Chahal Record: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన యుజువేంద్ర చహల్.. బ్రావో రికార్డు బ్రేక్
11 May 2023, 21:11 IST
- Chahal Record: ఐపీఎల్లో చరిత్ర సృష్టించాడు యుజువేంద్ర చహల్. డ్వేన్ బ్రావో రికార్డు బ్రేక్ చేశాడు. లీగ్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా చహల్ నిలిచాడు.
ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచిన చహల్ ను అభినందిస్తున్న రాయల్స్ ప్లేయర్స్
Chahal Record: ఐపీఎల్ 2023లో మరో ఆల్ టైమ్ రికార్డు బ్రేక్ అయింది. ఈసారి రాజస్థాన్ రాయల్స్ బౌలర్ యుజువేంద్ర చహల్ చరిత్ర సృష్టించాడు. ఇన్నాళ్లూ డ్వేన్ బ్రావో పేరిట ఉన్న రికార్డును తిరగరాస్తూ.. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా నిలవడం విశేషం. బ్రావో 183 వికెట్లు తీయగా.. చహల్ 184 వికెట్ తో ఆ రికార్డు బ్రేక్ చేశాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో చహల్ ఈ రికార్డు తన పేరిట రాసుకున్నాడు. కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణా వికెట్ తీయడం ద్వారా చహల్ రికార్డు బుక్కుల్లోకి ఎక్కాడు. చహల్ 143వ మ్యాచ్ లోనే ఈ రికార్డు అందుకున్నాడు. బ్రావో 161 మ్యాచ్ లలో 183 వికెట్లతో ఐపీఎల్ కెరీర్ ముగించాడు. అయితే అతని కంటే 18 మ్యాచ్ ల ముందుగానే చహల్ అత్యధిక వికెట్ల రికార్డు బ్రేక్ చేయడం విశేషం.
కేకేఆర్ తో మ్యాచ్ లో తాను వేసిన తొలి ఓవర్ రెండో బంతికే వికెట్ తీశాడు. ఇక చహల్ ఐపీఎల్ కెరీర్ లో ఒక మ్యాచ్ లో ఐదు వికెట్లు ఒకసారి తీయగా.. నాలుగు వికెట్లను ఐదుసార్లు తీశాడు. 40 పరుగులకు 5 వికెట్లు అతని బెస్ట్ బౌలింగ్. చహల్ సగటు 21.6 కాగా.. ఎకానమీ రేటు 7.65. చహల్, బ్రావో తర్వాత అత్యధిక వికెట్ల టాప్ 5 లిస్టులో ముగ్గురు ఇండియన్ బౌలర్లే ఉన్నారు.
ఆ ముగ్గురు కూడా ఇప్పటికీ ఐపీఎల్ ఆడుతుండటం విశేషం. మూడోస్థానంలో పియూష్ చావ్లా ఉన్నాడు. చావ్లా 176 మ్యాచ్ లలో 174 వికెట్లు తీసుకున్నాడు. ఇక అమిత్ మిశ్రా నాలుగో స్థానంలో ఉన్నాడు. అతడు 160 మ్యాచ్ లలో 172 వికెట్లు తీశాడు. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ లోనే ఉన్న మరో బౌలర్ అశ్విన్ 196 మ్యాచ్ లలో 171 వికెట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.
కేకేఆర్ తో మ్యాచ్ లో చహల్ 4 ఓవర్లలో కేవలం 25 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. దీంతో ఐపీఎల్లో ఇప్పటి వరకూ చహల్ 143 మ్యాచ్ లలో 187 వికెట్లతో టాప్ లో ఉన్నాడు. మూడోస్థానంలో ఉన్న చావ్లా కంటే అతడు 13 వికెట్లు ఎక్కువ తీసుకున్నాడు. ఇక ఈ సీజన్ లో 12 మ్యాచ్ లలో 20 వికెట్లతో పర్పుల్ క్యాప్ కూడా అతని దగ్గరే ఉంది.