Akhtar on Ind vs Pak: 2011 వరల్డ్ కప్‌కు ఇండియాపై పాక్ ప్రతీకారం తీర్చుకోవాలి: షోయబ్ అక్తర్
Akhtar on Ind vs Pak: 2011 వరల్డ్ కప్‌కు ఇండియాపై పాక్ ప్రతీకారం తీర్చుకోవాలని అన్నాడు షోయబ్ అక్తర్. అందుకే 2023 ఆసియా కప్ కోసం పాకిస్థాన్ కు ఇండియా, వరల్డ్ కప్ కోసం ఇండియాకు పాకిస్థాన్ రావాలని అక్తర్ చెప్పాడు.
Akhtar on Ind vs Pak: 2023లో ఆసియా కప్ తోపాటు వరల్డ్ కప్ కూడా జరగనున్న విషయం తెలుసు కదా. అయితే ఈ రెండు మెగా టోర్నీల విషయంలో ఇండియా, పాకిస్థాన్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మొదట ఆసియా కప్ పాకిస్థాన్ లో జరగనుంది. అయితే పాకిస్థాన్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లేది లేదని, ఆసియా కప్ నే మరో చోటికి తరలించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తోంది.
అలా చేస్తే తాము ఇండియాలో జరగబోయే వరల్డ్ కప్ కు రాబోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంటోంది. అయితే పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ మాత్రం ఆసియా కప్, వరల్డ్ కప్ సమయానికి పరిస్థితిలో మార్పు వస్తుందని నమ్ముతున్నాడు. అంతేకాదు ఆసియా కప్, వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఈ రెండు టీమ్సే తలపడాలనీ ఆకాంక్షిస్తున్నాడు.
"ఇండియా, పాకిస్థాన్ ఆసియా కప్ ఫైనల్లోనే కాదు.. వరల్డ్ కప్ ఫైనల్లోనూ తలపడతాయి. ఆసియా కప్ కోసం పాకిస్థాన్ కు ఇండియా వస్తుంది. వరల్డ్ కప్ కోసం ఇండియాకు పాకిస్థాన్ వెళ్తుంది. ఇండియా, పాకిస్థాన్ మధ్య పరిస్థితులు మెరుగుపడతాయని నేను ఆశిస్తున్నాను. అంతేకాదు వాణిజ్యం కూడా ప్రారంభమవుతుందని అనుకుంటున్నాను. రెండు దేశాల మధ్య సానుకూలత పెరగాలి. రెండు దేశాల మధ్య ఉన్న హద్దులు చెరిపేయాలి" అని అక్తర్ స్పోర్ట్స్ టుడేతో అన్నాడు.
ఈ సందర్భంగా 2011 వరల్డ్ కప్ సెమీఫైనల్ ను కూడా గుర్తు చేశాడు. ఆ మ్యాచ్ లో పాకిస్థాన్ ను ఓడించిన ఇండియా ఫైనల్ చేరింది. ఆ తర్వాత ట్రోఫీ కూడా గెలిచింది. అప్పటి పరాభవానికి ఇప్పుడు పాకిస్థాన్ ప్రతీకారం తీర్చుకోవాలని అక్తర్ అన్నాడు.
"2011 వరల్డ్ కప్ ప్రతీకారం ఇప్పుడు తీర్చుకోవాలని నేను అనుకుంటున్నాను. ఆ మ్యాచ్ నేను ఆడలేదు. ఇండియాలో వాంఖెడె లేదా అహ్మదాబాద్ ఎక్కడ అయితే అక్కడ వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా, పాకిస్థాన్ తలపడాలి. ఆ ఫైనల్ చూడటానికి నేను ప్రయత్నిస్తా" అని అక్తర్ చెప్పాడు.
"బీసీసీఐ, పీసీబీ చేతుల్లో ఏమీ లేదు. వాళ్ల ప్రభుత్వాలను అడగకుండా వాళ్లు ఏమీ చేయలేరు. వాళ్లు ప్రకటనలు ఇవ్వడంలో అర్థం లేదు. ఇద్దరూ స్టేట్ మెంట్స్ ఇవ్వడం ఆపాలి. ప్రభుత్వాల మధ్య పరిస్థితులు మెరుగుపడితే వాళ్లే మాట్లాడుకుంటారు. ఏదైనా జరగడానికి లేదా ఆపడానికి బీసీసీఐ లేదా పీసీబీ ఎవరు? వరల్డ్ కప్ కోసం ఇండియాకు పాకిస్థాన్ రావడం బీసీసీఐకే మంచిది" అని అక్తర్ అన్నాడు.
సంబంధిత కథనం