తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Pv Sindhu: సింధుకు షాక్.. వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌కు దూరం

PV Sindhu: సింధుకు షాక్.. వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌కు దూరం

13 August 2022, 22:26 IST

google News
    • భారత స్టార్ షట్లర్ పీవీ సింధు వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌కు దూరం కానుంది. తన ఎడమ పాదానికి గాయమవడం వల్ల మొత్తం టోర్నీకి దూరం కానుంది. జపాన్ టోక్యో వేదికగా ఈ టోర్నీ జరగనుంది.
పీవీ సింధు
పీవీ సింధు (ANI)

పీవీ సింధు

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఇటీవల జరిగిన బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. కామన్వెల్త్ పోటీల్లో తొలిసారిగా పసిడి సాధించిన సింధు.. తన తదుపరి లక్ష్యాలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే వరల్డ్ ఛాంపియన్‌షిప్‌గా నిలిచిన ఈ తెలుగు తేజం.. మరోసారి ఆ టైటిల్‌ను గెలవాలని ఎంతగానో ఆశిస్తోంది. తాజాగా ఆమె అభిమానులను షాక్‌కు గురిచేసింది. గాయం కారణంగా ప్రపంచ ఛాంపియన్‌షిప్ టోర్నీకి దూరం కానుంది. సోషల్ మీడియా వేదికగా సింధు ఈ విషయాన్ని తెలియజేసింది.

"భారత్ తరఫున కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించడంతో ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా ఉన్నా. అయితే దురదృష్టవశాత్తు వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌కు దూరం కానున్నాను. కామన్వెల్త్ క్వార్టర్స్ ఫైనల్ మ్యాచ్ అప్పుడే గాయం కారణంగా నాకు తీవ్రంగా నొప్పి కలిగింది. కానీ మా కోచ్, ఫిజియో, ట్రైనర్ సాయంతో నాకు సాధ్యమైనంత వరకు కష్టపడదామనుకున్నాను. అయితే ఫైనల్స్‌కు వచ్చేసరికి నొప్పి మరింత తీవ్రమైంది. ఎంత త్వరగా వీలైతై అంత తొందరగా హైదరాబాద్ వచ్చి ఎంఆర్ఐ స్కాన్ తీయించుకుంటాను." అని సింధు స్పష్టం చేసింది. తన ఎడమ పాదానికి గాయం తగిలినట్లు పేర్కొంది.

"నా ఎడమ పాదానికి ఒత్తిడి తగలడంతో గాయమైనట్లు డాక్టర్లు కన్ఫార్మ్ చేశారు. కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కావున కొన్ని వారాల తర్వాత నేను ట్రైనింగ్‌లో పాల్గొంటాను. మీ ప్రేమ, మద్దతుకు కృతజ్ఞురాలినై ఉంటాను." అని సింధు తెలిపింది.

బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ టోర్నీ ఆగస్టు 21 నుంచి 28 వరకు జరగనుంది. జపాన్ టోక్యో ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి ఆతిథ్యమివ్వనుంది. సిందు 2019లో ఈ టోర్నీలో పసిడి కైవసం చేసుకుంది. ఇది కాకుండా ఈ టోర్నీలో ఇప్పటికే రెండు రజతాలు, ఓ కాంస్యాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో స్వర్ణాన్ని సాధించింది. కామన్వెల్త్‌లో ఈ విభాగంలో ఈమెకు ఇదే తొలి స్వర్ణం. అంతకుముందు 2018లో మిక్స్‌డ్ టీమ్‌లో గెల్చుకుంది.

టాపిక్

తదుపరి వ్యాసం