KKR vs RR: కోల్‌కతాను ఇంటికి పంపించిన యశస్వి జైస్వాల్- రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ
KKR vs RR: రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతడి సుడిగాలి ఇన్నింగ్స్‌తో కోల్‌కతాపై రాజస్థాన్ రాయల్స్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.
KKR vs RR: ఐపీఎల్ 2023 సీజన్‌లో కోల్‌కతా కథ దాదాపు ముగిసింది. గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయాన్ని సాధించింది.
రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కోల్‌కతా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 13 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ చేసి చరిత్రను సృష్టించాడు యశస్వి. 47 బాల్స్‌లో 13 ఫోర్లు, ఐదు సిక్సర్లతో అతడు 98 పరుగులు చేయడంతో కోల్‌కతా విధించిన 150 పరుగుల టార్గెట్‌ను రాజస్థాన్ 13.1 ఓవర్లలోనే ఛేదించింది. యశస్వి జైస్వాల్‌తో పాటు రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ 29 బాల్స్‌లో ఐదు సిక్సర్లు, రెండు ఫోర్లతో 48 రన్స్ చేశాడు.
యశస్వి దెబ్బకు తొలి ఓవర్ వేసిన కోల్‌కతా కెప్టెన్ నితీష్ రానా 26 పరుగులు సమర్పించుకున్నాడు. యశస్వి, సంజూ శాంసన్ జోరుకు బ్రేకులు వేయడానికి కోల్‌కతా ఏడుగురు బౌలర్లను ప్రయోగించిన ఫలితం లేకుండా పోయింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేసింది.
వెంకటేష్ అయ్యర్ (42 బాల్స్‌లో నాలుగు సిక్సర్లు, రెండు ఫోర్లతో 57 రన్స్) ఒంటరి పోరాటం చేశాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్స్ విఫలం కావడంతో రాజస్థాన్ ముందు కోల్‌కతా సింపుల్ టార్గెట్‌ను విధించింది. రాజస్థాన్ బౌలర్లలో చాహల్ 4 వికెట్లతో ఆకట్టుకున్నాడు.
కాగా ఈ ఓటమితో కోల్‌కతా ప్లేఆఫ్స్ అవకాశాలు కనుమరుగయ్యాయి. 12 మ్యాచుల్లో ఏడు ఓటములు, ఐదు విజయాలతో ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించడం దాదాపు ఖాయమైంది.