IPL 2022 Final | ఐపీఎల్‌ 2022 ఛాంపియన్స్‌ గుజరాత్ టైటన్స్‌-gujarat titans are the champions of ipl 2022 beating rajasthan royals in the final ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Gujarat Titans Are The Champions Of Ipl 2022 Beating Rajasthan Royals In The Final

IPL 2022 Final | ఐపీఎల్‌ 2022 ఛాంపియన్స్‌ గుజరాత్ టైటన్స్‌

Hari Prasad S HT Telugu
May 29, 2022 11:42 PM IST

కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా ఆల్‌రౌండ్‌ షో ఆడిన తొలి సీజన్‌లోనే గుజరాత్‌ టైటన్స్‌ను ఛాంపియన్స్‌గా నిలిపింది. ఈసారి ట్రోఫీ గెలిచి షేన్‌ వార్న్‌కు ఘనంగా నివాళి అర్పిద్దామనుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌కు బ్యాటర్ల వైఫల్యంతో నిరాశే ఎదురైంది.

ఐపీఎల్ 2022 ఛాంపియన్స్ గుజరాత్ టైటన్స్
ఐపీఎల్ 2022 ఛాంపియన్స్ గుజరాత్ టైటన్స్ (Hotstar)

అహ్మదాబాద్: ఐపీఎల్‌ 2022 విజేతగా కొత్త టీమ్‌ గుజరాత్‌ టైటన్స్‌. ఫైనల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ను 7 వికెట్లతో చిత్తు చేసింది. నరేంద్ర మోదీ స్టేడియంలో రికార్డు స్థాయిలో ప్రత్యక్షంగా లక్షా 4 వేలకుపైగా ప్రేక్షకులు చూసిన ఈ మ్యాచ్‌లో రాయల్స్‌ నిర్దేశించిన 131 పరుగుల టార్గెట్‌ను 18.1 ఓవర్లలోనే చేజ్‌ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

శుభ్‌మన్‌ గిల్‌ సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు. అతడు చివరికి 43 బంతుల్లో 45 రన్స్‌ చేసి అజేయంగా నిలవగా.. కెప్టెన్‌ పాండ్యా 34, మిల్లర్‌ 32 రన్స్‌ చేశారు. ట్రోఫీ మిస్‌ అయినా.. ఈసారి ఆరెంజ్‌, పర్పుల్‌ క్యాప్‌లు రాజస్థాన్‌ రాయల్స్‌ ప్లేయర్స్‌కే దక్కాయి. అత్యధిక పరుగులు చేసిన జోస్‌ బట్లర్‌ (863) ఆరెంజ్‌ క్యాప్‌ అందుకోగా.. 27 వికెట్లతో చహల్ పర్పుల్‌ క్యాప్‌ సొంతం చేసుకున్నాడు.

131 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటన్స్‌కు టార్గెట్‌ను చేజ్‌ చేయడం అంత సులువేమీ కాలేదు. మొదటి నుంచీ రాజస్థాన్ రాయల్స్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ ఒక్కో పరుగు కోసం టైటన్స్‌ బ్యాటర్లు చెమటోడ్చేలా చేశారు. ఓపెనర్‌ వృద్దిమాన్‌ సాహా (5), మాథ్యూ వేడ్ (8) విఫలమయ్యారు. తొలి బంతికే మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

చహల్‌ క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన అతడు.. తర్వాత కెప్టెన్ హార్దిక్‌ పాండ్యాతో కలిసి కీలకమైన మూడో వికెట్‌కు 63 రన్స్‌ జోడించారు. పాండ్యా 30 బంతుల్లో 34 రన్స్‌ చేసి చహల్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అయితే ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో ఆ పరుగులే చాలా కీలకమయ్యాయి. అంతకుముందు బౌలింగ్‌లోనూ అతడు మూడు వికెట్లు తీసిన విషయం తెలిసిందే.

హార్దిక్ మ్యాజిక్

అంతకుముం గుజరాత్‌ టైటన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా బంతితో చెలరేగాడు. 4 ఓవర్లలో కేవలం 17 రన్స్‌ ఇచ్చి కీలకమైన 3 వికెట్లు తీశాడు. అందులో డేంజరస్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ కూడా ఉన్నాడు. దీంతోపాటు సరైన టైమ్ లో సరైన బౌలింగ్ మార్పులు చేసి రాజస్థాన్‌ రాయల్స్‌ను 20 ఓవర్లలో 9 వికెట్లకు 130 పరుగులకే కట్టడి చేయగలిగాడు. అతనికి స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ మంచి సహకారం అందించాడు. రషీద్‌ 4 ఓవర్లలో 18 రన్స్‌ మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. రాయల్స్‌ ఇన్నింగ్స్‌లో 39 రన్స్‌ చేసిన బట్లరే టాప్‌ స్కోరర్‌.

టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌ తమ ఇన్నింగ్స్‌ను ఆచితూచి మొదలుపెట్టింది. మొదట్లో భారీ షాట్లు ఆడటానికి ఇబ్బంది పడిన ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ తర్వాత షమి బౌలింగ్‌లో ఒకటి, యశ్‌ దయాల్ బౌలింగ్‌లో మరొక సిక్స్‌ కొట్టి ఊపు మీద కనిపించాడు. అయితే 22 రన్స్‌ చేసి యశ్‌ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. దీంతో 31 రన్స్‌కు రాయల్స్‌ తొలి వికెట్‌ కోల్పోయారు.

ఇక అక్కడి నుంచి రాజస్థాన్‌ వరుసగా వికెట్లు కోల్పోతూనే ఉంది. కెప్టెన్‌ సంజు శాంసన్‌ (11) ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. క్రీజులో కుదురుకోవడానికే ఇబ్బంది పడిన దేవ్‌దత్‌ పడిక్కల్‌ 10 బాల్స్‌ ఆడి కేవలం 2 రన్స్‌ చేసి ఔటయ్యాడు. టోర్నీ మొత్తం టాప్‌ ఫామ్‌లో ఉన్న బట్లర్‌ ఓవైపు అడపాదడపా బౌండరీలు బాదినా.. స్కోరుబోర్డు వేగంగా ముందుకు కదల్లేదు.

ఈ ఒత్తిడిలో అతడు పాండ్యా బౌలింగ్‌లో థర్డ్‌మ్యాన్‌ దిశగా ఆడటానికి ప్రయత్నించి వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో బట్లర్‌ 35 బంతుల్లో 39 రన్స్‌ మాత్రమే చేశాడు. కాసేపటికే పాండ్యా బౌలింగ్‌లోనే రెండు ఫోర్లు కొట్టి ఊపు మీద కనిపించిన హెట్‌మయర్‌ (11) కూడా అతని బౌలింగ్‌లోనే ఔటై నిరాశపరిచాడు. అశ్విన్ (6) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు.

WhatsApp channel

టాపిక్