MI vs PBKS: ఉత్కంఠ పోరులో ముంబైని ఓడించిన పంజాబ్ - సూర్యకుమార్, గ్రీన్ పోరాటం వృథా
MI vs PBKS: ఐపీఎల్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 13 పరుగులు తేడాతో పంజాబ్ కింగ్స్ విజయాన్ని సాధించింది. ముంబైని గెలిపించేందుకు సూర్యకుమార్, గ్రీన్, రోహిత్ పోరాటం చేసినా జట్టుకు ఓటమి తప్పలేదు.
MI vs PBKS: ఐపీఎల్‌లో శనివారం ముంబై ఇండియన్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగింది. ముంబై పోరాడినా గెలుపు మాత్రం పంజాబ్‌నే వరించింది. 13 పరుగులు తేడాతో ముంబైపై పంజాబ్ కింగ్స్ విజయాన్ని అందుకున్నది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ట నష్టానికి 218 పరుగుల భారీ స్కోరు చేసింది. పంజాబ్ ఇన్నింగ్స్ నెమ్మదిగానే మొదలైనా చివరలో కెప్టెన్ సామ్ కరన్‌తో పాటు జితేన్ శర్మ, హర్‌ప్రీత్‌సింగ్ మెరుపులతో పంజాబ్ 218 పరుగులు చేసింది.
సామ్ కరన్ 29 బాల్స్‌లో నాలుగు సిక్సర్లు ఐదు ఫోర్లతో 55 రన్స్ చేయగా హర్‌ప్రీత్‌సింగ్ 28 బాల్స్‌లో నాలుగు ఫోర్లు రెండు సిక్సర్లతో 41 పరుగులు చేశాడు. జితేన్ శర్మ కేవలం ఏడు బాల్స్‌లోనే నాలుగు సిక్సర్లతో 25 రన్స్ చేసి పంజాబ్‌కు భారీ స్కోరును 200 దాటించాడు.
ముంబై బౌలర్లలో పీయూష్ చావ్లా మినహా మిగిలిన వారందరూ ధారాళంగా పరుగులు ఇచ్చారు. ఇషాన్ కిషన్ విఫలమైనా రోహిత్ శర్మ జోరుతో లక్ష్యఛేదనను ధాటిగానే ఆరంభించింది ముంబై.
రోహిత్ 27 బాల్స్‌లో మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 44 రన్స్ చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత కామెరూన్ గ్రీన్ (43 బాల్స్‌లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 67 రన్స్), సూర్య కుమార్ యాదవ్ (26 బాల్స్‌లో ఏడు ఫోర్లు మూడు సిక్సర్లతో 57 రన్స్) బ్యాట్ ఝులిపించడంతో ముంబై విజయం దిశగా సాగింది. కానీ కీలక సమయంలో వీరిద్దరు ఔట్ కావడం ముంబైని దెబ్బతీసింది.
చివరలో అర్షదీప్‌సింగ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడమే కాకుండా తిలక్‌వర్మ, నేహాల్‌లను ఔట్ చేయడంతో ముంబై ఓటమి ఖరారైంది. పంజాబ్ బౌలర్స్‌లో అర్షదీప్ సింగ్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు.