Latif on Rohit: ఇది బీసీసీఐ పనే.. రోహిత్ ఆ ప్రశ్నలు నేరుగా ఐసీసీనే అడిగాడు: పాక్ మాజీ క్రికెటర్
14 June 2023, 12:45 IST
- Latif on Rohit: ఇది బీసీసీఐ పనే.. రోహిత్ ఆ ప్రశ్నలు నేరుగా ఐసీసీనే అడిగాడు అంటూ డబ్ల్యూటీసీ ఫైనల్ పై పాక్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ స్పందించాడు. రోహిత్ అడిగిన ప్రశ్నలు బీసీసీఐ వెర్సెస్ ఐసీసీ అన్నట్లుగానే ఉన్నాయని చెప్పాడు.
రోహిత్ శర్మ
Latif on Rohit: డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అడిగిన ప్రశ్నలపై పాక్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ స్పందించాడు. ఇది ఒకరకంగా బీసీసీఐ వెర్సెస్ ఐసీసీనే అని లతీఫ్ స్పష్టం చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ లోనే, అది కూడా ఇంగ్లండ్ లోనే ఎందుకు అని.. ఇది బెస్టాఫ్ త్రీ ఫైనల్స్ లాగా ఉంటే బాగుంటుందని రోహిత్ అభిప్రాయపడిన విషయం తెలిసిందే.
అంతేకాదు శుభ్‌మన్ గిల్ ను రెండో ఇన్నింగ్స్ లో ఔటిచ్చిన విధానంపై కూడా రోహిత్ అసంత్రుప్తి వ్యక్తం చేశాడు. అయితే రోహిత్ ఈ ప్రశ్నలను నేరుగా ఐసీసీనే అడిగాడని, తెర వెనుక ఇది బీసీసీఐ వెర్సెస్ ఐసీసీ అని లతీఫ్ అనడం గమనార్హం. "డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడటానికి కేవలం జూన్ నెల మాత్రమే లేదు. ఇంగ్లండ్ లోనే కాదు ప్రపంచంలో మరెక్కడైనా ఆడొచ్చు" అని మ్యాచ్ తర్వాత రోహిత్ అన్నాడు.
ఇక గిల్ ఔట్ పై స్పందిస్తూ.. మరిన్ని కెమెరా యాంగిల్స్ చూయించాల్సిందని, కేవలం ఒకటి, రెండు మాత్రమే చూపించారని రోహిత్ అసహనం వ్యక్తం చేశాడు. దీనిపై తాజాగా లతీఫ్ స్పందిస్తూ.. "అతడు నేరుగా ఐసీసీనే అడిగాడు. జూన్ ఎందుకు అని.
గతంలో నేను కూడా ఇదే చెప్పాను. ఇంగ్లండ్ లోనే ఎందుకు? ఇది అతడు ఎవరికి చెబుతున్నాడు? ఐసీసీకే కదా. ఇక శుభ్‌మన్ గిల్ క్యాచ్ విషయానికి వస్తే అతడు కెమెరా యాంగిల్స్ గురించి మాట్లాడాడు. అతడు నేరుగా ఐసీసీనే టార్గెట్ చేశాడు. తెర వెనుక ఇది బీసీసీఐ వెర్సెస్ ఐసీసీ. ఆదాయంలో బీసీసీఐ వాటా 38.5 శాతం అని మనం చదివాం. దీనిపై ఐసీసీ నుంచి ప్రకటన రాలేదు. ఓ వెబ్‌సైట్ ఆ వార్త రాసింది. అది ఎవరిది? ఇక్కడ పరస్పన విరుద్ధ ప్రయోజనాలు దాగి ఉన్నాయి" అని లతీఫ్ అన్నాడు.