Afridi on Ind vs Pak: మోదీనే అడుగుతా.. ఇండియా, పాకిస్థాన్ మధ్య క్రికెట్ జరగాలి: అఫ్రిది
Afridi on Ind vs Pak: మోదీనే అడుగుతా.. ఇండియా, పాకిస్థాన్ మధ్య క్రికెట్ జరగాలి అని అన్నాడు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది. బీసీసీఐ శత్రువుల కంటే స్నేహితులను ఎక్కువగా చేసుకోవాలని సూచించాడు.
Afridi on Ind vs Pak: ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ పై మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రెండు దేశాల మధ్య తిరిగి క్రికెట్ సంబంధాలు ప్రారంభించాలని తాను భారత ప్రధాని నరేంద్ర మోదీనే అడుగుతానని చెప్పడం గమనార్హం. దోహాలో జరుగుతున్న లెజెండ్స్ క్రికెట్ లీగ్ సందర్భంగా అతడు మాట్లాడాడు.
"రెండు దేశాల మధ్య క్రికెట్ జరిగాలని నేను మోదీ సార్ నే అడుగుతాను. ఎవరైనా మాతో మాట్లాడటం మానేసి, స్నేహాన్ని వద్దనుకుంటే మేమేం చేయగలం? బీసీసీఐ చాలా బలమైన బోర్డు అనడంలో సందేహం లేదు. కానీ బలంగా ఉన్నారంటే బాధ్యత కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎక్కువ మంది శత్రువులను కాదు మిత్రులను చేసుకోవాలి. మిత్రులు ఎక్కువగా ఉంటే మరింత బలపడతారు" అని అఫ్రిది అభిప్రాయపడ్డాడు.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బలహీనంగా ఉన్నదని తాను అనుకోవడం లేదని కూడా చెప్పాడు. రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడటం కోసం క్రికెట్ గొప్ప దౌత్యంగా పని చేస్తుందని అన్నాడు. ఇండియన్ ప్లేయర్స్ తో తనకు ఇప్పటికీ మంచి సంబంధాలు ఉన్నట్లు తెలిపాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ సమయంలోనే సురేశ్ రైనా తనకు ఓ బ్యాట్ ఇచ్చినట్లు వెల్లడించాడు.
2005లో ఇండియన్ టీమ్ పాకిస్థాన్ కు వచ్చినప్పుడు వాళ్లు షాపింగ్ లో డబ్బులు ఇచ్చినా ఎవరూ తీసుకోలేదన్న విషయాన్ని గుర్తు చేశాడు. ఇక పాకిస్థాన్ లో ప్రస్తుతం ఎలాంటి భద్రతా సమస్యలు లేవని కూడా స్పష్టం చేశాడు. ఇండియా, పాకిస్థాన్ మధ్య క్రికెట్ జరగకూడదని భావిస్తున్న వాళ్లు ఉన్నారని, ఇప్పుడు రెండు దేశాల ప్రభుత్వాలు అనుమతి ఇవ్వకపోవడం ద్వారా వాళ్లకో అవకాశం ఇచ్చినట్లు అవుతోందని అఫ్రిది అన్నాడు.
సంబంధిత కథనం