MI Records in IPL: రెండు ఐపీఎల్ ఆల్‌టైమ్ రికార్డులను బ్రేక్ చేసిన ముంబై ఇండియన్స్
MI Records in IPL: రెండు ఐపీఎల్ ఆల్‌టైమ్ రికార్డులను బ్రేక్ చేసింది ముంబై ఇండియన్స్. ఆర్సీబీతో మంగళవారం (మే 9) జరిగిన మ్యాచ్ లో 200 పరుగుల భారీ టార్గెట్ చేజ్ చేయడం ద్వారా ఈ రికార్డులను తన పేరిట రాసుకుంది.
MI Records in IPL: ఐపీఎల్లో ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ తాజాగా రెండు రికార్డులను సొంతం చేసుకుంది. ఐపీఎల్లో ఇప్పటి వరకూ నమోదు కాని రికార్డులు అవి. సూర్యకుమార్ యాదవ్ మరోసారి చెలరేగిపోవడంతో ముంబై 200 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.3 ఓవర్లలోనే చేజ్ చేసిన విషయం తెలిసిందే.
సూర్య కేవలం 35 బంతుల్లోనే 83 పరుగులు చేశాడు. ఈ విజయంతో ముంబై పాయింట్ల టేబుల్లో ఏకంగా 8 నుంచి 3వ స్థానానికి చేరుకోవడం విశేషం. ఈ విజయంతో రెండు ఆల్ టైమ్ రికార్డులు ఎంఐ సొంతమయ్యాయి.
ఒక సీజన్‌లో ఎక్కువ 200+ టార్గెట్స్ చేజ్ చేసిన ఎంఐ
ఐపీఎల్లో ఒకే సీజన్ లో ఎక్కువసార్లు 200 కంటే ఎక్కువ లక్ష్యాలను చేజ్ చేసిన రికార్డు ముంబై సాధించింది. ఐపీఎల్ 2023లో ఎంఐ 200 కంటే ఎక్కువ టార్గెట్ చేజ్ చేయడం ఇది మూడోసారి. గతంలో పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఈ రికార్డు ఉండేది. ఆ రెండు టీమ్స్ ఒక సీజన్ లో రెండేసి సార్లు 200 కంటే ఎక్కువ లక్ష్యాలను ఛేదించాయి.
పంజాబ్ కింగ్స్ 2014లో, చెన్నై సూపర్ కింగ్స్ 2018లో ఈ రికార్డు క్రియేట్ చేశాయి. ఈ సీజన్ లో ఆర్సీబీ కంటే ముందు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై కూడా 200కుపైగా టార్గెట్లను చేజ్ చేసింది.
మిగిలిపోయిన బాల్స్ రికార్డు
ఇక ఐపీఎల్లో 200, అంతకంటే ఎక్కువ టార్గెట్లను చేజ్ చేసే సమయంలో ఎక్కువ బంతులు మిగిలి ఉండగానే గెలిచిన రికార్డు కూడా ముంబై ఇండియన్స్ సొంతమైంది. ఈ మ్యాచ్ లో 200 లక్ష్యాన్ని ఎంఐ 16.3 ఓవర్లలోనే చేజ్ చేసింది. అంటే మరో 21 బంతులు మిగిలి ఉన్నాయి. గతంలో ఈ రికార్డు ఢిల్లీ క్యాపిటల్స్ పేరిట ఉండేది.
ఆ టీమ్ 2017లో గుజరాత్ లయన్స్ పై 208 పరుగుల లక్ష్యాన్ని 15 బంతులు మిగిలి ఉండగానే చేజ్ చేసింది. ఇక అంతకుముందు పంజాబ్ కింగ్స్ 2010లో కేకేఆర్ పై 201 పరుగుల లక్ష్యాన్ని 10 బంతులు మిగిలి ఉండగా చేజ్ చేసింది.
సంబంధిత కథనం