Shreyas Iyer Injury: శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్‌కు ఎందుకు రాలేదు? గాయపడ్డాడా?-why shreyas iyer did not come out to bat in 4th test vs australia ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Shreyas Iyer Injury: శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్‌కు ఎందుకు రాలేదు? గాయపడ్డాడా?

Shreyas Iyer Injury: శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్‌కు ఎందుకు రాలేదు? గాయపడ్డాడా?

Maragani Govardhan HT Telugu
Mar 12, 2023 11:56 AM IST

Shreyas Iyer Injury: టీమిండియా బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో అతడు బ్యాటింగ్‌కు కూడా దిగలేదు. అతడి కంటే ముందు కేఎస్ భరత్ ముందు బ్యాటింగ్‌కు వచ్చాడు. అతడి కండీషన్‌పై బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది.

శ్రేయాస్ అయ్యర్
శ్రేయాస్ అయ్యర్ (PTI)

Shreyas Iyer Injury: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ గాయపడినట్లు తెలుస్తోంది. ఛతేశ్వర్ పుజారా ఔటైన వెంటనే శ్రేయాస్ బ్యాటింగ్‌కు రావాల్సి ఉండగా.. అతడి స్థానంలో రవీంద్ర జడేజా వచ్చారు. ఒకవేళ జడేజా బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు ప్రమోట్ చేశారేమో అనుకోగా.. నాలుగో రోజు జడ్డూ ఔటైన తర్వాత కూడా కేఎస్ భరత్ క్రీజులోకి వచ్చాడు. దీంతో శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్‌కు రాకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడి గాయం తిరగబెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై బీసీసీఐ అప్డేట్ ఇచ్చింది.

మూడో రోజు ఆట ముగిసిన తర్వాత శ్రేయాస్ అయ్యర్ వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు చెప్పాడు. అతడిని స్కానింగ్ కోసం పంపించాం. బీసీసీఐ వైద్యబృందం అతడి పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. అని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే అతడు బ్యాటింగ్‌కు వస్తాడా? లేదా? అనే విషయంపై మాత్రం ఇంతవరకు ఎలాంటి స్పష్టత బీసీసీఐ ఇవ్వలేదు.

ఇప్పటికే శ్రేయాస్ అయ్యర్ వెన్నునొప్పి కారణంగా నాగపుర్ వేదికగా జరిగిన తొలి టెస్టుకు దూరమయ్యాడు. దిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టుకు అందుబాటులోకి వచ్చినప్పటికీ అతడు పెద్దగా రాణించలేదు. 16 పరుగులు మాత్రమే చేశాడు. మూడోదైన ఇండోర్ టెస్టులోనూ అతడు కేవలం 26 పరుగులు మాత్రమే చేసిన నిరాశ పరిచాడు. నాలుగో టెస్టులోనైనా రాణిస్తాడేమో అనుకుంటున్న తరుణంలో ఈ విధంగా గాయపడ్డాడు.

ప్రస్తుతం నాలుగో రోజు తొలి సెషన్ ముగిసే సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 88 పరుగులతో సెంచరీకి చేరువలో ఉన్నాడు. మరో పక్క శ్రీకర్ భరత్ 25 పరుగులతో నిలకడగా ఆడుతున్నాడు. ప్రస్తుతం టీమిండియా తొలి ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా కంటే 118 పరుగుల దూరంలో ఉంది.