Jaffer on Shubman Gill: విరాట్ కోహ్లి తర్వాత ఆ స్థాయి బ్యాటర్ శుభ్‌మన్ గిల్: జాఫర్ ప్రశంసలు
02 February 2023, 12:44 IST
- Jaffer on Shubman Gill: విరాట్ కోహ్లి తర్వాత ఆ స్థాయి బ్యాటర్ శుభ్‌మన్ గిల్ అంటూ మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ప్రశంసలు కురిపించాడు. న్యూజిలాండ్ పై మూడో టీ20లో అతడు ఆడిన తీరు చూసిన తర్వాత జాఫర్ మాట్లాడుతూ.. తన అంచనా కరెక్టే అని గిల్ నిరూపించాడని అన్నాడు.
శుభ్‌మన్ గిల్
Jaffer on Shubman Gill: జనరేషన్ మారుతున్న కొద్దీ క్రికెట్ లో మెరుగైన బ్యాటర్ లేదా బౌలర్ వస్తూనే ఉంటాడని ఈ మధ్య టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నాడు. సచిన్, విరాట్ లలో ఎవరు గొప్ప అనే చర్చపై అతడు ఇలా స్పందించాడు. కానీ ఇప్పుడు శుభ్‌మన్ గిల్ ను చూస్తుంటే అతడు చెప్పింది మరోసారి నిజమే అనిపిస్తోంది.
ఓవైపు సచిన్ రికార్డులను విరాట్ చేజ్ చేస్తుంటే.. మరోవైపు తర్వాతి తరం విరాట్ కోహ్లిని తానే అని గిల్ నిరూపించుకుంటున్నాడు. ఇదే మాట మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కూడా అంటున్నాడు. కోహ్లి తర్వాత ఆ స్థాయి బ్యాటర్ గిల్ అవుతాడని అతడు స్పష్టం చేశాడు. న్యూజిలాండ్ పై సిరీస్ విజయం తర్వాత ఈఎస్పీఎన్ క్రికిన్ఫోతో మాట్లాడిన జాఫర్.. గిల్ ను ఆకాశానికెత్తాడు.
"గత రెండు నెలలుగా గిల్ ఎంతో పరిణతి సాధించాడు. టెస్టులు, వన్డేల్లో తనను తాను నిరూపించుకున్నాడు. టీ20ల్లోనే అతని సామర్థ్యంపై సందేహాలు ఉండేవి. అతని స్ట్రైక్ రేట్ మెరుగ్గా లేదన్న వాదన వినిపించేది. కానీ అది తప్పని ఇప్పుడతడు నిరూపించాడు. అతని ఆటతీరు చూసిన తర్వాత ఇండియా ఎంత గొప్ప ప్లేయర్ ను సంపాదించిందో స్పష్టమవుతోంది.
నేను చాలా రోజుల కిందట చెప్పినట్లు గిల్ మూడు ఫార్మాట్లలో ఆడదగిన ప్లేయర్. ఇండియన్ క్రికెట్ లో విరాట్ కోహ్లి తర్వాత ఆ స్థాయి బ్యాటర్. అతడు నేను చెప్పింది నిజమని నిరూపించాడు" అని జాఫర్ అన్నాడు.
మూడు ఫార్మాట్లకు తగిన ఆటతీరు గిల్ సొంతమని కూడా జాఫర్ చెప్పాడు. ఇక అతనిలోని ప్రత్యేకతను కూడా జాఫర్ వెల్లడించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలలో ఉన్న క్వాలిటీ శుభ్‌మన్ లోనూ ఉందని, ఎప్పుడు తగ్గాలి, ఎప్పుడు అటాక్ చేయాలన్నది అతనికి బాగా తెలుసని చెప్పాడు. ఇక ఇన్నింగ్స్ మొదట్లోనే గిల్ బౌలర్లు వేసిన మంచి బంతులను కూడా బౌండరీలకు తరలిస్తాడని, అది బౌలర్లపై ఒత్తిడి పెంచుతుందని జాఫర్ అన్నాడు.
న్యూజిలాండ్ తో జరిగిన చివరి టీ20లో గిల్ ఏకంగా 63 బంతుల్లో 126 రన్స్ చేసిన విషయం తెలిసిందే. అతడు నరేంద్ర మోదీ స్టేడియంలో భారీ షాట్లతో అలరించాడు. గిల్ ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు, 7 సిక్స్ లు ఉన్నాయి.