Yashasvi Jaiswal: ఇలాంటి బ్యాటింగ్ ఈ మధ్యకాలంలో చూడలేదు: యశస్విపై కోహ్లి ప్రశంసలు
12 May 2023, 8:07 IST
- Yashasvi Jaiswal: ఇలాంటి బ్యాటింగ్ ఈ మధ్యకాలంలో చూడలేదు అంటూ యశస్విపై కోహ్లి ప్రశంసలు కురిపించాడు. అటు కేఎల్ రాహుల్, సూర్య కుమార్ లాంటి ప్లేయర్స్ కూడా సోషల్ మీడియా ద్వారా యశస్విని ఆకాశానికెత్తారు.
యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్
Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్.. ఈ సీజన్ ఐపీఎల్లో సంచలనాలు క్రియేట్ చేస్తున్న ఈ రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ గురువారం (మే 11) కేకేఆర్ తో మ్యాచ్ లో తన విశ్వరూపం చూపించాడు. కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో ఐపీఎల్ రికార్డులను బ్రేక్ చేసిన ఈ యువ బ్యాటర్ పై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇలాంటి బ్యాటింగ్ చూడలేదంటూ కింగ్ కోహ్లియే అనడం విశేషం.
యశస్వి ఇన్నింగ్స్ చూసిన తర్వాత విరాట్ ఓ ఇన్‌స్టా స్టోరీ పోస్ట్ చేశాడు. "వావ్, ఈ మధ్య కాలంలో నేను చూసిన బెస్ట్ బ్యాటింగ్ లలో ఇదీ ఒకటి. అద్భుతమైన టాలెంట్" అనే కామెంట్ చేసి, యశస్విని ట్యాగ్ చేశాడు. అటు యశస్వి ఎవరి రికార్డు అయితే బ్రేక్ చేశాడో ఆ కేఎల్ రాహుల్ కూడా అతన్ని ఆకాశానికెత్తాడు. యశస్విని ట్యాగ్ చేస్తూ సింపుల్ గా హ్యాట్సాఫ్ అన్నట్లుగా ఓ జిఫ్ ఫైల్ అతడు పోస్ట్ చేశాడు.
యశస్వి కంటే ముందు 14 బంతుల్లో హాఫ్ సెంచరీతో ఈ రికార్డు కేఎల్ రాహుల్, ప్యాట్ కమిన్స్ ల పేరిట ఉండేది. ఇక మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ సూర్య కుమార్ కూడా యశస్విని ప్రశంశిస్తూ ట్వీట్ చేశాడు. "స్పెషల్ ఇన్నింగ్స్. స్పెషల్ ప్లేయర్. హ్యాట్సాఫ్" అని సూర్య అన్నాడు. తానెప్పుడూ ఇలాగే ఆడాలని అనుకున్నట్లు మ్యాచ్ తర్వాత జైస్వాల్ చెప్పాడు.
"ఎప్పుడూ ఇలాగే ఆడాలని నా మనసులో ఉంటుంది. ఇవాళ చాలా బాగా అనిపించింది. నేను అనుకున్నవన్నీ జరిగాయని కాదు. నేను సరిగా సిద్ధమవుతాను. నన్ను నేను నమ్ముతాను. ఫలితాలు వాటంతట అవే వస్తాయని నాకు తెలుసు. విన్నింగ్ షాట్ గొప్ప అనుభూతి. మ్యాచ్ ముగించాలని అనుకుంటాను. నెట్ రన్‌రేట్ గురించే నేను, సంజూ ఆలోచించాం. మ్యాచ్ ను సాధ్యమైనంత త్వరగా ముగించాలని భావించాం" అని యశస్వి అన్నాడు.