Rohit Sharma Captaincy: డేంజర్‌లో రోహిత్ టెస్ట్ కెప్టెన్సీ.. విండీస్ సిరీస్ గెలవకపోతే ఇంక అంతే..
Rohit Sharma Captaincy: రోహిత్ శర్మ టెస్ట్ కెప్టెన్సీ డేంజర్‌లో పడింది. విండీస్ సిరీస్ గెలవకపోతే ఇక ఈ ఫార్మాట్ లో అతడు కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి.
Rohit Sharma Captaincy: డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమితో రోహిత్ శర్మ మెడపై కత్తి వేలాడుతోంది. అతన్ని టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పించే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికైతే వెస్టిండీస్ టూర్ లో రెండు టెస్టుల సిరీస్ కు అతడు కెప్టెన్ గా ఉండనున్నాడు. ఒకవేళ తనకు తానుగా ఈ టూర్ నుంచి తప్పుకుంటే తప్ప ఈ టూర్ లో అతడే కెప్టెన్.
అయితే ఆ తర్వాతే టెస్ట్ ఫార్మాట్ లో రోహిత్ కెప్టెన్సీ డేంజర్ లో పడనుంది. ఒకవేళ విండీస్ తో సిరీస్ లో ఏమైనా తేడా వస్తే మాత్రం రోహిత్ తప్పుకోక తప్పని పరిస్థితి రావచ్చు. జులై 12 నుంచి వెస్టిండీస్ తో రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత వన్డే, టీ20 సిరీస్ లు కూడా ఉంటాయి. ఈ రెండు టెస్టుల సిరీస్ లో బ్యాట్ తోనూ రోహిత్ రాణించాల్సిన అవసరం ఏర్పడింది.
ఒకవేళ అతడు బ్యాటర్ గానూ విఫలమైతే బీసీసీఐ ఓ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అయితే అతని టెస్ట్ కెప్టెన్సీ డేంజర్‌లో ఉందన్న వార్తలను ఓ బీసీసీఐ సీనియర్ అధికారి ఖండించినా.. ఈ టెస్ట్ సైకిల్ రెండేళ్లు పూర్తయ్యే వరకూ అతడు ఉంటాడా లేదా అన్నది మాత్రం చెప్పలేమని అన్నారు. ప్రస్తుతానికి ఈ రెండు టెస్టుల సిరీస్ ముగిసిన తర్వాత అతని బ్యాటింగ్ ఫామ్ చూసి సెలక్షన్ కమిటీ అతనిపై తుది నిర్ణయానికి రావచ్చని ఆ అధికారి చెప్పడం గమనార్హం.
2023 నుంచి 2025 మధ్య డబ్ల్యూటీసీ కొత్త సైకిల్ ఉంటుంది. అయితే వచ్చే ఫైనల్ సమయానికి రోహిత్ 38 ఏళ్ల వయసుంటాడు. అప్పటి వరకూ అతడు ఆడతాడా లేక మధ్యలోనే రిటైరవుతాడా అన్నది చూడాలి. జులైలో వెస్టిండీస్ తో సిరీస్ తర్వాత డిసెంబర్ లో సౌతాఫ్రికాతో సిరీస్ వరకూ మధ్యలో టీమిండియా టెస్టులు ఆడటం లేదు. దీంతో రోహిత్ పై నిర్ణయం తీసుకోవడానికి సెలక్టర్లకు తగినంత సమయం దొరుకుతుంది.
కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత మొదట టీ20, వన్డే ఫార్మాట్లలో కెప్టెన్సీ చేపట్టిన రోహిత్ ను.. తర్వాత టెస్టు కెప్టెన్ గానూ నియమించారు. అయితే కెప్టెన్సీ భారమో, మరేంటోగానీ అప్పటి నుంచీ రోహిత్ బ్యాటింగ్ దెబ్బ తిన్నది. అంతేకాదు అతడు కెప్టెన్సీ చేపట్టిన తర్వాత ఇండియా 10 టెస్టులు ఆడగా.. మూడింటికి రోహిత్ దూరంగా ఉన్నాడు. మిగతా ఏడు టెస్టుల్లో కేవలం 390 రన్స్ మాత్రమే చేశాడు. ఒకే ఒక్క సెంచరీ చేయగా.. మిగతా ఇన్నింగ్స్ లో కనీసం 50 కూడా దాటలేదు.
సంబంధిత కథనం