IPL Auction 2023: ఐపీఎల్‌ వేలంలో 991 ప్లేయర్స్‌.. అత్యధిక బేస్‌ ప్రైస్‌లో 21 మంది ప్లేయర్స్‌-ipl auction 2023 as total 991 players registered for the auction to be held on december 23rd ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Ipl Auction 2023 As Total 991 Players Registered For The Auction To Be Held On December 23rd

IPL Auction 2023: ఐపీఎల్‌ వేలంలో 991 ప్లేయర్స్‌.. అత్యధిక బేస్‌ ప్రైస్‌లో 21 మంది ప్లేయర్స్‌

Hari Prasad S HT Telugu
Dec 02, 2022 10:10 AM IST

IPL Auction 2023: ఐపీఎల్‌ వేలంలో 991 ప్లేయర్స్‌ తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీళ్లలో రూ.2 కోట్ల అత్యధిక బేస్‌ ప్రైస్‌లో 21 మంది ప్లేయర్స్‌ ఉండటం విశేషం.

ఐపీఎల్ వేలం డిసెంబర్ 23న కొచ్చిలో జరగనుంది
ఐపీఎల్ వేలం డిసెంబర్ 23న కొచ్చిలో జరగనుంది (Twitter)

IPL Auction 2023: ఐపీఎల్‌ వేలం 2023 కోసం మొత్తం 991 మంది ప్లేయర్స్‌ లిస్ట్‌ను 10 ఫ్రాంఛైజీలకు గురువారం (డిసెంబర్‌ 1) అందించారు. వీళ్లలో గరిష్ఠంగా 87 మంది ప్లేయర్స్‌ను తీసుకునే వీలుంది. వీళ్లలో 30 వరకూ విదేశీ ప్లేయర్స్‌ ఉండొచ్చు. ఒక్కో టీమ్‌లో గరిష్ఠంగా 25 మంది ప్లేయర్స్‌ ఉండే వీలుంది. ఈ మొత్తం 991 మంది ప్లేయర్స్‌లో 714 మంది ఇండియన్‌, 277 మంది విదేశీ ప్లేయర్స్‌ ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్‌ వేలం డిసెంబర్‌ 23న కొచ్చిలో జరగనున్న విషయం తెలిసిందే. ఇక అత్యధికంగా రూ.2 కోట్ల బేస్‌ ప్రైస్‌ కోసం 21 మంది ప్లేయర్స్ రిజిస్టర్‌ చేసుకున్నారు. వీళ్లలో 2022 వరల్డ్‌కప్‌ ఫైనల్లో ప్లేయర్‌ ఆఫ్‌ మ్యాచ్‌గా నిలిచిన సామ్‌ కరన్‌ కూడా ఉన్నాడు. అయితే బెన్‌ స్టోక్స్‌, కామెరాన్‌ గ్రీన్‌, కేన్‌ విలియమ్సన్‌, నికొలస్‌ పూరన్‌లాంటి స్టార్‌ ప్లేయర్స్‌ మాత్రం ఈ రూ.2 కోట్ల బేస్‌ ప్రైస్‌లో లేకపోవడం గమనార్హం.

ఈ మొత్తం 991 మంది ప్లేయర్స్‌ లిస్ట్‌ను మరోసారి షార్ట్‌ లిస్ట్‌ చేస్తారు. ఫ్రాంఛైజీల అభిప్రాయం మేరకు ఈ లిస్ట్‌ను తగ్గిస్తారు. దీనికోసం వాళ్లకు డిసెంబర్‌ 9 వరకూ సమయం ఇచ్చారు.

ఇక ఐపీఎల్‌ వేలం చరిత్రలో తొలిసారి ఒక్క ఇండియన్ ప్లేయర్‌ కూడా రూ.2 కోట్ల అత్యధిక బేస్‌ ప్రైస్‌లో లేకపోవడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన వాళ్లలో 19 మంది ఇండియన్‌ ప్లేయర్స్ ఈ వేలంలో ఉన్నారు. ఇందులో రహానే, ఇషాంత్‌ శర్మ, మయాంక్ అగర్వాల్‌లాంటి వాళ్లు ఉన్నారు. మయాంక్‌ రూ.కోటి బేస్‌ప్రైస్‌లో, రహానే రూ.50 లక్షల బేస్‌ప్రైస్‌లో ఉన్నారు. ఇక ఇషాంత్‌ రూ.75 లక్షలతో రేసులో ఉండనున్నాడు.

వేలంలో వీళ్లపైనే ఫోకస్‌

ఈసారి వేలంలో అత్యధిక ధర పలుకుతారని భావిస్తున్న వాళ్లలో అందరూ విదేశీ ప్లేయర్సే ఉన్నారు. ముఖ్యంగా ఇంగ్లండ్‌ ప్లేయర్స్ సామ్‌ కరన్‌, బెన్‌ స్టోక్స్‌, ఆస్ట్రేలియా ప్లేయర్‌ కామెరాన్‌ గ్రీన్‌లపైనే అందరి కళ్లూ ఉన్నాయి. గ్రీన్‌కు ఇదే తొలి ఐపీఎల్‌ వేలం కాగా.. స్టోక్స్‌, కరన్‌లకు ఇప్పటికే ఐపీఎల్‌ అనుభవం ఉంది. ఇండియా నుంచి మయాంక్‌ అగర్వాల్‌ మాత్రమే కాస్త బిడ్లు ఆకర్షించే అవకాశాలు ఉన్నాయి. అతన్ని పంజాబ్‌ కింగ్స్‌ టీమ్‌ రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే.

2021 సీజన్‌లో చివరిసారి కరన్‌, స్టోక్స్‌ ఐపీఎల్‌లో ఆడారు. ఆ సీజన్‌లో కరన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్‌కు, స్టోక్స్‌ రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆడారు. అయితే గాయం కారణంగా స్టోక్స్‌ ఆ సీజన్‌ మధ్యలోనే వెళ్లిపోయాడు. 2018 వేలంలో స్టోక్స్‌ను రూ.12.5 కోట్లు పెట్టి రాయల్స్‌ కొనుగోలు చేసింది. ఆ తర్వాత మూడేళ్లూ అదే టీమ్‌ అతన్ని రిటేన్‌ చేసుకుంటూ వచ్చింది. 2022లో స్టోక్స్‌ ఆడలేదు. ఇక ఈసారి ఐపీఎల్‌ వేలం లిస్ట్‌ నుంచి డ్వేన్‌ బ్రావోలాంటి స్టార్‌ ప్లేయర్స్‌ మిస్‌ అయ్యారు. బ్రావోను చెన్నై సూపర్‌ కింగ్స్‌ రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే.

రూ.2 కోట్ల లిస్ట్‌లో ప్లేయర్స్‌: కూల్టర్‌ నైల్‌, కామెరాన్‌ గ్రీన్‌, ట్రెవిస్‌ హెడ్, క్రిస్‌ లిన్‌, టామ్ బాంటన్‌, సామ్‌ కరన్‌, క్రిస్‌ జోర్డాన్‌, టైమాల్‌ మిల్స్, జేమీ ఓవర్టన్‌, క్రెయిగ్‌ ఓవర్టన్‌, ఆదిల్ రషీద్‌, ఫిల్‌ సాల్ట్‌, బెన్‌ స్టోక్స్‌, ఆడమ్‌ మిల్న్‌, జిమ్మీ నీషమ్, కేన్‌ విలియమ్సన్‌, రైలీ రూసో, రాసీ వెండెర్‌ డుసెన్‌, ఏంజెలో మాథ్యూస్, పూరన్‌, హోల్డర్‌.

రూ.1.5 కోట్ల లిస్ట్‌లోని ప్లేయర్స్‌: సీన్‌ అబాట్‌, రైలీ మెరెడిత్‌, జై రిచర్డసన్‌, ఆడమ్‌ జంపా, షకీబుల్‌ హసన్‌, హ్యారీ బ్రూక్, విల్‌ జాక్స్‌, డేవిడ్‌ మలన్, జేసన్‌ రాయ్‌, షెర్ఫానె రూథర్‌ఫర్డ్‌

రూ.కోటి లిస్ట్‌లోని ప్లేయర్స్‌: మయాంక్‌ అగర్వాల్‌, కేదార్‌ జాదవ్‌, మనీష్ పాండే, మహ్మద్‌ నబీ, ముజీబుర్‌ రెహమాన్‌, మోయిసిస్‌ హెన్రిక్స్‌, ఆండ్రూ టై, జో రూట్‌, లూక్‌ వుడ్‌, మైకేల్‌ బ్రేస్‌వెల్‌, మార్క్‌ చాప్‌మన్‌, మార్టిన్‌ గప్టిల్‌, కైల్‌ జేమీసన్‌, మాట్‌ హెన్రీ, టామ్‌ లేథమ్, డారిల్‌ మిచెల్‌, హెన్రిచ్‌ క్లాసేన్‌, తబ్రైజ్‌ షంసి, కుశల్‌ పెరీరా, రోస్టన్‌ చేజ్‌, రఖీమ్ కార్న్‌వాల్‌, షాయ్‌ హోప్‌, అకీల్ హొస్సేన్‌, డేవిడ్ వీస్‌.

WhatsApp channel

టాపిక్