Asia Cup 2023: ఆసియా కప్‌పై నెగ్గిన బీసీసీఐ పంతం - ఇండియా మ్యాచ్‌లకు వేదికలు ఇవేనా?
24 March 2023, 9:21 IST
Asia Cup 2023:ఆసియా కప్ 2023పై నెలకొన్న సందిగ్ధతపై త్వరలోనే ఓ క్లారిటీ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఆసియా కప్‌లో ఇండియా ఆడనున్న మ్యాచ్‌లకు తటస్ట వేదికలను ఫిక్స్ చేసినట్లు తెలిసింది. ఇండియా మ్యాచ్‌లు ఎక్కడ జరుగనున్నాయంటే...
ఇండియా వర్సెస్ పాకిస్థాన్
Asia Cup 2023: ఆసియా కప్ 2023 నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది ఆసియా కప్ పాకిస్థాన్‌లో జరుగనున్న సంగతి తెలిసిందే. ఇండియా, పాకిస్థాన్ మధ్య సరైన సంబంధాలు లేకపోవడం, భద్రతా పరమైన కారణాలతో పాకిస్థాన్‌లో పర్యటించేందుకు ఇండియా సుముఖంగా లేదు.
దాంతో ఆసియా కప్ జరుగుతుందా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది. ఆసియా కప్ నిర్వహణపై చాలా రోజులుగా తర్జనభర్జనలు కొనసాగుతోన్నాయి. ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఐసీసీ క్వార్టర్ మీటింగ్‌లో ఆసియా కప్ నిర్వహణపై బీసీసీఐ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ మధ్య మరోసారి చర్చలు జరిగినట్లు తెలిసింది. తటస్ట వేదికలపై ఇండియా మ్యాచ్‌లు నిర్వహించేలా రెండు క్రికెట్ బోర్డ్స్ మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం.
ఇండియా మ్యాచ్‌లకు శ్రీలంక, ఒమన్, యూఏఈ, బంగ్లాదేశ్‌లు ఆతిథ్యం ఇవ్వబోతున్నట్లు తెలిసింది. ఈ వేదికల విషయంలో త్వరలోనే ఫైనల్ డెసిషన్‌కు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మిగిలిన మ్యాచ్‌లు పాకిస్థాన్‌లోనే జరిగేలా ఆసియా కప్ షెడ్యూల్‌ను ఫిక్స్ చేయబోతున్నట్లు సమాచారం.
ఒకవేళ ఇండియా, పాకిస్థాన్ ఫైనల్ చేరుకుంటే ఆతిథ్య పాకిస్థాన్‌లో కాకుండా తటస్ట వేదికపై ఫైనల్‌ను నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలుత ఆసియా కప్ మొత్తానికి ఇండియా దూరమవ్వాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరిగింది.
ఒకవేళ అదే జరిగితే ఈ ఏడాది ఇండియాలో జరుగనున్న వన్డే వరల్డ్ కప్ లో తాము పాల్గొనబోమని పాకిస్థాన్ బోర్డ్ ప్రకటించింది. ఒక వేళ వరల్డ్ కప్ ఆడినా తమ మ్యాచ్‌లను ఇండియాలో కాకుండా ఇతర దేశాల్లో నిర్వహించాలని పట్టుబడుతోంది.
దాంతో ఆసియా కప్ షెడ్యూల్‌ను అనుసరించే పాకిస్థాన్ వరల్డ్ కప్ మ్యాచ్‌ల నిర్వహణపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్ విషయంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. కాగా ఆసియా కప్ సెప్టెంబర్‌లో ప్రారంభంకానుంది.