాస్.. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్నాడు. తాజాగా గాయం తీవ్రమవడంతో లండన్‌లో సర్జరీ చేయించుకునేందుకు సిద్ధమవుతున్నాడట. బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో ఈ సర్జరీ జరగనుందని సమాచారం.
సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం శ్రేయాస్ అయ్యర్ ముంబయికి చెందిన వైద్యుడి సూచనల మేరకు శ్రస్త్రచికిత్స జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సర్జరీ తర్వాత కనీసం ఐదు నెలల పాటు ఆటకు దూరంగా ఉంటాడని అంచనా. అంటే అంతడు ఆస్ట్రేలియాతో జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పైనల్ మ్యాచ్‌తో పాటు ఈ ఐపీఎల్ సీజన్‌కు అందుబాటులో ఉండడని తెలుస్తోంది. మళ్లీ అక్టోబరులో జరగనున్న వన్డే వరల్డ్ కప్‌కు వస్తాడని సమాచారం. మిడిలార్డర్‌లో అతడు లేకుండా ప్రపంచకప్ జట్టును ఎంపిక చేసే అవకాశం లేదు. గాయం కారణంగా ఇప్పటికే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్టుకు దూరమయ్యాడు. రెండో టెస్టుకు అందుబాటులోకి వచ్చినా.. వెన్ను నొప్పితో ఆ సిరీస్‌లో ఇబ్బంది పడ్డాడు.
ఇప్పటికే గాయం కారణం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్, ఐపీఎల్‌కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా శ్రేయాస్ అయ్యర్ కూడా దూరం కావడం టీమిండియాకు ఇది కోలుకోలేని దెబ్బేనని చెప్పాలి. బుమ్రా గతేడాడి టీ20 వరల్డ్ కప్ నుంచి ఇప్పటి వరకు జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. అతడు ఎప్పుడు కోలుకుంటాడనేది కూడా అనుమానంగా మారింది. అంతేకాకుండా ఫిట్నెస్ సమస్యలు అతడిని వేధిస్తున్నాయి.
ఇప్పుడు శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్‌కు దూరం కావడం.. కోల్‌కతా జట్టుకు పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు. ఆ జట్టు కెప్టెన్‌గా శ్రేయాస్ కేకేఆర్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. శ్రేయాస్ గైర్హాజరుతో కేకేఆర్ పగ్గాలు ఎవరు చెపడతారనేది ఆసక్తికరంగా మారింది. టిమ్ సౌథీ, నితీష్ రాణా లాంటి సీనియర్ ఆటగాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఎవరు సారథ్యం వహిస్తారో వేచి చూడాలి.