Yashaswi Jaiswal: ఐపీఎల్లో సరికొత్త రికార్డు.. 13 బాల్స్‌లోనే యశస్వి హాఫ్ సెంచరీ
11 May 2023, 22:18 IST
- Yashaswi Jaiswal: ఐపీఎల్లో సరికొత్త రికార్డు క్రియేట్ అయింది. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఐపీఎల్లో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కాగా.. ఓవరాల్ గా యువరాజ్ తర్వాత రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ కావడం విశేషం.
యశస్వి జైస్వాల్
Yashaswi Jaiswal: ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. లీగ్ హిస్టరీలో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రికార్డును తన పేరిట రాసుకున్నాడు. కేకేఆర్ తో గురువారం (మే 11) జరిగిన మ్యాచ్ లో జైస్వాల్ కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయడం విశేషం. గతంలో కేఎల్ రాహుల్ 14 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రికార్డును జైస్వాల్ బ్రేక్ చేశాడు.
7 ఫోర్లు, 3 సిక్స్ లతో 13 బంతుల్లోనే జైస్వాల్ ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. ఇక ఓవరాల్ గా కూడా 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన యువరాజ్ తర్వాత జైస్వాల్ రెండో స్థానంలో నిలిచాడు. 2007 టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ పై యువీ 12 బాల్స్ లోనే ఫిఫ్టీ చేసిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ లో యువరాజ్ ఒకే ఓవర్లో ఆరు సిక్స్ లు బాదిన రికార్డు కూడా ఉంది.
ఇక ఈ తాజా ఐపీఎల్ మ్యాచ్ లో కేకేఆర్ విసిరిన 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. పవర్ ప్లేలో దూసుకెళ్లింది. మొదటి బంతి నుంచే యశస్వి జైస్వాల్.. కేకేఆర్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో రాయల్స్ 3 ఓవర్లు ముగిసే సమయానికే 54 రన్స్ చేయడం విశేషం. కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణా బౌలింగ్ లో జైస్వాల్ 3 ఫోర్లు, 2 సిక్స్ లు కొట్టాడు. దీంతో ఆ ఒక్క ఓవర్లోనే అతడు 26 రన్స్ సమర్పించుకున్నాడు.
ఓవైపు జోస్ బట్లర్ సున్నాకే రనౌట్ అయినా.. జైస్వాల్ మాత్రం వెనుకడుగు వేయలేదు. బౌలర్లందరినీ చితకబాదాడు. ఈ ఏడాది టాప్ ఫామ్ లో ఉన్న యశస్వి.. ఈ మ్యాచ్ లో మరింత చెలరేగాడు.