Pakistan in World Cup 2023: వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ ఆడే మ్యాచ్‌లు బంగ్లాదేశ్‌లో..
29 March 2023, 18:48 IST
Pakistan in World Cup 2023: వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ ఆడే మ్యాచ్‌లు బంగ్లాదేశ్‌లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్ లో జరగనున్న ఆసియా కప్ లో ఇండియా ఆడే మ్యాచ్ లను మరో చోట నిర్వహిస్తారన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
వరల్డ్ కప్ లో ఇండియాలో పాకిస్థాన్ ఆడే మ్యాచ్ లు బంగ్లాదేశ్ లో..
Pakistan in World Cup 2023: ఆసియా కప్ లో ఇండియా, వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ఆడేలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నారు. తాజా ఈఎస్పీఎన్‌క్రికిన్ఫోలో వచ్చిన రిపోర్ట్ ప్రకారం.. వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ఆడబోయే మ్యాచ్ లను మాత్రం బంగ్లాదేశ్ లో నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది. రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఒక టీమ్ మరో దేశానికి వెళ్లి క్రికెట్ ఆడే పరిస్థితి కనిపించడం లేదు.
పాకిస్థాన్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లేది లేదని ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అలా అయితే తాము వరల్డ్ కప్ కోసం ఇండియాకు రాబోమని పాక్ బోర్డు కూడా హెచ్చరించింది. దీంతో రెండు జట్ల మధ్య రాజీ కుదర్చడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆసియా కప్ లో ఇండియా ఆడే మ్యాచ్ లో పాకిస్థాన్ లో కాకుండా మరో చోట నిర్వహించాలని, అలాగే వరల్డ్ కప్ లో ఇండియాలో పాకిస్థాన్ ఆడాల్సిన మ్యాచ్ లు బంగ్లాదేశ్ లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
దీనిపై ప్రస్తుతం చర్చలు నడుస్తున్నట్లు సదరు రిపోర్ట్ వెల్లడించింది. చివరిసారి పాకిస్థాన్ టీమ్ ఇండియాలో 2016లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో ఆడింది. కోల్‌కతాలో జరిగిన మ్యాచ్ లో ఈ రెండు టీమ్స్ తలపడ్డాయి. ఈ ఏడాది ఆసియా కప్ నిర్వహణ హక్కులు పాకిస్థాన్ దగ్గర ఉండటంతో గతేడాదే ఏసీసీ ఛీఫ్, బీసీసీఐ సెక్రటరీ అయిన జై షా తమ టీమ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్ పంపబోమని చెప్పారు.
అప్పటి నుంచే రెండు బోర్డుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఆ సమయంలో పాక్ బోర్డు ఛైర్మన్ గా ఉన్న రమీజ్ రాజా స్పందిస్తూ.. తాము ఇండియాలో జరగబోయే వరల్డ్ కప్ బాయ్ కాట్ చేస్తామని హెచ్చరించారు. అయితే ఈ నెల మొదట్లో దుబాయ్ లో ఏసీసీ సమావేశం జరిగింది. అందులో ఇండియా ఆడే మ్యాచ్ లను మాత్రం పాకిస్థాన్ లో కాకుండా మరోచోట నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పుడలాంటి ప్రతిపాదనే వరల్డ్ కప్ విషయంలోనూ వచ్చింది.