RCB vs MI: 200 టార్గెట్‌ను 16 ఓవర్లలోనే ఛేదించిన ముంబై - ఆర్‌సీబీ ఖాతాలో వరుసగా రెండో ఓటమి
RCB vs MI: మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్స్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. వారి జోరుతో 200 పరుగుల టార్గెట్‌ను ముంబై 16 ఓవర్లలోనే ఛేదించింది.

RCB vs MI: 200 పరుగుల టార్గెట్‌ను మరో 21 బాల్స్ మిగిలుండగానే ఛేదించి ఆర్‌సీబీని చిత్తుగా ఓడించింది ముంబై ఇండియన్స్. మంగళవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఆరు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ముంబై బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ 35 బాల్స్‌లోనే ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 83 పరుగులు చేశాడు.
సూర్యకుమార్‌తో పాటు నేహల్ వధేరా 34 బాల్స్‌లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 52 రన్స్, ఇషాన్ కిషన్ 21 బాల్స్‌లో నాలుగు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 41 రన్స్‌తో రాణించడంతో ఆర్‌సీబీ విధించిన 200 పరుగుల లక్ష్యాన్ని మరో 21 బాల్స్ మిగిలుండగానే ముంబై ఊదేసింది. ముంబై జోరు ముందు బెంగళూరు బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. హసరంగా, విజయ్ కుమార్ తలో రెండు వికెట్లు తీసిన ధారాళంగా పరుగులు ఇచ్చారు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. కెప్టెన్ డుప్లెసిస్ ( 41 బాల్స్‌లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 65 రన్స్), మ్యాక్స్‌వెల్ (33 బాల్స్‌లో ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 68 పరుగులు) హాఫ్ సెంచరీలతో రాణించారు.
విరాట్ కోహ్లి సింగిల్ రన్‌కు ఔటై నిరాశపరిచాడు. చివరల్లో దినేష్ కార్తిక్ 18 బాల్స్‌లో 30 పరుగులు చేయడంతో బెంగళూరు భారీ స్కోరు చేసింది. ముంబై బౌలర్లలో బెండార్ఫ్ మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు.