Shoaib Akhtar on Bumrah: బుమ్రా ఎక్కువ రోజులు బౌలింగ్ చేయలేడు: షోయబ్ అక్తర్-shoaib akhtar on bumrah says his bowling action is not sustainable ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Shoaib Akhtar On Bumrah: బుమ్రా ఎక్కువ రోజులు బౌలింగ్ చేయలేడు: షోయబ్ అక్తర్

Shoaib Akhtar on Bumrah: బుమ్రా ఎక్కువ రోజులు బౌలింగ్ చేయలేడు: షోయబ్ అక్తర్

Hari Prasad S HT Telugu
Mar 21, 2023 03:01 PM IST

Shoaib Akhtar on Bumrah: బుమ్రా ఎక్కువ రోజులు బౌలింగ్ చేయలేడని అన్నాడు పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్. అతని బౌలింగ్ యాక్షన్, బుమ్రాపై ఉన్న పనిభారాన్ని సరిగా నిర్వహించకపోవడమే దీనికి కారణమని చెప్పాడు.

జ‌స్ప్రీత్ బుమ్రా
జ‌స్ప్రీత్ బుమ్రా

Shoaib Akhtar on Bumrah: జస్‌ప్రీత్ బుమ్రా.. విలక్షణమైన బౌలింగ్ యాక్షన్ తో అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టి.. సక్సెస్ సాధించిన పేస్ బౌలర్. అయితే ఆ విలక్షణమైన బౌలింగ్ యాక్షన్, అతనిపై ఉన్న పనిభారాన్ని సరిగా నిర్వహించలేకపోవడమే ఇప్పుడు బుమ్రా గాయపడటానికి ప్రధాన కారణమని అన్నాడు పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్.

గతేడాది ఆగస్ట్ నుంచి టీమిండియాకు దూరంగా ఉన్న బుమ్రా.. ఈ మధ్యే సర్జరీ చేయించుకోవడంతో మరో ఆరు నెలలు క్రికెట్ దూరం కానున్నాడు. దీంతో ఐపీఎల్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కూడా అతడు ఆడటం లేదు. బుమ్రా బౌలింగ్ యాక్షన్ వల్ల అతడు వెన్ను గాయానికి గురవుతాడని ఏడాది కిందటే చెప్పిన అక్తర్.. ఇప్పుడు మరోసారి అలాంటి కామెంట్సే చేశాడు.

"బుమ్రాది ఫ్రంట్ ఆన్ యాక్షన్. ఈ యాక్షన్ తో బౌలింగ్ చేసే సమయంలో అతని వెన్నుపై చాలా భారం పడుతుంది. మేము సైడ్ ఆన్ బౌలర్లం. మాలాంటి బౌలర్లకు పిరుదులు, తొడలు, ఎడమ చేతుల నుంచి సాయం అంది వెన్నుపై భారం తగ్గుతుంది. కానీ బుమ్రాకు ఆ అవకాశం లేదు" అని స్పోర్ట్స్ తక్ తో మాట్లాడుతూ అక్తర్ చెప్పాడు. ఫ్రంట్ ఆన్ యాక్షన్ తో వెన్నుపై భారం పడకుండా ఎంత ప్రయత్నించినా కుదరదని స్పష్టం చేశాడు.

అంతేకాదు అతని పని భారాన్ని సరిగా మేనేజ్ చేయని టీమిండియా మేనేజ్‌మెంట్ నూ అక్తర్ విమర్శించాడు. "అతడు ఆడుతున్న క్రికెట్ చూస్తే బుమ్రా గాయం బారిన పడటం ఖాయం. మూడు ఫార్మాట్లతోపాటు ఐపీఎల్ కూడా ఆడుతున్నాడు. అతని బౌలింగ్ యాక్షన్ ఎక్కువ రోజులు కొనసాగేది కాదు" అని అక్తర్ అన్నాడు.

ఇండియన్ టీమ్ అతన్ని సరిగా మేనేజ్ చేయలేకపోడం దురదృష్టకరమని, బుమ్రా కూడా తనకు తానుగా తన పరిస్థితి గురించి తెలుసుకోవాల్సిందని అభిప్రాయపడ్డాడు. "నేను మేనేజ్‌మెంట్ లో ఉండి ఉంటే.. అతన్ని ఐదు వన్డేలకుగాను కేవలం మూడు వన్డేలే ఆడించే వాడిని.

అది కూడా ముఖ్యమైన మ్యాచ్ లు మాత్రమే. ఎక్కువ ట్రైనింగ్, తక్కువ మ్యాచ్ లే అతని కెరీర్ ను పెంచుతాయి. అతని వెన్ను భాగంలో చాలా కండర శక్తి కావాలి" అని అక్తర్ స్పష్టం చేశాడు. "అతని బౌలింగ్ యాక్షన్ మార్చలేము. ఆ యాక్షన్ తోనే అతడు రాణించాడు. అతడు ధైర్యవంతుడైన బౌలర్. ఇలాంటి దశ ఎదుర్కోవడం చూస్తే బాధేస్తోంది. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను" అని అక్తర్ అన్నాడు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్