Shubman Gill Records: ఫాస్టెస్ట్ సెంచరీతో టీ20 క్రికెట్‌లో మూడు రికార్డులు బ్రేక్ చేసిన శుభ్‌మన్ గిల్
02 February 2023, 7:02 IST
Shubman Gill Records: బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు శుభ్‌మన్‌గిల్. 63 బాల్స్‌లోనే 126 రన్స్ చేసి ఇండియాకు ఘన విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ ద్వారా టీ20 క్రికెట్‌లో పలు రికార్డులను శుభ్‌మన్‌గిల్ నెలకొల్పాడు.
శుభ్‌మన్‌గిల్
Shubman Gill Records: బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ మెరుపు సెంచరీ సాధించి టీమ్ ఇండియాకు ఘన విజయాన్ని అందించాడు. ఈ గెలుపుతో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో టీమ్ ఇండియా సొంతం చేసుకున్నది.
ఈ మ్యాచ్‌లో 54 బాల్స్‌లోనే శుభ్‌మన్ గిల్ మూడంకెల స్కోరును అందుకున్నాడు. మొత్తంగా 63 బాల్స్‌లో ఏడు సిక్సర్లు 12 ఫోర్లతో 126 రన్స్ చేసిన గిల్ నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఫాస్టెస్ట్ సెంచరీతో టీ20ల్లో పలు రికార్డులను శుభ్‌మన్ గిల్ తిరగరాశాడు.
మూడు ఫార్మెట్లలో సెంచరీ చేసిన ఐదో ఇండియన్ ప్లేయర్‌గా శుభ్‌మన్ గిల్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లి, రోహిత్‌శర్మ, కె.ఎల్ రాహుల్, సురేష్ రైనా ఉన్నారు. వారి తర్వాత శుభ్‌మన్‌గిల్ నిలిచాడు.
ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన భారత క్రికెటర్‌గా శుభ్‌మన్‌గిల్ నిలిచాడు. గతంలో ఈ రికార్డ్ సురేష్ రైనా పేరు మీద ఉంది. రైనా 2010లో సౌతాఫ్రికాపై 23 సంవత్సరాల 156 రోజుల్లో సెంచరీ చేశాడు. బుధవారం జరిగిన టీ20 మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ 23 సంవత్సరాల 146 రోజుల్లోనే సెంచరీ చేసి రైనా రికార్డ్‌ను అధిగమించాడు.
అలాగే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ తర్వాత టీ20 క్రికెట్‌లో సెంచరీ చేసిన మూడో భారత ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్ రికార్డ్ నెలకొల్పాడు.
ఈ మూడో టీ20 మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ సెంచరీతో భారత జట్టు ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 234 పరుగులు చేసింది. భారీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో విఫలమైన న్యూజిలాండ్ జట్టు 66 పరుగులకు ఆలౌటై చిత్తుగా ఓడింది.