తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Yashasvi Jaiswal: యశస్వి సెంచరీ కోసం సంజూ ఏం చేశాడో చూడండి.. ధోనీతో పోలుస్తున్న ఫ్యాన్స్

Yashasvi Jaiswal: యశస్వి సెంచరీ కోసం సంజూ ఏం చేశాడో చూడండి.. ధోనీతో పోలుస్తున్న ఫ్యాన్స్

Hari Prasad S HT Telugu

12 May 2023, 9:23 IST

google News
    • Yashasvi Jaiswal: యశస్వి సెంచరీ కోసం సంజూ ఏం చేశాడో చూడండి. ఇది చూసి అతన్ని ధోనీతో పోలుస్తున్నారు అభిమానులు. ఒకప్పుడు కోహ్లి విన్నింగ్ షాట్ ఆడటం కోసం ధోనీ కూడా ఇలాగే చేశాడు.
వైడ్ బాల్ ను అడ్డుకుంటున్న సంజూ శాంసన్
వైడ్ బాల్ ను అడ్డుకుంటున్న సంజూ శాంసన్

వైడ్ బాల్ ను అడ్డుకుంటున్న సంజూ శాంసన్

Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ కేకేఆర్ తో మ్యాచ్ లో సెంచరీకి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు కానీ.. అతడు సెంచరీ చేయడం, విన్నింగ్ షాట్ తో మ్యాచ్ ముగించడం కోసం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ మాత్రం బాగానే ప్రయత్నించాడు. అది చూసిన అభిమానులు.. సంజూని ధోనీతో పోలుస్తూ పోస్టులు పెడుతున్నారు. ఒకప్పుడు విరాట్ కోహ్లి కోసం ధోనీ ఇలాగే విన్నింగ్ రన్స్ కొట్టకుండా ఆగిపోయాడు.

అసలేం జరిగిందంటే.. గురువారం (మే 11) కేకేఆర్ తో మ్యాచ్ లో రాయల్స్ గెలవాలంటే 3 పరుగులు కావాలి. యశస్వి సెంచరీ కోసం 6 పరుగులు అవసరం. ఇలాంటి సమయంలో సుయాశ్ బౌలింగ్ లో సంజూ శాంసన్ స్ట్రైక్ లో ఉన్నాడు. కావాలంటే అతడు సులువుగా ఓ బౌండరీ బాది మ్యాచ్ ముగించగలడు. కానీ సంజూ అలా చేయకపోగా.. బౌలర్ కావాలని వైడ్ వేసి మ్యాచ్ ముగించాలని చూసినా దాన్నీ అడ్డుకున్నాడు.

సుయాశ్ లెగ్ సైడ్ వేసిన బాల్ ను సంజూ వెనక్కి జరిగి మరీ బ్లాక్ చేశాడు. దీంతో ఆ ఓవర్ ముగిసి తర్వాతి ఓవర్ కు యశస్వి స్ట్రైక్ లోకి వచ్చాడు. ఆ ఓవర్ తొలి బంతికే అతడు సిక్స్ కొట్టి ఉంటే అతని సెంచరీ అయ్యేది. మ్యాచ్ ముగిసేది. కానీ అది కాస్తా ఫోర్ కావడంతో యశస్వి 98 రన్స్ దగ్గర ఆగిపోయాడు. అయితే విన్నింగ్ షాట్ కొట్టే అవకాశం మాత్రం యశస్వికే దక్కింది. అతనికి ఆ అవకాశం ఇవ్వడం కోసం సంజూ చేసిన పని చూసి అభిమానులు ఫిదా అయ్యారు.

అప్పుడు ధోనీ.. ఇప్పుడు సంజూ

అతన్ని ధోనీతో పోలుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. 2014 టీ20 వరల్డ్ కప్ లో ధోనీ కూడా ఇలాగే చేశాడు. సెమీఫైనల్ మ్యాచ్ లో ఇండియా 173 రన్స్ టార్గెట్ చేజ్ చేస్తోంది. ఇందులో విరాట్ కళ్లు చెదిరే ఇన్నింగ్స్ ఆడాడు. 19వ ఓవర్ ఐదో బంతికి స్కోర్లు సమం కాగా.. చివరి బంతికి స్ట్రైక్ లోకి వచ్చిన ధోనీ కావాలని డిఫెన్స్ ఆడాడు.

తర్వాత ఓవర్ తొలి బంతికే విరాట్ ఫోర్ కొట్టి మ్యాచ్ ముగించాడు. ఆ మ్యాచ్ లో కోహ్లి 44 బంతుల్లో 72 పరుగులు చేశాడు. కోహ్లికి ఆ విన్నింగ్ షాట్ ఆడే అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ధోనీ అలా చేశాడు. ఇప్పుడు సంజూ కూడా అదే పని చేయడంతో అప్పుడు, ఇప్పుడు అని పోలుస్తూ అభిమానులు సోషల్ మీడియా పోస్టులు చేశారు.

తదుపరి వ్యాసం