CSK vs RCB: చిన్నస్వామిలో పరుగుల వరద - ఉత్కంఠ పోరులో బెంగళూరును ఓడించిన చెన్నై
CSK vs RCB: సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ అసలైన టీ20 మజాను అందించింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాట్స్‌మెన్ చెలరేగడంతో పరుగుల వరద పారింది. ఎనిమిది పరుగులు తేడాతో బెంగళూరుపై చెన్నై విజయం సాధించింది.
CSK vs RCB: బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారింది. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య సోమవారం జరిగిన మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి 444 రన్స్ చేశారు. ఈ మ్యాచ్‌లో రెండు జట్ల బ్యాట్స్‌మెన్స్ 33 సిక్స్‌లు కొట్టారు. చివరి ఓవర్ వరకు థ్రిల్లింగ్‌గా సాగిన ఈ మ్యాచ్‌లో చివరకు చెన్నైనే విజయం వరించింది. ఎనిమిది పరుగులు తేడాతో చెన్నై గెలుపుబాట పట్టింది.
దంచి కొట్టిన కాన్వే, దూబే
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు చేసింది. ఫామ్‌లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ తొందరగానే పెవిలియన్ చేరినా కాన్వే, రహానే కలిసి చెన్నై స్కోరును పరుగులు పెట్టించారు. ధాటిగా ఆడే క్రమంలో రహానే (20 బాల్స్‌లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 37 రన్స్) ఔటయ్యాడు. ఆ తర్వాత శివమ్ దూబే కూడా ఎదురుదాడికి దిగడంతో చెన్నై స్కోరు పదిహేను ఓవర్లలోనే 170 పరుగులు దాటింది.
కాన్వే 45 బాల్స్‌లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 83 రన్స్ చేయగా శివమ్ దూబే 27 బాల్స్‌లో ఐదు సిక్సర్లు రెండు ఫోర్లతో 52 రన్స్ చేశాడు. మెయిన్, రాయుడు కూడా బ్యాట్ ఝులిపించడంతో చెన్నై 226 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో సిరాజ్ మినహా మిగిలిన వారందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
మ్యాక్స్‌వెల్ సిక్సర్ల వర్షం…
227 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన బెంగళూరు తొలి ఓవర్‌లోనే కోహ్లి వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత ఓవర్‌లో లోమర్ కూడా డకౌట్ కావడంతో కష్టాల్లో పడింది. కానీ కెప్టెన్ డుప్లెసిస్‌తో కలిసి మ్యాక్స్‌వెల్ బెంగళూరును విజయం దిశగా నడిపించాడు. ముఖ్యంగా మ్యాక్స్‌వెల్ సిక్సర్ల వర్షాన్ని కురిపించాడు. 36 బాల్స్‌లో 8 సిక్సర్లు, 3 ఫోర్లతో 76 రన్స్ చేశాడు.
డుప్లెసిస్ 33 బాల్స్‌లో నాలుగు సిక్సర్లు, ఐదు ఫోర్లతో 62 రన్స్ చేశాడు. కీలక సమయంలో వీరిద్దరు ఔట్ కావడం బెంగళూరును దెబ్బతీసింది. దినేష్ కార్తిక్ (14 బాల్స్‌లో 28 రన్స్). సుయాశ్ (11 బాల్స్‌లో 19 రన్స్) ధాటిగా ఆడేందుకు ప్రయత్నించి ఔట్ కావడంతో బెంగళూరు ఓటమి ఖరారైంది. విజయానికి ఎనిమిది పరుగులు దూరంలో 218 పరుగుల వద్ద బెంగళూరు కథ ముగిసింది. చెన్నై బౌలర్ తుషార్ దేశ్‌పాండే మూడు వికెట్లతో బెంగళూరును కట్టడి చేశాడు.