ICC on Soft signal: క్రికెట్‌లో రెండు కీలక మార్పులు చేసిన ఐసీసీ-icc on soft signal as it scraps the rule and made changes to free hit rule too ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Icc On Soft Signal As It Scraps The Rule And Made Changes To Free Hit Rule Too

ICC on Soft signal: క్రికెట్‌లో రెండు కీలక మార్పులు చేసిన ఐసీసీ

Hari Prasad S HT Telugu
May 15, 2023 07:05 PM IST

ICC on Soft signal: క్రికెట్‌లో రెండు కీలక మార్పులు చేసింది ఐసీసీ. ఇక నుంచి సాఫ్ట్ సిగ్నల్ రూల్ ఎత్తేయడంతోపాటు ఫ్రీ హిట్ నిబంధనలకు కూడా చిన్న మార్పు చేసింది.

ఐసీసీ
ఐసీసీ (REUTERS)

ICC on Soft signal: క్రికెట్ నిబంధనల్లో రెండు చెప్పుకోదగిన మార్పులు చేసింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ). ఆన్ ఫీల్డ్ అంపైర్లు ఇచ్చే సాఫ్ట్ సిగ్నల్ ఇక కనిపించదు. ఎన్నోసార్లు వివాదాలకు కారణమై, థర్డ్ అంపైర్లను అయోమయంలోకి నెట్టిన ఈ సాఫ్ట్ సిగ్నల్ నిబంధనను తొలగించారు. సందేహాస్పద క్యాచ్ ల విషయంలో ఆన్ ఫీల్డ్ అంపైర్లు ఔట్ లేదా నాటౌట్ ను సాఫ్ట్ సిగ్నల్ గా ఇచ్చేవారు.

ట్రెండింగ్ వార్తలు

తర్వాత థర్డ్ అంపైర్ కు రిఫర్ చేసేవాళ్లు. అయితే ఈ సాఫ్ట్ సిగ్నల్ థర్డ్ అంపైర్ ను అయోమయానికి గురి చేసేది. ఓ క్యాచ్ సందేహాస్పదంగా ఉన్నప్పుడు ఆన్ ఫీల్డ్ అంపైర్ మొత్తం నిర్ణయాన్ని మూడో అంపైర్ కే వదిలేస్తే మేలన్నది చాలా మంది వాదన. చాలాసార్లు విజువల్స్ స్పష్టంగా లేని సమయాల్లో ఆన్ ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన సాఫ్ట్ సిగ్నల్ ఆధారంగా థర్డ్ అంపైర్ నిర్ణయం ప్రకటించేవాడు.

దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ సాఫ్ట్ సిగ్నల్ ను ఐసీసీ తాజాగా ఎత్తేసింది. గంగూలీ ఆధ్వర్యంలోని ఐసీసీ క్రికెట్ కమిటీ సిఫార్సు మేరకు నిబంధనల్లో మార్పులు చేసినట్లు ఐసీసీ వెల్లడించింది. ఇక నుంచి ఆన్ ఫీల్డ్ అంపైర్లు సందేహాస్పద క్యాచ్ ల విషయంలో తమ నిర్ణయాన్ని వెల్లడించకుండా నేరుగా థర్డ్ అంపైర్ కు నివేదించాల్సి ఉంటుంది.

ఫ్రీ హిట్‌లోనూ మార్పులు.. హెల్మెట్ తప్పనిసరి

ఇక తాజా మార్పుల్లో హై రిస్క్ ఉన్న సమయాల్లో హెల్మెట్ తప్పనిసరి అన్న నిబంధన కూడా ఒకటి. బ్యాటర్లు ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొంటున్నప్పుడు, వికెట్ కీపర్లు స్టంప్స్ కు దగ్గరగా నిల్చొన్నప్పుడు, ఫీల్డర్లు బ్యాటర్లకు దగ్గరగా ఫీల్డ్ చేస్తున్నప్పుడు హెల్మెట్లు తప్పనిసరి అని ఐసీసీ స్పష్టం చేసింది. ఆటగాళ్లు భద్రత ఎంతో ముఖ్యమని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గంగూలీ వెల్లడించాడు.

ఇక ఫ్రీ హిట్ లోనూ స్వల్ప మార్పులు చేశారు. ఇక నుంచి ఫ్రీహిట్ బాల్ స్టంప్స్ కు తగిలిన సందర్భంలో బ్యాటర్ తీసే పరుగును కౌంట్ చేస్తారు. ఫ్రీహిట్ అంటే బ్యాటర్ ఎలాగూ ఔట్ అయ్యే వీల్లేదు. అదే సమయంలో బాల్ స్టంప్స్ ను తగిలి దూరంగా వెళ్లిన సమయంలో పరుగు తీసే అవకాశం కూడా ఈ తాజాగా మార్పు ద్వారా బ్యాటర్లకు కలుగుతుంది.

ఈ మార్పులు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఆ లెక్కన జూన్ 7 నుంచి ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ప్రారంభం కాబోయే డబ్ల్యూటీసీ ఫైనల్లో ఈ కొత్త నిబంధనలు అమలు చేస్తారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్