Gavaskar on Hardik Pandya: వరల్డ్ కప్ తర్వాత టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యానే: గవాస్కర్
Gavaskar on Hardik Pandya: వరల్డ్ కప్ తర్వాత టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యానే అని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అనడం గమనార్హం. స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడిన సందర్భంగా సన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Gavaskar on Hardik Pandya: హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఎలా ఉందో మనం చూశాం. ఐపీఎల్లో గతేడాది గుజరాత్ టైటన్స్ ను విజేతగా నిలిపిన తర్వాత ఇండియన్ టీమ్ కెప్టెన్ గానూ రాణించాడు. దీంతో భవిష్యత్తు కెప్టెన్ అతడే అన్న అంచనాలు మొదలయ్యాయి. అయితే మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అయితే మరో అడుగు ముందుకేసి ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత కెప్టెన్ పాండ్యానే అని తేల్చేయడం విశేషం.
ఆస్ట్రేలియాతో రానున్న వన్డే సిరీస్ పై స్పందిస్తూ.. సన్నీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. "అతని కెప్టెన్సీ నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. అది గుజరాత్ టైటన్స్ కు అయినా, ఇండియా టీ20 టీమ్ కు అయినా పాండ్యా అద్భుతంగా సారథ్యం వహించాడు. ముంబైలో జరగబోయే తొలి మ్యాచ్ గెలిస్తే మాత్రం రానున్న వరల్డ్ కప్ తర్వాత అతన్ని ఇండియా కెప్టెన్ గా అభివర్ణించవచ్చు" అని స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ గవాస్కర్ అన్నాడు.
"అతడో ఇంపాక్ట్ ప్లేయర్. మిడిలార్డర్ లో గేమ్ ఛేంజర్ కూడా. గుజరాత్ టీమ్ తరఫున కూడా అతడు తనను తాను బ్యాటింగ్ లో ప్రమోట్ చేసుకున్నాడు. టీమ్ కు అవసరమైన సందర్భాల్లో అలా బ్యాటింగ్ ఆర్డర్ లో పైన వచ్చి పని పూర్తి చేశాడు" అని సన్నీ చెప్పాడు. ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ లో తొలి వన్డేకు హార్దిక్ పాండ్యానే తాత్కాలిక కెప్టెన్ చేశారు.
రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతో తొలి మ్యాచ్ కు దూరమయ్యే అవకాశాలు ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వన్డేల్లోనూ టీమ్ కు కెప్టెన్సీ చేసే అవకాశం పాండ్యాకు వచ్చింది. అతడు ప్లేయర్స్ తో ఉండే విధానం కూడా హార్దిక్ ను కెప్టెన్సీ ఫేవరెట్ గా మార్చిందని ఈ సందర్భంగా గవాస్కర్ అన్నాడు.
"హార్దిక్ కెప్టెన్ గా ఉంటే.. మిగతా జట్టులో ఓ సౌకర్యవంతమైన వాతావరణం కనిపిస్తుంది. ప్లేయర్స్ తో అతను వ్యవహరించే తీరు అదే కావచ్చు. ప్లేయర్స్ భుజం చుట్టూ చేయి వేస్తూ వాళ్లు సౌకర్యవంతంగా ఫీలయ్యేలా పాండ్యా చేస్తాడు. అది చాలా ముఖ్యం. దానివల్ల ఓ ప్లేయర్ ధైర్యంగా వెళ్లి తన సహజ ఆటతీరు ప్రదర్శిస్తాడు. వాళ్లను అతడు బాగా ప్రోత్సహిస్తాడు. కెప్టెన్ గా బాధ్యత తీసుకుంటూ, ముందుండి నడిపిస్తూ, తాను చేయాల్సిన పనిని ప్లేయర్స్ చేయాల్సిందిగా చెప్పకపోవడం అన్నది చాలా ముఖ్యమైన విషయం" అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
సంబంధిత కథనం