Sanju Samson on Dhoni: జైపూర్ కూడా పసుపు మయం.. ధోనీపై సంజూ శాంసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Sanju Samson on Dhoni: జైపూర్ కూడా పసుపు మయం అయిపోయింది. దీంతో ధోనీని ఉద్దేశించి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Sanju Samson on Dhoni: క్రికెట్ లెజెండ్ ఎమ్మెస్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అని దాదాపు ప్రతి అభిమాని ఫిక్సయిపోయాడు. దీంతో ధోనీ ఏ స్టేడియంలో ఆడినా సరే.. లోకల్ టీమ్ ను కాదని స్టేడియమంతా పసుపుమయం అయిపోతోంది. చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలు, జెండాలు, నినాదాలతో స్టేడియాలు మార్మోగిపోతున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్, ముంబైలోని వాంఖెడే స్టేడియం పసుపు రంగులో మునిగి తేలాయి.
తాజాగా గురువారం (ఏప్రిల్ 27) రాజస్థాన్ రాయల్స్, సీఎస్కే మధ్య జైపూర్ లో జరుగుతున్న మ్యాచ్ లోనూ అదే జరిగింది. జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో ఎక్కడ చూసినా ఎల్లో కలరే కనిపించింది. దీంతో టాస్ సందర్భంగా రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ధోనీ పేరు చెప్పకపోయినా.. పరోక్షంగా అతని గురించి సంజూ ప్రస్తావించాడు.
నిజానికి ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ కు ఇది 200వ మ్యాచ్. అయినా కూడా స్థానిక అభిమానులు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ నామస్మరణలో మునిగిపోయారు. సంజూ టాస్ గెలిచినా పెద్దగా స్పందించని ఫ్యాన్స్.. ధోనీ రాగానే పెద్దగా అరిచారు. ఈ సందర్భంగా సంజూ మాట్లాడాడు.
"200వ ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న జట్టుకు కెప్టెన్సీ వహించడం ఆనందంగా ఉంది. ఈ ఫ్రాంఛైజీలో 8-10 ఏళ్లుగా ఉంటున్నాను. ఇది నాకు గొప్ప ఘనత. కానీ స్టేడియంలో కాస్త పింక్ కలర్ కనిపిస్తే బాగుండేది. ఎక్కడ చూసినా ఎల్లోనే కనిపిస్తోంది. దానికి కారణమేంటో నాకు తెలుసు" అని సంజూ అనడం విశేషం. ఈ సీజన్ లో ఇంతకుముందు కూడా ధోనీ పేరెత్తకుండా అతనిపై ప్రశంసలు కురిపించాడు.
ఈ సీజన్ లో ఈ రెండు టీమ్స్ చెన్నైలో తొలిసారి తలపడగా.. అందులో రాజస్థాన్ రాయల్స్ 3 పరుగులతో విజయం సాధించింది. అయితే తర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించిన చెన్నై.. టేబుల్లో టాప్ లోకి దూసుకెళ్లింది.
సంబంధిత కథనం