Dwayne Bravo as CSK Bowling Coach: ఐపీఎల్‌కు బ్రావో గుడ్‌బై.. చెన్నై బౌలింగ్‌ కోచ్‌గా కొత్త అవతారం-dwayne bravo as csk bowling coach as he retires as a player from ipl ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Dwayne Bravo As Csk Bowling Coach: ఐపీఎల్‌కు బ్రావో గుడ్‌బై.. చెన్నై బౌలింగ్‌ కోచ్‌గా కొత్త అవతారం

Dwayne Bravo as CSK Bowling Coach: ఐపీఎల్‌కు బ్రావో గుడ్‌బై.. చెన్నై బౌలింగ్‌ కోచ్‌గా కొత్త అవతారం

Hari Prasad S HT Telugu
Dec 02, 2022 04:49 PM IST

Dwayne Bravo as CSK Bowling Coach: ఐపీఎల్‌కు ప్లేయర్‌గా గుడ్‌బై చెప్పాడు డ్వేన్‌ బ్రావో. అయితే ఆ వెంటనే చెన్నై సూపర్‌ కింగ్స్ అతన్ని తమ బౌలింగ్‌ కోచ్‌గా నియమించింది.

డ్వేన్ బ్రావో
డ్వేన్ బ్రావో

Dwayne Bravo as CSK Bowling Coach: ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ డ్వేన్‌ బ్రావో ప్లేయర్‌గా ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాడు. శుక్రవారం (డిసెంబర్‌ 2) ఉదయం ఐపీఎల్‌ వేలం కోసం రిలీజ్ చేసిన ప్లేయర్స్‌ లిస్ట్‌లో బ్రావో పేరు లేని విషయం తెలిసిందే. అంతకుముందే అతన్ని రిలీజ్‌ చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్ ఇప్పుడు బౌలింగ్‌ కోచ్‌గా నియమించింది.

ఈ మేరకు చెన్నై టీమ్‌ ఓ స్టేట్‌మెంట్‌ రిలీజ్‌ చేసింది. ఐపీఎల్‌ ప్రారంభమైన 2008 నుంచి లీగ్‌తోనే ఉన్నాడు బ్రావో. చాలా సీజన్ల పాటు చెన్నైకి ఆడాడు. ఇక ఇప్పుడు బాలాజీ స్థానంలో చెన్నై బౌలింగ్‌ కోచ్‌గా కొత్త అవతారం ఎత్తనున్నాడు. వ్యక్తిగత కారణాలతో బాలాజీ ఏడాది పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించడంతో చెన్నై ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ కొత్త రోల్‌పై బ్రావో స్పందించాడు. "ఈ కొత్త ప్రయాణం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ప్లేయర్‌గా నా కెరీర్‌ మొత్తం ముగిసిన తర్వాత ఇలాంటి రోల్‌ చేపట్టాలని భావించాను. బౌలర్లతో కలిసి పని చేయడాన్ని ఎంజాయ్‌ చేస్తాను. ఇది నాలో ఉత్సాహం నింపుతోంది. ప్లేయర్‌ నుంచి కోచ్‌గా మారినా పెద్దగా తేడా ఏమీ లేదు. అప్పుడు కూడా నేను ఎక్కువగా బౌలర్లతోనే ఉండేవాడిని. బ్యాటర్ల కంటే ఒక అడుగు ముందే ఉండటానికి ఏం చేయాలో నేను సూచించేవాడిని. ఒక్కటే తేడా.. నేను ఇక మిడాన్‌ లేదా మిడాఫ్‌లో ఉండను అంతే" అని బ్రావో అన్నాడు.

ఇక ఐపీఎల్‌ చరిత్రలో తాను అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలుస్తున్నానని ఎప్పుడూ ఊహించలేదని బ్రావో చెప్పాడు. చరిత్రలో భాగమైనందుకు సంతోషంగా ఉందన్నాడు. ఐపీఎల్‌లో 161 మ్యాచ్‌లలో బ్రావో 183 వికెట్లు తీసుకున్నాడు. అంతేకాదు 1560 రన్స్‌ చేశాడు. అతని స్ట్రైక్‌ రేట్‌ 130. ఐపీఎల్‌లో మొదటి మూడు సీజన్లు ముంబైకి ఆడిన బ్రావో.. 2011 నుంచి చెన్నైతోనే ఉన్నాడు.

2011, 2018, 2021లలో చెన్నై టైటిల్‌ గెలిచిన సమయంలో టీమ్‌తోనే ఉన్నాడు. 2014లో ఛాంపియన్స్‌ లీగ్‌ గెలిచిన చెన్నై టీమ్‌లోనూ అతడు సభ్యుడు. ఐపీఎల్‌లో రెండు సీజన్లు (2013, 2015) పర్పుల్‌ క్యాప్‌ గెలిచిన ఏకైక బౌలర్‌ బ్రావోనే. కేవలం చెన్నై తరఫునే 144 మ్యాచ్‌లు ఆడి 168 వికెట్లు తీసి, 1556 రన్స్‌ చేశాడు.

WhatsApp channel

టాపిక్