IPL 2023 Flop Players: ప్రపంచకప్‌లో వీరిపైనే హోప్.. ఐపీఎల్‌లో మాత్రం ఫ్లాప్
05 May 2023, 16:42 IST
- IPL 2023 Flop Players: ఈ ఏడాది అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు వన్డే ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో టీమిండియా నుంచి కొంతమంది ఆటగాళ్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2023లో వారు ఘోరంగా విఫలమవుతున్నారు.
ప్రపంచకప్‌లో వీరిపైనే హోప్.. ఐపీఎల్‌లో మాత్రం ఫ్లాప్
IPL 2023 Flop Players: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ సగంపైనే పూర్తయింది. ఆటగాళ్లందరూ తమేంటో నిరూపించుకుంటూ సత్తా చాటుతున్నారు. ఎలాంటి అంచనాలు లేని ఆటగాళ్లు రాణిస్తుంటే.. టీమిండియాలో స్టార్ ఆటగాళ్లుగా ఉన్న కొంతమంది మాత్రం తమ స్థాయికి తగిన ప్రదర్శన చేయట్లేదు. వన్డే ప్రపంచకప్ కూడా ఈ ఏడాదే జరగనున్న తరుణంలో ఐపీఎల్‌లో వారు ఫ్లాప్ కావడం అభిమానులను కలవరపరుస్తోంది. గత కొద్దికాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న వీరు.. ఐపీఎల్‌లో రాణిస్తారని ఆశిస్తే.. ఇక్కడ కూడా విఫలమవడం గమనార్హం. ఇదే సమయంలో యశస్వీ జైస్వాల్, తిలక్ వర్మ, ఆయుష్ బదోనీ లాంటి యువ ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతూ వీరికి పోటీగా మారారు. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ 2023లో భారీ అంచనాలుండి ఐపీఎల్‌లో విఫలమవుతున్న స్టార్ క్రికెటర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
రోహిత్ శర్మ..
ఈ జాబితాలో ముందుగా వస్తున్న ఆటగాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. హిట్ మ్యాన్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేసి చాలా రోజులే అయింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన అతడు 20.44 సగటుతో కేవలం 184 పరుగులే చేశాడు. గత ఏడాది కాలంగా టీ20 ఫార్మాట్‌లో ఇబ్బంది పడుతున్న రోహిత్.. ఈ ఐపీఎల్‌లోనూ పేలవ ప్రదర్శనతో నిరూత్సాపరుస్తున్నాడు. అయితే వన్డేల్లో ఈ ఏడాది మెరుగ్గా ఆడుతున్నాడు. 36 ఏళ్ల హిట్ మ్యాన్ 243 వన్డేల్లో 48.63 సగటుతో 9,825 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. మరి 50 ఓవర్ల ఫార్మాట్‌లో రాణిస్తున్న హిట్ మ్యాన్.. ప్రపంచకప్‌లో ఏ మేరకు సత్తా చాటుతాడో వేచి చూడాలి.
కేఎల్ రాహుల్..
టీమిండియాలో అత్యంత కీలకమైన ఆటగాడుగా గుర్తింపు తెచ్చుకున్న కేఎల్ రాహుల్.. ఈ మధ్యకాలంలో పేలవ ప్రదర్శనతో నిరూత్సాహపరుస్తున్నాడు. టీ20 క్రికెట్‌లోనూ చాలా నిదానంగా ఆడుతూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఒకప్పుడు ఒత్తిడిలోనూ మెరుగ్గా ఆడే రాహుల్.. ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నాడు. ఈ ఐపీఎల్‌లో 9 మ్యాచ్‌ల్లో 34 సగటుతో 274 పరుగులు చేసిన రాహుల్ గణాంకాలు మెరుగ్గా ఉన్నప్పటికీ.. స్ట్రైక్ రేటు మాత్రం చాలా తక్కువగా ఉంది. 113 స్ట్రైక్ రేటుతో నిదానంగా ఆడుతున్న అతడి ఆటతీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి వన్డే క్రికెట్‌లో మెరుగైన గణాంకాలతో ఉన్న రాహుల్‌పై వన్డే ప్రపంచకప్‌లో అంచనాలు ఉన్నాయి.
శార్దూల్ ఠాకూర్..
ఒకానొక సమయంలో స్పెషలిస్ట్ బౌలర్‌గా కనిపించిన శార్దూల్ ఠాకూర్.. ప్రస్తుత ఐపీఎల్‌లో ఘోరంగా విఫలమవుతున్నాడు. 6 మ్యాచ్‌ల్లో అతడు కేవలం రెండే వికెట్లు తీశాడు. అది కూడా 11.58 భారీ ఎకానమీ రేటుతో బౌలింగ్ చేశాడు. బౌలింగ్ ఆల్ రౌండరైన శార్దూల్‌పై ఫ్యాన్స్ హోప్స్ పెట్టుకోగా.. అతడు విఫలం కావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే బ్యాటింగ్‌లో మాత్రం అతడు ఫర్వాలేదనిపిస్తున్నాడు. 183.64 స్ట్రైక్ రేటుతో ఈ సీజన్‌లో మెరుగ్గా ఆడుతున్నాడు. ఈ ఏడాది వన్డేల్లో కూడా మెరుగైన ప్రదర్శన చేశాడు. నాలుగు వన్డేల్లో 6.42 ఎకానమీ రేటుతో 6 వికెట్లు తీశాడు.
వాషింగ్టన్ సుందర్..
సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న వాషింగ్టన్ సుందర్.. ఈ ఐపీఎల్ ఘోరంగా ఫ్లాప్ అయ్యాడు. గాయం కారణంగా గత సీజన్ అంతా దూరమైన ఈ స్పిన్నర్.. ఈ ఐపీఎల్‌లో 7 మ్యాచ్‌లు ఆడి కేవలం 3 వికెట్లే తీశాడు. అందులోనూ 6 గేముల్లో వికెట్టే తీయలేదు. గాయం కారణంగా ఈ టోర్నీ మొత్తానికి అతడు వన్డేల్లో నిలకడగా ఆడాడు. గతేడాది 11 వన్డేల్లో 13 వికెట్లు తీశాడు. అంతేకాకుండా 20.30 సగటుతో 4.40 ఎకానమీ రేటుతో బౌలింగ్ చేశాడు.
ఉమ్రాన్ మాలిక్..
జమ్మూ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ తన వేగంతో ఎంతటి స్టార్‌కైనా చెమటలు పట్టించడంలో దిట్ట. అలాంటి ఉమ్రాన్ ఈ ఐపీఎల్‌లో పెద్దగా ప్రదర్శన చేయట్లేదు. గతేడాది తన అరంగేట్ర ఐపీఎల్ సీజన్‌లోనే 22 వికెట్లు పడకొట్టి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న ఈ పేసర్.. ఈ సారి మాత్రం విఫలమవుతున్నాడు. ఐపీఎల్ 2023లో ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన ఉమ్రాన్ మాలిక్.. 10.35 భారీ ఎకానమీ రేటుతో కేవలం 5 వికెట్లే తీశాడు. అయితే వన్డేల్లో మాత్రం అతడు రాణిస్తుండటం శుభపరిణామం. ఈ ఏడాది 8 వన్డేలు ఆడిన ఉమ్రాన్ మాలిక్ 13 వికెట్లు తీయడంతో.. వచ్చే ప్రపంచకప్‌లో టీమిండియాకు మంచి పేసర్ దొరికినట్లయింది. మరి ఐపీఎల్‌లో విఫలమవుతున్న అతడు.. ఏ మేరకు రాణిస్తాడో చూడాలి.