Sehwag Warns CSK: ఇలాగే కొనసాగితే ధోనీని బ్యాన్ చేస్తారు.. సీఎస్కేకు సెహ్వాగ్ వార్నింగ్
18 April 2023, 14:19 IST
- Sehwag Warns CSK: ఇలాగే కొనసాగితే ధోనీని బ్యాన్ చేస్తారు అంటూ సీఎస్కేకు సెహ్వాగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఆ టీమ్ పదే పదే స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడుతుండటంపై వీరూ ఇలా హెచ్చరించాడు.
ధోనీ, వీరేంద్ర సెహ్వాగ్
Sehwag Warns CSK: ఐపీఎల్ 2023లో మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ప్రతి మ్యాచ్ లోనూ ఫర్వాలేదనిపిస్తోంది. అయితే బౌలింగే వాళ్ల కొంప ముంచుతోంది. సోమవారం (ఏప్రిల్ 17) ఆర్సీబీతో మ్యాచ్ లోనూ ఆ టీమ్ 226 పరుగుల భారీ స్కోరు చేసినా.. చివరికి 8 పరుగుల తేడాతో గట్టెక్కింది. కీలకమైన బౌలర్లు దీపక్ చహర్, బెన్ స్టోక్స్, ముకేశ్ చౌదరి, సిమర్‌జీత్ సింగ్ లాంటి వాళ్లు గాయపడ్డారు.
దీంతో అంతగా అనుభవం లేని ఆకాశ్ సింగ్, తుషార్ దేశ్‌పాండేలాంటి వాళ్లను తుది జట్టులోకి తీసుకోవాల్సి వచ్చింది. దీనికితోడు ఆ టీమ్ ప్రతి మ్యాచ్ లోనూ భారీగా అదనపు పరుగులు ఇస్తోంది. వైడ్లు, నోబాల్స్ వేస్తూ బౌలర్లు స్లో ఓవర్ రేట్ కు కూడా కారణమవుతున్నారు. ఈ ఎక్స్‌ట్రాలు ఇవ్వడం మానుకోకపోతే.. తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని ధోనీ వార్నింగ్ ఇచ్చినా పరిస్థితిలో మార్పులేదు.
అయితే తాజాగా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఇదే వార్నింగ్ ఇచ్చాడు. స్లో ఓవర్ రేట్ ఇలాగే కొనసాగితే.. ధోనీపై నిషేధం విధించే పరిస్థితి వస్తుందని వీరూ అనడం గమనార్హం. ఇప్పటికే ప్రతి మ్యాచ్ లోనూ రెండు, మూడు ఓవర్లు అదనంగా వేస్తూ వస్తున్నారు. ఆర్సీబీతోనూ ఒక ఓవర్ అదనంగా వేశారు. దీనిని ఉద్దేశించి సెహ్వాగ్ ఈ కామెంట్ చేశాడు.
"ధోనీ అసలు సంతోషంగా కనిపించలేదు. ఎందుకంటే అతడు ఇంతకు ముందే బౌలర్లు వైడ్లు, నోబాల్స్ తగ్గించుకోవాలని చెప్పాడు. ఆర్సీబీతోనూ ఒక ఓవర్ అదనంగా వేయాల్సి వచ్చింది. ఇది ఇలాగే కొనసాగితే ధోనీపై నిషేధం విధిస్తారు. కెప్టెన్ లేకుండా సీఎస్కే బరిలోకి దిగాల్సిన పరిస్థితి తెచ్చుకోకూడదు. అతనికి ఉన్న మోకాలి గాయం చూస్తే ధోనీ మరికొన్ని మ్యాచ్ లే ఆడే అవకాశం కనిపిస్తోంది. బౌలర్లు ఇలాగే వైడ్లు, నోబాల్స్ వేస్తుంటే మాత్రం ధోనీ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది" అని సెహ్వాగ్ స్పష్టం చేశాడు.
ఈ ఏడాది ఐపీఎల్లో సీఎస్కే తరఫున తుషార్ దేశ్‌పాండే అత్యధికంగా అదనపు పరుగులు ఇచ్చాడు. ఆర్సీబీతో మ్యాచ్ లోనూ అతడు మూడు వైడ్లు వేశాడు. అయితే సెహ్వాగ్ మాత్రం స్పిన్నర్ మహీష్ తీక్షణ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. స్పిన్నర్లు వైడ్లు వేయడమేంటని, అది వాళ్ల నియంత్రణలోనే ఉంటుందని సెహ్వాగ్ అన్నాడు. ఇక సీఎస్కే బౌలింగ్ బలహీనంగా ఉందని, వాళ్లు సాధ్యమైనంత త్వరగా దీనిని పరిష్కరించకపోతే.. కష్టమవుతుందని వీరూ అభిప్రాయపడ్డాడు.