De Villiers on Sanju Samson: సంజూ శాంసన్ టీమిండియా కెప్టెన్ అవుతాడు: డివిలియర్స్
De Villiers on Sanju Samson: సంజూ శాంసన్ టీమిండియా కెప్టెన్ అవుతాడంటూ ఏబీ డివిలియర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రాజస్థాన్ రాయల్స్ టీమ్ కు కెప్టెన్ గా ఉన్న సంజూ.. కామ్‌గా ఉంటూ టీమ్ ను గెలిపిస్తున్నాడు.
De Villiers on Sanju Samson: ఇండియన్ టీమ్ లో సంజూ శాంసన్ కు రెగ్యులర్ గా చోటు దక్కడం లేదు. అప్పుడప్పుడూ వచ్చిన అవకాశాలను అతడు బాగానే సద్వినియోగం చేసుకుంటున్నా.. సెలక్టర్లు కరుణించడం లేదు. అయితే సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ మాత్రం ఏదో ఒక రోజు శాంసన్ ఇండియన్ టీమ్ కే కెప్టెన్ అవుతాడని అనడం విశేషం.
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న శాంసన్.. గతేడాది ఆ టీమ్ ను ఫైనల్ వరకూ తీసుకెళ్లాడు. "సంజూ శాంసన్ అద్భుతమైన ప్లేయర్. కానీ అతని కెప్టెన్సీ ఎలా ఉంది? అతనిలోని ప్రశాంతత నాకు బాగా నచ్చుతుంది. చాలా కామ్ గా ఉంటాడు. ఎప్పుడూ దేనికీ తీవ్రంగా స్పందించడు. ఓ కెప్టెన్ కు ఉండాల్సిన లక్షణం ఇదే" అని జియో సినిమాలో మాట్లాడుతూ డివిలియర్స్ అన్నాడు.
"వ్యూహాత్మకంగా అతడు చాలా మంచి కెప్టెన్. అతడు ఇంకా మెరుగవుతాడు. అనుభవం వచ్చిన కొద్దీ మెరుగవుతూనే ఉంటాడు. బట్లర్ లాంటి వ్యక్తితో ఉండటం శాంసన్ కు కలిసొస్తుంది" అని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. 2021లో తొలిసారి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అయిన శాంసన్.. 14 మ్యాచ్ లలో కేవలం ఐదింట్లో మాత్రమే గెలిపించాడు.
కానీ గతేడాది మాత్రం రాయల్స్ దూసుకెళ్లారు. 2008 తర్వాత తొలిసారి ఫైనల్ చేరారు. "అద్భుతమైన కెప్టెన్ కు ఉండాల్సిన అన్ని లక్షణాలు శాంసన్ కు ఉన్నాయి. వచ్చే ఏడాది, రెండేళ్లు లేదంటే మూడేళ్ల సమయంలో ఇండియన్ టీమ్ కు కూడా సులువుగా కెప్టెన్ అవుతాడు. కెప్టెన్ గా ఇలా సక్సెస్ అవుతూనే ఉంటే మాత్రం సంజూ శాంసన్ ఎక్కడికో వెళ్తాడు" అని డివిలియర్స్ అన్నాడు.
ఐపీఎల్ 2023లోనూ రాజస్థాన్ రాయల్స్ రెండు మ్యాచ్ లు ఆడగా.. ఒకటి గెలిచి, మరొకటి ఓడింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ను చిత్తు చేసిన రాయల్స్.. పంజాబ్ కింగ్స్ చేతుల్లో పోరాడి ఓడిపోయారు.
సంబంధిత కథనం