Impact Player in IPL 2023: ఐపీఎల్‌ 2023లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌.. అసలు ఏంటిది?-impact player in ipl 2023 as teams can now replace a player during a match ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Impact Player In Ipl 2023 As Teams Can Now Replace A Player During A Match

Impact Player in IPL 2023: ఐపీఎల్‌ 2023లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌.. అసలు ఏంటిది?

Hari Prasad S HT Telugu
Dec 02, 2022 04:18 PM IST

Impact Player in IPL 2023: ఐపీఎల్‌ 2023లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ అమలు చేయనుంది బీసీసీఐ. మ్యాచ్‌ ఫలితాలను తారుమారు చేయగల ఈ నిబంధన ఏంటి? ఇంపాక్ట్‌ ప్లేయర్‌ అంటే ఎవరు?

ఐపీఎల్ 2023లో కొత్తగా ఇంపాక్ట్ ప్లేయర్
ఐపీఎల్ 2023లో కొత్తగా ఇంపాక్ట్ ప్లేయర్

Impact Player in IPL 2023: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2023 నుంచి ఇంపాక్ట్‌ ప్లేయర్‌ను పరిచయం చేయనుంది బీసీసీఐ. బిగ్‌బాష్‌ లీగ్‌లోని ఎక్స్‌ ఫ్యాక్టర్‌ ప్లేయర్‌లాగే ఐపీఎల్‌లో ఈ ఇంపాక్ట్‌ ప్లేయర్‌ వ్యవహరిస్తాడు. అయితే నిబంధనల్లో కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి. ఈ కొత్త రూల్‌ను వచ్చే సీజన్‌ నుంచి అమలు చేయనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.

"ఇంపాక్ట్‌ ప్లేయర్‌ అనే కాన్సెప్ట్‌ను పరిచయం చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో తుది జట్టులోని ఒక ప్లేయర్‌ను మార్చుకునే వీలు దీని ద్వారా లభిస్తుంది" అని బీసీసీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఏంటీ ఇంపాక్ట్‌ ప్లేయర్‌?

రూల్‌ ప్రకారం రెండు టీమ్స్‌ తమ తుది జట్టులోని ఓ ప్లేయర్‌ను మ్యాచ్ జరుగుతున్న సమయంలోనూ మరో ప్లేయర్‌తో భర్తీ చేయవచ్చు. ఇది కచ్చితం ఏమీ కాదు. ఒకవేళ వాళ్లకు అది ఉపయోగపడుతుందనుకుంటే ఈ ఆప్షన్‌ తీసుకోవచ్చు. ఇప్పటికే సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ఈ నిబంధనను బీసీసీఐ అమలు చేసింది. ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల హృతిక్ షోకీన్ తొలి ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా నిలిచాడు.

అతన్ని తీసుకున్న తర్వాత ఢిల్లీ టీమ్ 71 రన్స్‌తో ఆ మ్యాచ్ గెలిచింది. ఆ లెక్కన మ్యాచ్‌ల ఫలితాలను తారుమారు చేసే సత్తా ఇంపాక్ట్‌ ప్లేయర్‌కు ఉంటుంది. ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్‌ లీగ్‌లోనూ ఎక్స్‌ ఫ్యాక్టర్‌ ప్లేయర్‌ పేరుతో ఈ నిబంధన అమల్లో ఉంది. ఈ ప్లేయర్‌ను ముందుగానే 12 లేదా 13వ ప్లేయర్‌గా ప్రకటించాలి. ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ 10వ ఓవర్‌ తర్వాత ఈ ప్లేయర్‌ను ఆయా టీమ్స్‌ తీసుకునే వీలుంటుంది.

ఇంపాక్ట్‌ ప్లేయర్‌.. నిబంధనలో కొంత మార్పు

ఇక ఐపీఎల్‌లో పరిచయం చేస్తున్న ఇంపాక్ట్ ప్లేయర్‌ నిబంధన కాస్త భిన్నంగా ఉంటుంది. రెండు ఇన్నింగ్స్‌లోనూ 14వ ఓవర్‌ ముగిసేలోపే ఈ ఇంపాక్ట్‌ ప్లేయర్‌ను బరిలోకి దించాల్సి ఉంటుంది. కెప్టెన్‌, హెడ్‌కోచ్‌, మేనేజర్‌ ఈ విషయాన్ని ఆన్‌ఫీల్డ్‌ అంపైర్లు, లేదా నాలుగో అంపైర్‌కు చెప్పాలి. ఒకవేళ గాయపడిన ప్లేయర్‌ స్థానంలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ను తీసుకుంటే.. ఆ గాయపడిన ప్లేయర్‌ మళ్లీ ఫీల్డ్‌లోకి వచ్చే ఛాన్స్‌ ఉండదు.

ఓ ఇంపాక్ట్‌ ప్లేయర్‌ను ఓవర్‌ ముగిసిన తర్వాతే తీసుకోవాల్సి ఉంటుంది. గాయపడిన సందర్భాల్లో అయితే ఇప్పుడున్న నిబంధనల ప్రకారమే ఇంపాక్ట్‌ ప్లేయర్‌ను ఆయా టీమ్స్ ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ బ్యాటింగ్‌ టీమ్‌ ఇంపాక్ట్‌ ప్లేయర్‌ను బరిలోకి దించాలని అనుకుంటే.. వికెట్‌ పడిన తర్వాత లేదంటే ఇన్నింగ్స్‌ బ్రేక్‌లో మాత్రమే చేయాలి. ముందుగానే ఈ విషయాన్ని నాలుగో అంపైర్‌కు చెప్పాలి.

WhatsApp channel

టాపిక్