Team India Record in 2022: క్రికెట్ చరిత్రలో టీమిండియా అరుదైన రికార్డు-team india record in 2022 with most international matches ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Team India Record In 2022: క్రికెట్ చరిత్రలో టీమిండియా అరుదైన రికార్డు

Team India Record in 2022: క్రికెట్ చరిత్రలో టీమిండియా అరుదైన రికార్డు

Hari Prasad S HT Telugu
Jan 31, 2023 05:29 PM IST

Team India Record in 2022: క్రికెట్ చరిత్రలో టీమిండియా అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. ఏడాది మొత్తం ఎప్పుడు చూసినా ఏదో ఒక మ్యాచ్ తో బిజీగా ఉండే ఇండియన్ టీమ్ 2022లో ఈ అరుదైన రికార్డును అందుకుంది.

2022లో రికార్డు మ్యాచ్ లు ఆడిన టీమిండియా
2022లో రికార్డు మ్యాచ్ లు ఆడిన టీమిండియా (AFP)

Team India Record in 2022: ఇండియా అంటేనే క్రికెట్ ను అమితంగా ఇష్టపడే దేశం. ఏడాది మొత్తం తమ నేషనల్ టీమ్ క్రికెట్ ఆడుతుంటే చూడాలని ప్రతి అభిమాని కోరుకుంటాడు. పైగా ప్రపంచంలోనే రిచెస్ట్ బోర్డు అయిన బీసీసీఐ కూడా టీమిండియాను అసలు ఖాళీగా ఉంచదు. అయితే ఐసీసీ, ఏసీసీ ఈవెంట్లు.. లేదంటే ద్వైపాక్షిక సిరీస్ లతో ఇండియన్ క్రికెట్ టీమ్ ఎప్పుడూ బిజీగానే ఉంటుంది.

ఈ బిజీ షెడ్యూలే టీమిండియా 2022లో ఓ అరుదైన రికార్డు అందుకునేలా చేసింది. 2022లో టీమిండియా ఏకంగా 71 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడటం విశేషం. ఒక కేలండర్ ఏడాదిలో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన రికార్డును ఇండియన్ టీమ్ తన పేరిట రాసుకుంది. ఇప్పటి వరకూ ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. ఆ టీమ్ 2009లో 61 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడింది.

ఇక టీమిండియా 2022లో ఆడిన మొత్తం 71 అంతర్జాతీయ మ్యాచ్ లలో 7 టెస్టులు, 24 వన్డేలు, 40 టీ20లు ఉన్నాయి. నిజానికి ఒక ఏడాదిలో 40 టీ20లు ఆడటం కూడా రికార్డే. గతంలో ఏ టీమ్ కూడా ఒక ఏడాదిలో ఈ ఫార్మాట్ లో ఇన్ని మ్యాచ్ లు ఆడలేదు. ఒక్క టీ20లనే కాదు ఒక ఏడాదిలో అత్యధిక టెస్టులు, వన్డేలు ఆడిన రికార్డు కూడా ఇండియన్ టీమ్ పేరిటే ఉండటం విశేషం.

1983లో ఇండియా రికార్డు స్థాయిలో 18 టెస్టులు ఆడింది. ఇక 1999లో 43 వన్డేలు ఆడింది. ఈ రెండూ ఇప్పటికీ రికార్డే. ఇక 2022లో 40 టీ20లతో మూడు ఫార్మాట్లలోనూ ఇండియానే టాప్ లో నిలిచింది. ఇండియా, ఆస్ట్రేలియా తర్వాత ఒక ఏడాదిలో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన లిస్టులో శ్రీలంక (57), ఇంగ్లండ్ (54) ఉన్నాయి. 2007లోనూ ఇండియా 55 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడింది.

ఇక 2022లో ఇండియా ఆడిన మొత్తం 71 మ్యాచ్ లలో రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ అత్యధికంగా 44 మ్యాచ్ లు ఆడారు. వాళ్ల తర్వాత శ్రేయస్ అయ్యర్, రోహిత్ శర్మ 39 మ్యాచ్ లు ఆడారు. అయితే ఒక ఏడాదిలో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన ప్లేయర్ రికార్డు మాత్రం అలాగే ఉంది. ఈ రికార్డు రాహుల్ ద్రవిడ్ (1999), మహ్మద్ యూసుఫ్(2000), ఎమ్మెస్ ధోనీ(2007) పేరిట ఉంది. ఈ ముగ్గురూ ఒకే ఏడాదిలో 53 మ్యాచ్ లు ఆడారు.

Whats_app_banner